- కేంద్ర విద్యామంత్రిత్వ కార్యాలయానికి ఎస్ఎఫ్ఐ పాదయాత్ర
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ... పోలీసుల ఆంక్షలను ధిక్కరించి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన విద్యార్థులు ఢిల్లీలో కదంతొక్కారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, సిబిఎస్ఇ అవకతవకలపై చర్య తీసుకోవాలని కోరుతూ ఢిల్లీలో వందలాదిమంది విద్యార్థులు పాదయాత్ర చేపట్టారు. ఎస్ఎఫ్ఐ ఆందోళనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆందోళన చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీతో పాటు రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి విద్యార్థులు నిరసన తెలిపేందుకు దేశ రాజధానికి వచ్చారు. శుక్రవారం హరికిషన్ సింగ్ సుర్జిత్ భవన్ నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రను బారికేడ్లు ఉపయోగించి, విద్యార్థులను అరెస్టు చేసి విచ్ఛిన్నం చేయాలని పోలీసులు భావించారు. మాతా సుందరి కళాశాల సమీపంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను విద్యార్థులు నెట్టుకుంటూ ముందుకు సాగారు. అక్కడ నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆందోళన తీవ్రతరం కావడంతో పోలీసులు ఎస్ఎఫ్ఐ ప్రతినిధి బృందాన్ని విద్యా మంత్రిత్వ శాఖకు తీసుకెళ్లేందుకు అంగీకరించారు. ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్ ఎం సాజీ, ప్రధాన కార్యదర్శి సృజన్ భట్టాచార్య, ఉపాధ్యక్షురాలు శిల్పా సురేంద్రన్, సంయుక్త కార్యదర్శి ఐషీ ఘోష్ మంత్రిత్వ శాఖకు చేరుకుని వినతిపత్రాన్ని అందజేశారు. మంగళవారం డిమాండ్లపై సవివరమైన చర్చకు మంత్రిత్వశాఖ అధికారులు ఆహ్వానించారు. ఎస్ఎఫ్ఐ ఆందోళనను అణచివేసేందుకు ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా మోహరించాయి. తుపాకులు, బాష్ప వాయువుతో బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఆందోళనలో ఎస్‌ఎఫ్‌ఐ ఉపాధ్యక్షుడు సుభాష్ జాఖర్, తదితరులు పాల్గొన్నారు.
నీట్ సూసైడ్ బాధిత కుటుంబాలకు కోటి పరిహారమివ్వండి
ప్రధాని మోడీకి కాక్రోచ్ జనతా పార్టీ లేఖ
- నీట్ బాధిత కుటుంబీకులకు రూ.కోటి నష్ట పరిహారం ఇవ్వాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ప్రవేశ పరీక్షల వివాదాల వల్ల ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల దేశవ్యాప్తంగా 11 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అందులో ఐదు మరణాలు గత 48 గంటల్లోనే సంభవించాయని అన్నారు. గత రెండు నెలల్లో ఆత్మహత్యలకు పాల్పడిన పలువురు విద్యార్థుల కుటుంబాలను తాను వ్యక్తిగతంగా కలుసుకున్నానని పేర్కొన్నారు. వరుసగా జరుగుతున్న పేపర్ లీకేజీ సంఘటనలు, రీ-టెస్ట్ ఒత్తిడికి తట్టుకోలేక తీవ్ర మనస్తాపంతో ఉసురు తీసుకుంటున్న విద్యార్థుల కుటుంబాలలో తీవ్ర మానసిక ఆందోళనను రేకెత్తిస్తోందని అన్నారు. రీ-ఎగ్జామ్‌పై అపనమ్మకం ఏర్పడడం వల్ల విద్యార్థుల్లో ఆందోళన ఎక్కువైందన్నారు. జీవితం మొత్తం కష్టపడి పిల్లలను చదవిస్తే, ఆ కుటుంబాలు ఇప్పుడు పిల్లల్ని కోల్పోతున్నాయని పేర్కొన్నారు. భరించలేని మానసిక వేదనతో పాటు, ఈ కుటుంబాలు ఆర్థికంగా కూడా భారీగా నష్టపోయాయని పేర్కొన్నారు. చాలా కుటుంబాలు పెద్ద మొత్తంలో విద్యా రుణాలు తీసుకున్నాయని, విద్యా వ్యవస్థలోని లోపాలతో వారి ఆశలు ఆడియాసలయ్యాయని అన్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. విద్యాపరమైన నిరాశ కారణంగా ఇకపై ఏ యువ విద్యార్థి బలికాకుండా ఉండేందుకు అవసరమైన నిర్మాణాత్మక సంస్కరణలను తీసుకురావలని ప్రధాని మోడీకి సూచించారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జవాబుదారీతనంతో ఉండాలని అన్నారు. విద్యా వ్యవస్థలో జరుగుతున్న వరుస లోపాలు, పేపర్ లీకేజీల వల్ల ప్రజల్లో నమ్మకం పోయిందని, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు.








కామెంట్‌లు (0)