బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనాఫ్తలీన్‌ బాల్స్ తో జాగ్రత్త!

1 గంట క్రితం

Naphthalene Balls.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 04:50 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

బట్టలకు పురుగులు పట్టకుండా ఉండడానికి చాలామంది బీరువాలో లేదా అల్మారాలో కొన్ని నాఫ్తలీన్ బాల్స్ ను ఉంచుతారు. కొంతమంది బాత్రూమ్ ల్లో, ఇంటి మూలల్లోనూ పురుగులు రాకుండా ఉండడానికి ఈ బాల్స్ ను ఉపయోగిస్తారు. అయితే వీటి వల్ల అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. వీటి ఆవిరిని పీల్చితే మీ ఆరోగ్యానికి ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు.

నాఫ్తలీన్‌ సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థం నుంచి నేరుగా వాయు రూపంలోకి మారుతుంది. దీనినే సబ్లిమేషన్‌ అంటారు. దీన్ని బయటకు చూస్తే బాల్ గానే కనిపిస్తుంది. కానీ దాని అణువులు నెమ్మదిగా గాలిలోకి విడుదలవుతాయి. అంటే కనిపించని ఆవిరి మన చుట్టూ వ్యాపిస్తూనే ఉంటుంది. నాఫ్తలీన్‌ ఆవిరులను పదేపదే పీల్చడం సురక్షితం కాదు. ఈ ఆవిరిని తరచూ పీలుస్తుంటే తలనొప్పి, వికారం, తల తిరగడం, కళ్లలో లేదా ముక్కులో మంట, నీరసం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అధిక స్థాయిలో నాఫ్తలీన్‌ శరీరంలోకి చేరితే ఎర్ర రక్త కణాలు దెబ్బతిని రక్తహీనత ఏర్పడే అవకాశం ఉంది. కాలేయం, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థపైనా ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరించారు.

బెడ్‌రూమ్‌లో... పిల్లల గదిలో అస్సలు వద్దు

నాఫ్తలీన్‌ బాల్స్ ను బెడ్‌రూమ్‌లు, పిల్లల గదులు, గాలి ప్రసరణ తక్కువగా ఉండే బాత్రూమ్‌లలో ఉపయోగించవద్దని వైద్యులు సూచిస్తున్నారు. మనుషులు ఎక్కువసేపు గడిపే గదుల్లో రసాయన ఆవిరికి గురయ్యే సమయం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా కిటికీలు మూసి ఉంటే ఆ ఆవిరి గదిలో పేరుకుపోయే అవకాశం ఉంది. అందుకే వీటిని బెడ్ రూమ్ ల్లో పెట్టకూడదు.

చిన్న పిల్లలు చేతికి దొరికిన వస్తువులను నోట్లో పెట్టుకుంటారు. ఈ బాల్స్ ను కూడా నోట్లో పెట్టుకుంటే ఆ రసాయనం వారి కడుపులోకి పోయి తీవ్రమైన విష ప్రభావం కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే వాటిని పిల్లలకు అందని ప్రదేశంలో ఉంచాలి. ఆహార పదార్థాలు పెట్టే డబ్బాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని నిల్వ చేయకూడదు. పిల్లలు ఆడుకునే లేదా నిద్రించే ప్రదేశాల్లో వాటిని ఉపయోగించకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

మరి బట్టలను పురుగల నుంచి ఎలా కాపాడుకోవాలి?

నాఫ్తలీన్‌ వాడకాన్ని తగ్గించాలంటే ప్రత్యామ్నాయంగా కొన్ని సాధారణ పద్ధతులు పాటించవచ్చు. బట్టలను నిల్వ చేసే ముందు అవి శుభ్రంగా, పూర్తిగా పొడిగా ఉండేలా చూసుకోవాలి. చెమట, శరీరంలోని నూనెలు, ఆహారపు అవశేషాలు బట్టలకు పురుగులను ఆకర్షించే అవకాశం ఉంటుంది.

బట్టలను గాలి చొరబడని కంటైనర్లు లేదా గార్మెంట్‌ బ్యాగుల్లో భద్రపరచాలి. అల్మారాలను పొడిగా, శుభ్రంగా, ఎక్కువ బట్టలతో నింపకుండా ఉంచాలి. చాలాకాలం నిల్వ చేసిన బట్టలను మధ్యమధ్యలో బయటకు తీసి పరిశీలించడం, అవసరమైతే ఉతికి లేదా గాలిలో ఆరబెట్టడం మంచిది. బట్టలు ఎక్కువ నాఫ్తలీన్‌ వాసన వస్తుంటే వాటిని బాగా గాలిలో ఆరబెట్టాలి. బట్టలను మాత్రమే శుభ్రం చేస్తే సరిపోదు.. వాటిని నిల్వ చేసిన అల్మారా లేదా కంటైనర్‌ కూడా శుభ్రపరచాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్