దేశంలో ఇటీవల కాలంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు గమనిస్తే, అన్ని తరగతుల ప్రజలందరం కలసి ఉండగలమా? అనే సందేహం సహజంగానే కలుగుతుంది.
గిరిజన సంస్కృతి, జీవనం విచ్ఛిన్నం అటవీ హక్కుల చట్టం చేసి 20 సంవత్సరాలయిన పూర్వ రంగంలో ఈ ప్రశ్నను వేసుకోవాలి. మానవులు, అడవులు, గడ్డి భూములు, పొదలు, జంతువులు, కీటకాలు, పక్షులు అన్నీ భూమి అనే ఒకే ఇంటిని కలిగి ఉన్నాయని, దాన్ని మనం పంచుకోవాల్సి ఉందనే విషయాన్ని గుర్తించడానికి మనుషులకు ఇంకెంత సమయం పడుతుందోనని ఆశ్చర్యపోయే కాలంలో మనమున్నాం. కేవలం పరోపకార కారణాల కోసమే కాదు. ప్రాణి కోటి మనుగడ కోసం కూడా ఇది అవసరం. అడవులనేవి, పచ్చదనం లేకపోతే మానవ జాతి ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. ఇప్పటికే, మనం వడగాడ్పులకు, అకాల వర్షాలకు తరచూ గురవుతున్నాం. అంతకన్నా ముఖ్యంగా, విశాలమైన అడవులు కేవలం కలప, ఖనిజాలు, రియల్ ఎస్టేట్ కోసం తొలగించే ''వనరులు'' మాత్రమే కావు. అవి కొందరికి ఇళ్ళు. శతాబ్దాలుగా గిరిజన సమూహాలు ఈ అడవుల్లో నివసిస్తున్నాయి. చెట్లపై, భూములపై, పండ్లు, ఆకులపై వారిది సహజమైన హక్కు. యుగయుగాల నాటి జీవన విధానం అనేది తొలగించలేని హక్కు.
దశాబ్దాల పోరాటం తర్వాత లభించిన ఈ ఆలస్యపు గుర్తింపే, 2006లో అటవీ హక్కుల చట్టం రావడానికి కారణమైంది. స్వతంత్ర భారతదేశం తీసుకువచ్చిన అత్యంత వివేకవంతమైన, ఉపయుక్తమైన చట్టాలలో ఇది ఒకటి. కానీ దాని అమలు మాత్రం అస్తవ్యస్తంగా, అయిష్టంగా, అరకొర సమాచారంతో జరిగింది. దాడి కేవలం అటవీ ప్రాంతాలలో నివసించే గిరిజనుల భూములపై మాత్రమే కాకుండా, వారి జీవన విధానాలు, వారి మతాలు, భాషలు, దుస్తులు, సంస్కృతిపై కూడా జరుగుతోంది. ఆర్.ఎస్.ఎస్ దశాబ్దాలుగా వీటన్నింటినీ నాశనం చేస్తూ ఏకరూపతను డిమాండ్ చేస్తోంది. దాని బలహీనమైన సిద్ధాంతం భిన్నత్వానికి భయపడుతోంది. సంఘ్ పరివార్ '' ఏకరూప విధానం'' 2014 తర్వాత వేగం పుంజుకుంది. ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి స్వార్థపూరితమైన, అత్యాశ కలిగిన మతోన్మాద-కార్పొరేట్ బంధం తోడైంది.
కలిసి బతకడమా? ఏ రకంగా? అనిపించేలా మరొక సంఘటన ఇటీవల జరిగింది.
విద్యార్థులపై పాశవిక దాడి
తమను ''బొద్దింకలు'' అని నిందాపూరితంగా అన్నవారికి సమాధానంగా ఆ పేరుతోనే పార్టీ పెట్టిన కొందరు యువకులు... పేపర్ లీకులు, విద్యార్థుల ఆత్మహత్యలపై జవాబుదారీతనం డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్‌ను ముట్టడించారు. కొందరు నిరాహారదీక్ష చేశారు. కొందరు నినాదాలు చేశారు.
విద్యా వ్యవస్థలో అవినీతి చోటుచేసుకున్నప్పుడు, వైఫల్యం చెందినప్పుడు ఆత్మగౌరవం ఉన్న ఏ ప్రభుత్వమైనా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుండి తొలగించేది. మోడీ ప్రభుత్వం అలా చేయాలని కోరడం అన్యాయమైన కోరిక ఏమీ కాదు. అయితే ఇక్కడ ప్రభుత్వం తన మొదటి తప్పు చేసింది. అదేమిటంటే నిరసనను నిర్లక్ష్యం చేసింది. జులై 20 నాటికి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ పార్లమెంటుకు ప్రదర్శన చేయడానికి సిద్ధంగా ఒక లక్ష మందికి పైగా ఉన్న తిరుగుబాటు సమూహంగా మారింది. ఇక్కడ ప్రభుత్వం తన రెండో తప్పు చేసింది. వారిపై పోలీసులను వదిలింది. ఈ చౌకబారు ప్రతీకార చర్య తీవ్రమైన ప్రతికూల ఫలితాలను ఇచ్చింది. ఢిల్లీ పోలీసులు లాఠీలతో వచ్చి ఉండవచ్చు, కానీ 'జెన్ జీ' కెమెరాలతో వచ్చింది. పోలీసుల క్రూరత్వానికి సంబంధించిన అత్యంత అమానుషమైన దృశ్యాలను ప్రపంచమంతా చూసింది.
