mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చిక్కుల్లో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం

1 గంట క్రితం

war
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 02:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

స్విస్‌ చర్చలు వాయిదా

లెబనాన్‌‌ను తగలబెట్టాలి : *ఇజ్రాయిల్‌ మంత్రి

నెతన్యాహుకు యుద్ధం మీదే *ఆసక్తి : అరాగ్చి

​బీరుట్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ప్రాథమిక ఒప్పందం అమలుకాకముందే అనిశ్చితిలో పడింది. లెబనాన్‌లో ఇజ్రాయిల్‌ దాడులు ఉధృతం కావడంతో, స్విట్జర్లాండ్‌లో జరగాల్సిన కీలక చర్చలు వాయిదా పడ్డాయి. ఈ పరిణామాలు కొత్తగా కుదిరిన శాంతి ఒప్పందాన్ని చిక్కుల్లో పడేశాయి.

​నిలిచిపోయిన చర్చలు..

స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో ఇరు దేశాల ప్రతినిధులు శుక్రవారం సమావేశం కావాల్సి ఉంది. లెబనాన్‌లో యుద్ధం ఆగిపోయే వరకు తాము చర్చలకు రాబోమని ఇరాన్ అధికారులు స్పష్టం చేయడంతో ఈ భేటీ రద్దయింది. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కూడా తన స్విట్జర్లాండ్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఒప్పందం అమలుపై చర్చించేందుకు పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే వంటి మధ్యవర్తిత్వ దేశాలు ఈజిప్టులోని అల్మేయిన్‌లో సమావేశం కావాల్సి ఉంది.

‌కొనసాగుతున్న దాడులు..

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇజ్రాయిల్‌ సైన్యం లెబనాన్‌‌పై ‌దాడులకు తెగబడింది. ఇజ్రాయిల్‌ దాడుల్లో కనీసం 47 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని, దక్షిణ లెబనాన్‌లో జరిగిన పోరులో నలుగురు ఇజ్రాయిల్‌ సైనికులు కూడా మరణించారని లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది.

​లెబనాన్‌‌ను తగలబెట్టండి : ఇజామర్‌ ‌బెన్‌

లెబనాన్‌‌పై దాడుల క్రమంలో నలుగురు సైనికులు మరణించారు. అనంతరం ఇజ్రాయిల్‌ ‌జాతీయ భద్రతా శాఖా మంత్రి ఇజామర్‌ ‌బెన్‌ ‌గ్వీర్‌ ‌శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. అందులో "లెబనాన్ మొత్తాన్ని తగలబెట్టండి" అని ఆదేశాలు ఇచ్చానని తెలిపారు. అలాగే "అమెరికన్ల పట్ల పూర్తి గౌరవంతో చెబుతున్నాం, మా బిడ్డల రక్తం, మా పౌరుల భద్రత బేరసారాలకు అతీతమైనవని ఇజ్రాయిల్‌ ‌ యావత్ ప్రపంచానికి స్పష్టం చేయాలి. లెబనాన్ మొత్తం తగలబెట్టాలి," అని బెన్ గ్విర్ ప్రకటనలో అన్నారు. బెన్ గ్విర్ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తీవ్రంగా మండిపడ్డారు. 'శాశ్వత యుద్ధం' తప్ప ఇజ్రాయిల్‌కు వేరే ఆసక్తి లేదని ఆయన అన్నారు. "ఇది ఎవరో యాదృచ్ఛిక జాతిహనన ఉన్మాది చేసిన వాగుడు కాదు. ఇది ఇజ్రాయిల్‌ ప్రభుత్వ జాతీయ భద్రతా మంత్రి చేసిన బహిరంగ ప్రకటన. టెల్ అవీవ్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న ఈ జాతిహనన మృత్యు సమూహం యావత్ మానవాళికి ముప్పు. అది మానవులందరినీ బెదిరిస్తుంది. శాశ్వత యుద్ధమే దాని ఏకైక ఆసక్తి," అని అరాఘ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు, ఇజ్రాయిల్‌ ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. హిజ్బుల్లా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. తాము ఆక్రమించిన దక్షిణ లెబనాన్‌‌లోని ప్రాంతాలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని, ఆక్రమణ కొనసాగుతుందంటూ చెప్పుకొచ్చారు.

​హర్మూజ్‌ జలసంధిలో ఊరట

ప్రతికూల పరిస్థితుల మధ్య ఒక సానుకూల పరిణామం చోటుచేసుకుంది. అమెరికాతో కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం, రాబోయే 60 రోజుల చర్చల కాలంలో హర్మూజ్‌ జలసంధి ద్వారా వెళ్లే నౌకలపై ఎటువంటి రుసుములు వసూలు చేయబోమని ఇరాన్ ప్రకటించింది. గురువారం రికార్డు స్థాయిలో 25 వాణిజ్య నౌకలు ఈ జలసంధిని దాటడం గమనార్హం. మరోవైపు లెబనాన్‌పై దాడులను ఆపి, అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణను గౌరవించాలని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-నోయెల్ ఇజ్రాయిల్‌ను కోరారు. ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకురావాలని ఆయన అమెరికాకు సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్