mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionభారతీయులు అత్యవసర సహాయం అందించాలి

1 గంట క్రితం

palestine
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 02:02 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- పాలస్తీనా విజ్ఞప్తి

న్యూఢిల్లీ : భారతదేశం, భారతీయులు సహాయం అందించి వేలాదిమంది పాలస్తీనీయుల ప్రాణాలను కాపాడాలని మనదేశంలో పాలస్తీనా రాయబారి అబ్దుల్లా ఎం.ఎ. అబుషవేష్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా కీలక మధ్యవర్తిగా ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య కుదిరిన గాజా శాంతి ప్రణాళిక అమలులో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ అన్యాయంగా దాడులు కొనసాగిస్తుండటంతో వెయ్యిమందికిపైగా ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. తమ దేశం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, సకాలంలో వైద్యం అందకపోతే అనేకమంది మరణించే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశంలో దెబ్బతిన్న ఆరోగ్య వ్యవస్థ కోసం వైద్య సహాయం, సామాగ్రిని అత్యవసరంగా పంపాలని భారత్‌ను అత్యవసరంగా కోరారు. "భారత్, భారత ప్రజలు కాకపోతే ఇంకెవరు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?" అని ప్రశ్నించిన ఆయన, సరైన సమయంలో సహాయం అందితే "వేలాది మంది పాలస్తీనియన్ల" ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. అనస్థీషియా, యాంటీబయాటిక్స్, డయాలసిస్ సామాగ్రి, రక్త నిల్వలు, శస్త్రచికిత్స పరికరాలు, సెలైన్, ఆసుపత్రి జనరేటర్లను నడపడానికి అవసరమైన ఇంధనం వంటి ప్రాథమిక అవసరాల నుంచి అత్యవసర వైద్య సామాగ్రి వరకూ కొరత తీవ్రంగా ఉందని, అనేక అంతర్జాతీయ మానవతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇజ్రాయెల్ దాడులు పాలస్తీనా ఆరోగ్య రంగాన్ని "పతనం అంచుకు" తీసుకొచ్చాయని, ఈ తరుణంలో తమ దేశానికి బ్రిటీష్‌ ‌వలస పాలన నాటి నుంచి మిత్ర దేశంగా ఉన్న భారత్‌ సహాయం చేయాలని కోరారు. "పాలస్తీనా ఆరోగ్య రంగాన్ని రక్షించడానికి అత్యవసరంగా చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ సమాజాన్ని, ముఖ్యంగా భారత ప్రభుత్వాన్ని, మానవతా సంస్థలను, వైద్య సంస్థలను, పౌర సమాజ సంస్థలను, ఇతర సంబంధిత భారతీయ, అంతర్జాతీయ సంస్థలను మా దేశం కోరుతోంది" అని ఆయన అన్నారు. పాలస్తీనాకు సహాయం అందించాల్సిన ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయాలని ఆయన ప్రధాన స్రవంతి మీడియా, దేశ యువతకు విజ్ఞప్తి చేశారు. పాలస్తీనా సమస్య కేవలం రాజకీయమైనది లేదా అంతర్జాతీయ చట్టానికి సంబంధించినది మాత్రమే కాదని, ఇది ప్రపంచ నైతిక బాధ్యతలకు కూడా సంబంధించినదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన అన్నారు."సంక్షోభ తీవ్రత ఆందోళనకరంగా ఉంది. గత సంవత్సరంలో, వెస్ట్ బ్యాంక్‌లోని పాలస్తీనా ప్రభుత్వ ఆసుపత్రులు సుమారు 65,000 శస్త్రచికిత్సలు నిర్వహించాయి. ప్రస్తుత సంవత్సరంలో, 19,500 శస్త్రచికిత్సలు మాత్రమే జరిగాయి, మందులు, సామాగ్రి, కార్యాచరణ సామర్థ్యాల కొరత కారణంగా ఈ ఏడాది జరగాల్సిన 11 వేలకుపైగా శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి," అని పేర్కొన్నారు. రద్దీగా ఉన్న నిర్వాసిత శిబిరాలు, కుప్పకూలిన పారిశుధ్య వ్యవస్థలు, స్వచ్ఛమైన నీటి కొరత ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయని అబుషవేష్ తెలిపారు. పాలస్తీనా జాతిని నిర్మూలించే లక్ష్యంగా ఇజ్రాయిల్‌ ‌ సైనిక దాడులకు పాల్పడుతోందని, వైద్య మౌలిక సదుపాయాలను విధ్వంసం చేసిందని, ఆర్థిక దిగ్బంధనం చేపట్టిందని, వీటి ఫలితంగా తమ దేశం గతంలో ఎన్నడూ లేనంత మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని చెప్పారు. ఇజ్రాయిల్‌ ‌దాష్టీకంతో ఆదాయ వనరులను కోల్పోయిన పాలస్తీనియన్లకు ప్రభుత్వం ఆరోగ్య బీమా కల్పించిందని, ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో ప్రభుత్వ ప్రజారోగ్య వ్యవస్థ ధ్వంసమైందని ఆయన వివరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్