దారుణమైన లాఠీఛార్జీలు చేయడం, దుస్తులు చింపడం, అమ్మాయిలను మగ పోలీసులు లాగడం, విద్యార్థులను దారుణంగా చెంపదెబ్బలు కొట్టడం, పొడవటం, తన్నడం, ఉన్మాదంలో ఉన్న పోలీసులు విద్యార్థులను చితకబాదడం, నెట్టివేయడం, చివరకు జంతువులను వేటాడే పెల్లెట్ గన్నులను కూడా వాడడం మనం చూశాం. అప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది. విద్యార్థులు అలాంటి ప్రభుత్వంతో కలిసి బతకగలరా? విద్యార్థులే కాదు, అసలు ఎవరైనా బతగ్గలరా?
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం
తర్వాత రోజు సాయంత్రం, విపక్ష నేత రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రతిపక్ష సభ్యులు ప్రధాని నివాసం ముందు నిరసన తెలుపుతున్నప్పుడు, ప్రభుత్వం స్పందించడానికి ఎన్నో నాగరిక మార్గాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షంతో కలిసి పని చేయాలని ప్రజాస్వామ్యం డిమాండ్ చేస్తుంది. కానీ ప్రభుత్వం మళ్లీ అమానుషంగా బల ప్రయోగం చేసింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ తదితరులను పోలీసులు లాగి పారేసి పోలీసు వ్యాన్లలోకి ఎక్కించిన దారుణమైన దృశ్యాలను మనం చూశాం.
మణిపూర్ మారణహోమం
పాలకులు స్వార్థంతో రాజేసిన విద్వేష కుంపట్లు మూడేళ్ళ నుండి అత్యంత సున్నిత ప్రదేశమైన మణిపూర్ లో ఇంకా రగులుతూనే ఉన్నాయి. అత్యంత అమానవీయంగా, సభ్య సమాజం తల దించుకునేలా మహిళలను నగ్నంగా నడిపించిన సంఘటనలూ ఈ మోడీ కాలంలోనే చూశాం. ఇలాంటి చోట సహజీవనం సాధ్యమేనా? గాంధీ ఊహించిన స్వాతంత్ర్యం ఇదేనా?
ముస్లింలపై విద్వేషాలు
అన్నదమ్ముల వలెను జాతులు/మతములన్నీ మసలవలెనోయ్! అన్నాడు మహాకవి గురజాడ.
కాని... ముస్లింలపై విద్వేషపూరిత ప్రచారం జరుగుతోంది. వారిని శత్రువులుగా చిత్రిస్తూ, వారి ప్రార్థనా స్థలాలు పడగొట్టడం ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన ఎజెండాగా నేడు తయారైంది.
ఈ సంఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే. విచిత్రంగా ఈ అన్ని సందర్భాలలోనూ ప్రధాని మౌనంగానే ఉన్నారు. వీటికి మించి ఆయన మరో ఘాతుకానికి పాల్పడ్డారు.
ప్రశ్నతోనే పురోగతి-నేడు అదే దేశద్రోహం
ప్రశ్న అభివృద్ధికి మూలం. అలాంటి ప్రశ్నను అణగదొక్కేయడమే మోడీ మార్కు ప్రజాస్వామ్య సూత్రం. ‘దీమాగీ నక్సల్స్’ పేరున అసలు ఆలోచననే చంపేయాలని స్వాతంత్ర్య దినోత్సవం రోజునే నిస్సిగ్గుగా ప్రధాని ప్రకటించిన కాలంలో అన్ని మతాల వారంతా కలిసి బతకడం సాధ్యమేనా అన్న ప్రశ్న తప్పక ఉదయిస్తుంది.
పెరుగుతున్న వ్యక్తివాదానికి గురవుతున్న ప్రపంచంలో, గ్రామసభలు ఇప్పటికీ ఐక్యత యొక్క అపారమైన శక్తిని ప్రదర్శిస్తున్నాయి. ''కలిసి ఉండటం'', ''సముదాయం'' యొక్క అవసరాన్ని ప్రభుత్వం గుర్తిస్తుందనే ఆశావహ భావన ఇది.
గిరిజనులు, విద్యార్థులు, కార్మికులు, రైతులు, మహిళలు, ప్రతిపక్షాలు, ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు, దళితులు, ముస్లింలు - ఎవరినుండైనా సరే, ఈ ప్రభుత్వం వినడం నేర్చుకోవాలి. కేవలం తన భజనపరుల మాటలే కాదు, అందరి మాట వినాలి. ఉపేక్ష, తిరస్కారంతో లాఠీలను ఝుళిపించడం మాత్రమే కాకుండా, సానుభూతిని వ్యక్తీకరించడం నేర్చుకోవాలి.
విభజనలను సృష్టించడం వల్ల ఒక పరిమితి వరకు ఎన్నికల్లో గెలవడానికి సహాయపడవచ్చు. కానీ సుహృద్భావంతో సహజీవనం సాగించే వాతావరణాన్ని సృష్టించకుండా దేశాన్ని గెలుచుకోలేం. ప్రధాన న్యాయమూర్తి దురాలోచనతో చేసిన ఆ ఒక్క వ్యాఖ్యే చివరకు ఈ పాఠాన్ని గుర్తుచేస్తుందని ఆశిద్దాం.

అజ శర్మ






కామెంట్‌లు (0)