‘విడాకులు పొందిన మహిళకు జనాభా గణనలో స్థానం ఎక్కడ? కుటుంబం అంటే ఎవరు? ఇల్లు అంటే ఎవరిది?’ అనే ఆలోచింపజేసే ప్రశ్నలను ప్రముఖ రచయిత్రి మౌమితా ఆలం లేవనెత్తారు. 2019లో భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తల్లిదండ్రుల ఇంటిని తన అధికారిక చిరునామాగా మార్చుకున్న ఆమెకు 2026 జనాభా గణన సందర్భంగా ఎదురైన అనుభవం ఈ ప్రశ్నలకు కారణమైంది. తన తండ్రి నుంచి వచ్చిన ఓ ఫోన్‌కాల్ తనకు ఇల్లు, కుటుంబం, స్త్రీ అస్తిత్వం గురించి ఎన్నో ప్రశ్నలు రేకెత్తించిందని ఆమె తెలిపారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే చదవండి.
‘‘ఒకరోజు మధ్యాహ్నం మా నాన్న నుంచి నాకు ఫోన్ వచ్చింది. జనాభా గణన 2026లో తన కుటుంబ సభ్యురాలిగా నన్ను చేర్చడం లేదని ఆయన చెప్పారు. నాన్న నాతో అలా మాట్లాడతారని నేను అస్సలు ఊహించలేదు. ‘ఇది నా కుటుంబం’ అని ఆయన అన్న మాటలు నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. 2019లో నా భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత అధికారిక అవసరాల కోసం నా చిరునామాను మా తల్లిదండ్రుల ఇంటికి మార్చుకున్నాను. కానీ అదే ఇంట్లో నేను కుటుంబ సభ్యురాలిని కాదని చెప్పడం నాకు ఇల్లు, కుటుంబం లేని వ్యక్తిననే భావనను కలిగించింది. జనాభా గణన పత్రంలో ఒక ఇంటికి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి. ఆన్‌లైన్ స్వయం నమోదు ఫారం ‘కుటుంబం’ అనే అంశంతో మొదలవుతుంది. అందులో కుటుంబ పెద్ద పేరును నమోదు చేయాలి. కుటుంబంలో కేవలం ఒక్కరే ‘పెద్ద’గా ఎందుకు ఉండాలి? పితృస్వామ్య సమాజంలో సహజంగానే వయసులో పెద్దవాడైన పురుషుడినే కుటుంబ పెద్దగా భావిస్తారు. కుటుంబానికి ఒక పెద్ద ఉండాలనే భావన ప్రజాస్వామ్యం, సమానత్వాల మౌలిక సూత్రాలకు విరుద్ధం.
పెళ్లి తర్వాత పుట్టింటికి తిరిగి వెళ్లడం మహిళకు ఎప్పుడూ ఒక అస్థిరమైన అనుభూతిగానే ఉంటుంది. మనం పుట్టింట్లో జీవితం ప్రారంభిస్తాం. ఆ తర్వాత భర్త ఇంటికి వెళ్తాం. చివరికి కుమారుడి ఇంట్లో జీవితాన్ని ముగిస్తాం. పుట్టిల్లు, మెట్టినిల్లు.. ఈ రెండు ఇళ్లలోనైనా మహిళలకు నిజంగా ‘ఇల్లు’ అనే భావన లభిస్తుందా? స్త్రీలకు ఇల్లు ఎప్పుడూ ప్రేమ, ఆప్యాయతలతో కూడిన వెచ్చని ఆశ్రయం కాకపోవచ్చు. చాలా సందర్భాల్లో అది అణచివేతను భరించాల్సిన ప్రదేశంగా మారుతుంది. సమాజం స్త్రీల కోసం నిర్దేశించిన ‘తండ్రి ఇల్లు - భర్త ఇల్లు - కొడుకు ఇల్లు’ అనే మార్గానికి భిన్నంగా ఏ స్త్రీ అయినా నడిస్తే, ఆమె అస్తిత్వమే ప్రశ్నార్థకమవుతుంది. కుటుంబం, రాష్ట్రం, దేశం ఊహల్లో కూడా ఆమెకు స్థానం లేకుండా పోతుంది. అందుకే జనాభా లెక్కల్లోనూ నాకు చోటు లేదు. ఒంటరి మహిళగా సొంతంగా నా కుటుంబాన్ని జనాభా గణనలో చేర్చుకోవడానికి నాకు అవకాశం లేదు. అలాంటప్పుడు కుటుంబం అనే భావనను పునర్నిర్వచించాల్సిన అవసరం లేదా? మన కుటుంబం అంటే ఎవరు? అనే ప్రశ్నను మనం వేసుకోవాలి.
