అనాదిగా ఇంటా బయటా హింసను ఎదుర్కొంటున్నదీ స్ర్తీలే. లింగ వివక్షతకు, శ్రామిక దోపిడీకి గురవుతున్నదీ మహిళలే. పైగా గత కొన్నేళ్లుగా.. బిజెపి పాలనలో మతతత్వానికి, కులతత్వానికి తొలి సమిధులవుతున్నదీ వీరే. ఇలాంటి తరుణంలో ఇటీవల మహిళా హక్కులు, సమస్యలు, స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడుతున్న ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) ఇటీవల 10 నుంచి 12 వరకు విజయవాడ కాంత్రి రెసిడెన్సీలో జాతీయ కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్బంగా ఐద్వా పూర్వ ప్రధాన కార్యదర్శి మరియం ధావలె 'ప్రజాశక్తి` తో ముచ్చటించారు. మహిళా సమస్యలపై ఆమె మాట్లాడిన పలు విషయాలు క్లుప్తంగా..
మహిళలు కోరుకునే స్వేచ్ఛ అసలు రూపం ఏంటి..?
తీవ్రమైన అన్యాయం, దోపిడీ, పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, విద్య ఆరోగ్య సంరక్షణ హక్కుల సమస్యలు ఉన్న ఈ దేశంలో మహిళలు జీవిస్తున్నారు. ఇటువంటి దేశంలో పితృస్వామ్యం కూడా ప్రబలంగా ఉందని మనకు తెలుసు. ఇలాంటి ప్రపంచంలో, మహిళలు సాధారణంగా సమాజంలో అత్యంత దిగువ స్థాయిలో జీవిస్తున్నారు. పేదరికానికి వారే మొదటి బాధితులు. పేదలలోకెల్లా అత్యంత పేదవారు మహిళలే. నిరుద్యోగంలోనూ అసంఘటిత రంగంలోనూ ఎక్కువగా ఉన్నది మహిళలే. కాబట్టి మహిళలు వీటన్నింటి నుండి స్వేచ్ఛను కోరుకుంటున్నారు. సమానమైన మానవులుగా జీవించే హక్కు కోసం వారు స్వేచ్ఛను కోరుకుంటున్నారు. అలా జీవించాలంటే వాళ్లు పేదరికం నుండి విముక్తి పొందాలి. ఉపాధి, సరైన ఆరోగ్య సంరక్షణ, సరైన విద్య, ఆస్తిలో సమాన హక్కులు ఉండాలి. అలాగే హింస నుండి స్వేచ్ఛ కూడా చాలా అవసరం. ఎందుకంటే సమాజంలో హింస పెరిగేకొద్దీ మహిళల జీవితం మరింత అభద్రతామయంగా మారుతుంది. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్నది ఇదే. మహిళలు నిరంతరం, అత్యాచారాలు, వేధింపులు, గృహహింసకు గురవుతున్నారు. ఇవన్నీ బహిరంగంగా జరుగుతున్నాయి. లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. కానీ బాధితులకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. పైగా నిందితులను రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహిళలు జీవించాలనుకునే ప్రపంచం ఇది కాదు. అందుకే వారు దీనిని మార్చడానికి పోరాడుతున్నారు. అలాగే మతతత్వ రాజకీయం, ద్వేషపూరిత రాజకీయం వంటి అంశాలు కూడా ఉన్నాయి. మతతత్వం, కులతత్వం మహిళలను వారి మొదటి బాధితులుగా మారుస్తాయి. ఇప్పుడు మనువాద శక్తులు (బిజెపి, ఆర్ఎస్ఎస్) మహిళలపై మనువాద విలువలు రుద్దడానికి ప్రయత్నిస్తున్నాయి. మనువాదం మహిళలను కనీసం మానవులుగా పరిగణించదు. కులం పేరుతో మహిళలు రెట్టింపు అణచివేతకు, రెట్టింపు అభద్రతా పరిస్థితులకు గురవుతున్నారు. కులం, పితృస్వామ్యం కలిసి ఎలా పనిజేస్తాయో ఇది రుజువు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సమానత్వం అనేది దూరపు మాట. అందుకే ఆల్ ఇండియా డెమెక్రటిక్ విమెన్స్ అసోసియేషన్ (ఐద్వా) మహిళల హక్కుల కోసం పోరాడుతున్నప్పుడే ఈ ప్రపంచాన్ని మార్చడానికి కూడా పోరాడాలి.
మహిళల రిజర్వేషన్ చట్టం ఆలస్యంపై మీ అభిప్రాయం..!?
బిజెపి - ఆర్ఎస్ఎస్ ప్రభుత్వానికి మహిళల రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం, అమలు చేయడం పట్ల తీవ్రత కానీ, నిజాయితీ కానీ లేవనేది మా స్పష్టమైన అభిప్రాయం. వారు అమలు చేయాలనుకుంటే చాలా సులభంగా అమలుచేయవచ్చు. కానీ డీ లిమిటేషన్, జనాభా లెక్కలతో దీన్ని ముడిపెట్టారు. ఇప్పుడు జనాభా లెక్కలు ఎప్పుడు జరుగుతాయి? నియోజకవర్గాల పునర్విభజన ఎప్పుడు జరగుతుంది? అంటే వాళ్లు ఉద్దేశపూర్వకంగా మహిళలను వంచన చేస్తున్నారు. ఇది మహిళల హక్కు. దానం కాదు. పార్లమెంట్, అసెంబ్లీ లలో నిర్ణయాలు తీసుకునే స్థాయిల్లో ఉండడం వాళ్ల హక్కు. కానీ పితృస్వామ్యం, అన్యాయమైన వ్యవస్థ వల్ల మహిళలు ఆ హక్కుకు దూరమవుతున్నారు. మోడీ గారు కేవలం 'మహిళల హక్కులు` అని నినాదాలు మాత్రమే ఇస్తున్నారు. నిజానికి ఆయన మనువాదం మహిళల హక్కులను అంగీకరించదు.
మహిళలు తమ హక్కుల కోసం, అలాగే తమ సమస్యలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపేలా ప్రేరేపిస్తున్న బలమైన అంశాలు ఏమిటి?
ధరలు పెరుగుదల సమస్య, నిరుద్యోగ సమస్య, ఆహార భద్రత సమస్య, హింస. ఇవి మహిళల జీవితాలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే అతిపెద్ద ప్రధాన సమస్యలు. మహిళలు ఇళ్లను నడపాల్సి ఉంటుంది. ఇంట్లో ఆహారం లేకపోతే పిల్లలు ఆకలితో అలమటిస్తారు. దీనిని చూడడానికి ఏ మహిళా ఇష్టపడదు. ఇంకా ఆమె అసంఘిత రంగంలో అత్యధికంగా దోపిడీకి గురయ్యే వివిధ విభాగాల్లో పనిచేస్తోంది. విబిగ్రామ్ జీ పథకంలో అత్యధిక సంఖ్యలో పనిచేసే కార్మికులు మహిళలే.. ఇంటా బయట వాళ్లు ఎదుర్కొనే సమస్యలే వీధుల్లోకి వచ్చి పోరాడేలా చేస్తున్నాయి.
- సంభాషణ : జ్యోతిర్మయి







కామెంట్‌లు (0)