- అంతర్జాతీయంగా పడిపోయిన చమురు ధరలు
- పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్
న్యూఢిల్లీ: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఒయు) పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) పొలిట్ బ్యూరో ఆశాభావం వ్యక్తం చేసింది. ఇరాన్‌పై అమెరికా - ఇజ్రాయిల్ సాగిస్తున్న అకారణ దురాక్రమణ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ ఒప్పందం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందని సిపిఎం పేర్కొంది. దీని ప్రకారం, రెండు దేశాలు పరస్పర సార్వభౌమాధికారాన్ని, ప్రాంతీయ సమగ్రతను గౌరవించుకోవాలని నిర్ణయించుకున్నాయి. తుది ఒప్పందం కుదిరే వరకు కాల్పుల విరమణను పాటించాలని అంగీకరించాయి. ప్రధానంగా, హర్మూజ్ జలసంధి నుండి వెళ్లే ఇరాన్ నౌకలపై ఉన్న దిగ్బంధనాన్ని అమెరికా తొలగించనుంది. ప్రతిగా, ఆ జలసంధి గుండా ఇతర నౌకల రాకపోకలకు ఇరాన్ అనుమతినిస్తుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన, ఎరువుల లభ్యతపై ఉన్న ఒత్తిడి తగ్గుతుందని సిపిఎం పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది.
ధరలు తగ్గించాలి..
అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ఇప్పటికే చమురు ధరలు భారీగా తగ్గడం ప్రారంభమయ్యాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం దేశంలో పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం డిమాండ్ చేసింది. అలాగే, రైతులకు అవసరమైన ఎరువులు, ముఖ్యంగా యూరియా కొరత లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని కోరింది.
సామ్రాజ్యవాదానికి చెంపపెట్టు
ఈ ఒప్పందం సామ్రాజ్యవాద దురాక్రమణకు ఉన్న పరిమితులను నిరూపిస్తోందని సిపిఎం పేర్కొంది. అమెరికా-ఇజ్రాయిల్ దాడులకు ఇరాన్ ప్రజలు తలొగ్గకుండా వీరోచితంగా పోరాడారని, ఫలితంగానే ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేసి, జప్తు చేసిన ఆస్తులను తిరిగి ఇచ్చేందుకు అమెరికా అంగీకరించిందని తెలిపింది. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించేందుకు కూడా అమెరికా అంగీకరించడం ఇరాన్ ప్రజల విజయమని కొనియాడింది.
ప్రజా పోరాటాల ఫలితమే
అమెరికాతో సహా, ప్రపంచవ్యాప్తంగా ప్రజల నుంచి వ్యక్తమైన తీవ్ర నిరసనల వల్లే అమెరికా ఈ ఒప్పందంపై సంతకం చేయాల్సి వచ్చిందని పొలిట్ బ్యూరో విశ్లేషించింది. ఇప్పటికైనా ఇజ్రాయిల్ ప్రజాభిప్రాయాన్ని గౌరవించి, లెబనాన్‌పై దాడులను ఆపాలని, ఐక్యరాజ్యసమితి నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించింది. అమెరికా-ఇజ్రాయిల్ ధోరణులకు వ్యతిరేకంగా ప్రపంచ ప్రజాభిప్రాయం ఉందనే విషయం భారత ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలని, వారితో అనవసరంగా జతకట్టడం మానుకోవాలని సిపిఎం పొలిట్ బ్యూరో హితవు పలికింది.








కామెంట్‌లు (0)