మౌమితా ఆలం
నా తల్లిదండ్రులు మా అమ్మ తరపు అత్త దగ్గర నన్ను వదిలిపెట్టినప్పుడు నాకు కేవలం రెండేళ్లు. చిన్నతనం నుంచే కుటుంబంలో నా స్థానం అస్పష్టంగా ఉండేది. ఈ అనిశ్చితి నుంచి బయటపడేందుకు 21 ఏళ్ల వయసులో ఒక వ్యక్తిని జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాను. ఆ నిర్ణయం నన్ను మరిన్ని కష్టాలపాల్జేస్తుందని అప్పుడు తెలియదు. గృహహింసకు గురైన తర్వాత, తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్న సమయంలో, ప్రసవానికి 20 రోజుల ముందు నా భర్త మరో మహిళ కోసం నన్ను వదిలేశాడు. విడాకులు తీసుకుని పుట్టింటికి చేరాను. అప్పటికే పుట్టిల్లు, మెట్టినిల్లు అనే రెండు కుటుంబాలపైనా నాకు నమ్మకం పోయింది. అవి కుటుంబాలుగా కనిపించినప్పటికీ, నాకు నిజమైన కుటుంబంగా అనిపించలేదు. ఈ అనుభవాల తర్వాత కూడా నా కుటుంబ సభ్యుల పట్ల నేను కృతజ్ఞతగా ఉండాలని కోరుకున్నారు. కానీ అప్పటికే నాకు గొంతు వచ్చింది. చేతిలో కలం పట్టుకున్నాను. రాయడం మొదలుపెట్టాను. నా రచనను కూడా కుటుంబం ఒక నిషేధిత చర్యగా భావించింది. కుటుంబ ఆస్తిని అడగకుండా, త్యాగశీలమైన తల్లికి ప్రతిరూపంగా ఉండాలని వారు కోరుకున్నారు. నాకంటూ ఒక స్థానాన్ని కోరుకునే ఏ చర్య అయినా వారి దృష్టిలో అతిక్రమణే.
ఆస్తి విషయానికి వస్తే నాలాంటి స్త్రీలను అదృశ్యం చేయాలనే పితృస్వామ్య-భూస్వామ్య భావజాలం నుంచే మహిళలను కుటుంబ సభ్యులుగా గుర్తించని ధోరణి పుడుతోంది. భారతీయ మహిళలు దేశ వ్యవసాయ రంగ శ్రామికశక్తిలో 42 శాతానికి పైగా ఉన్నారు. గ్రామీణ వ్యవసాయ పనుల్లో 73 శాతం వరకు నిర్వహిస్తున్నప్పటికీ, సాగుకు అందుబాటులో ఉన్న భూమిలో వారికి 12.8 శాతం మాత్రమే యాజమాన్యం ఉంది. అధిక శ్రమకు, ఆస్తి హక్కులకు మధ్య ఉన్న ఈ అంతరం వల్ల లక్షలాది మంది మహిళా కార్మికులు అధికారికంగా రైతులుగా గుర్తించబడటం లేదు. ఫలితంగా వారు అనేక ప్రభుత్వ హక్కులు, ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. స్త్రీని యజమానిగా గుర్తించని పితృస్వామ్యమే కుటుంబంలో ఆమె అస్తిత్వాన్ని కూడా బలహీనపరుస్తోంది.
2026 జనాభా గణనలో విడాకులు తీసుకున్న లేదా వేరుగా నివసిస్తున్న కుమార్తెలను కుటుంబ సభ్యులుగా గుర్తించడానికి స్పష్టమైన విధానం ఉండాల్సింది. కుటుంబ నిర్మాణం మారుతున్నప్పుడు కుటుంబం అనే నిర్వచనం కూడా మారాలి. భర్తతో సంబంధం లేకపోతే ఒక మహిళ కుటుంబాన్ని కోల్పోదు. కానీ మన సామాజిక, పరిపాలనా వ్యవస్థల్లో మహిళకు కుటుంబం అనేది ఇప్పటికీ ఒక పురుషుడి ద్వారా నిర్వచించబడుతోంది. జనాభా గణనలో మొదటి దశ గృహాల గణన. నాకు సొంత ఇల్లు లేదు. పైగా నేను నివసిస్తున్న ఇల్లు నా ఉనికినే అంగీకరించదు. కాబట్టి, ప్రియమైన భారతావనీ.. ఈ జనాభా గణనలో నా స్థానం ఎక్కడ? ఒక దేశం లేదా ఇల్లు ‘ఇల్లు’ అనిపించుకోవాలంటే అది ఆప్యాయతను, భద్రతను, సానుభూతిని అందించాలి. నియమాలను ఉల్లంఘించే, యథాతథ స్థితిని సవాలు చేసే మహిళల ఉనికిని కుటుంబం, సమాజం, ప్రభుత్వం గుర్తించాలి. లేకపోతే జనాభా గణనలో మా సంఖ్య కనిపించినా.. మా అస్తిత్వం మాత్రం కనిపించదు.’’







కామెంట్‌లు (0)