పర్యాటక ప్రాంతాల్లో చెత్త నిర్వహణ సాధారణ విషయం కాదు. హిమాలయాలు లాంటి ఎత్తైన ప్రాంతాల్లో అది ఇంకా కష్టం. రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతుంది. అయితే అరుణాచల్‌ప్రదేశ్‌లోని జెమితాంగ్ గ్రామాల ప్రజలు ఈ సమస్యకు చక్కని పరిష్కారాన్ని కనుగొన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా, దాన్ని 22 రకాలుగా విభజించి, తిరిగి వినియోగంలోకి తీసుకెళుతున్నారు. ఈ బృహత్తర కార్యక్రమం ఒక గ్రామంతో మొదలై ఇప్పుడు ఏకంగా 27 గ్రామాల ప్రజలు ఇందులో భాగస్వాములయ్యారు. వీరి సమష్టి కృషితో ఇప్పటివరకు దాదాపు 90 టన్నుల వ్యర్థాలను సేకరించారు.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని జెమితాంగ్ ప్రాంతం హిమాలయ పర్వతాల మధ్య ఉంది. ఇక్కడ గ్రామాలు ఒకదానికొకటి దూరంగా ఉంటాయి. దీంతో ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించడం అంత సులభం కాదు. నగరాల్లో మాదిరిగా చెత్త సేకరణ వాహనాలు ప్రతి వీధికీ వెళ్లే అవకాశం కూడా లేదు. దీంతో చెత్త నిర్వహణ బాధ్యతను తీసుకున్న ప్రజలు.. ఇంట్లో పేరుకుపోయిన వ్యర్థాలను వేర్వేరుగా ఉంచడం మొదలుపెట్టారు. ప్లాస్టిక్, గాజు, లోహ వస్తువులను కలగలిపి పడేయకుండా విడిగా సేకరించి పెడుతున్నారు. అంతేకాదు, పునర్వినియోగానికి పనికొచ్చే వస్తువులను శుభ్రం చేసి, ఆరబెట్టి సిద్ధంగా ఉంచుతారు. ఆదివారం రాగానే వాటిని నిర్దేశించిన సేకరణ కేంద్రాలకు తీసుకెళుతున్నారు. నిర్వహణ కేంద్రాల్లో ఈ చెత్తను తడి, పొడి అని రెండు రకాలుగా మాత్రమే విభజించరు. 22 విభాగాలుగా వేరు చేస్తారు. ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రతి కుటుంబం చెత్త నిర్వహణ కోసం నెలకు రూ.50 చొప్పున నిర్వహణ కేంద్రానికి అందిస్తోంది. ఈ మొత్తాన్ని కేంద్రం నిర్వాహకులు వ్యర్థాల సేకరణ, రవాణా వంటి అవసరాలకు వినియోగిస్తున్నారు.
వ్యర్థాలను వేరు చేసిన కేంద్రం వాటిని అక్కడి నుండి రీసైక్లింగ్ కేంద్రాలకు చేరుస్తుంది. మారుమూల పర్వత ప్రాంతాల్లో ఈ రవాణా కూడా సవాలుతో కూడుకున్నదే. అయినా ఎంతో సమర్థవంతంగా దాన్ని నిర్వహిస్తున్నారు. ఈ బాధ్యతలో మహిళా రైడర్లు భాగస్వాములవ్వడం కూడా అక్కడ కనిపిస్తోంది. ‘హిమాలయన్ ఫ్రింజెస్ ప్రాజెక్టు’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ‘ఫర్దర్ అండ్ బియాండ్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో మెర్విన్ కౌటిన్హో, రాజీవ్ రాథోడ్ ఈ కార్యక్రమానికి సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. మొట్టమొదట చుల్ల్యు గ్రామంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం క్రమంగా ఇతర ప్రాంతాలకూ విస్తరించింది. ప్రస్తుతం జెమితాంగ్‌లోని 27 గ్రామాలకు చెందిన సుమారు 6,000 మంది ఇందులో భాగస్వాములయ్యారు. మొత్తంగా 20,000 మందికి పైగా ప్రజలకు చేరువైంది.
ఈ సమష్టి కృషి ఫలితంగా ఇప్పటివరకు దాదాపు 90 టన్నుల వ్యర్థాలను సేకరించి, బాధ్యతాయుతంగా నిర్వహించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే 1,479 కిలోల వ్యర్థాలను సక్రమంగా నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ గ్రామస్తులు పెద్ద పెద్ద పనులు చేయడం లేదు. వ్యర్థంగా పడేసే చెత్తను సక్రమంగా నిర్వహిస్తున్నారు అంతే.. అయితే ఈ ఒక్క పని వల్ల గ్రామస్తులు ఇస్తున్న సందేశం మాత్రం చాలా గొప్పది.







కామెంట్‌లు (0)