భారత్‌లోనూ హైరిస్క్ సరస్సులు
బద్దలైతే జలప్రళయమే!
హిమాలయాల్లో 7,500 హిమానీనద సరస్సులు
న్యూఢిల్లీ : నేపాల్ లో ఇటీవల సంభవించిన హిమానీనద విపత్తు భారత్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. హిమాలయ పర్వతాల్లోని మంచు సరస్సులు బద్దలైతే ఎంతటి విధ్వంసం సంభవిస్తుందో నేపాల్ ఘటన స్పష్టం చేస్తోంది. అదే సమయంలో భారత్లో కూడా వందల సంఖ్యలో ప్రమాదకర హిమానీనద సరస్సులు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దీంతో వాటిపై నిరంతర నిఘా, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రభుత్వ సర్వే ప్రకారం, భారత హిమాలయ ప్రాంతంలో దాదాపు 7,500 హిమానీనద సరస్సులు ఉన్నాయి. వీటిలో సుమారు 10 శాతం అంటే దాదాపు 750 సరస్సులు సిక్కింలోనే ఉన్నట్లు అంచనా. వీటిలో 25 సరస్సులను అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించారు. హిమాలయ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడం, మంచు కరుగుదల, వర్షపాతంలో మార్పులు వంటి పరిణామాలు ఆ సరస్సులపై ప్రభావం చూపుతున్నాయి.
దిగువ ప్రాంతాల్లో విధ్వంసం!
హిమానీనదాల నుంచి కరిగిన మంచు, నీరు చేరి ఏర్పడే సరస్సులు కాలక్రమంగా భారీగా విస్తరించే అవకాశం ఉంటుంది. సరస్సులను చుట్టుముట్టిన మంచు, రాళ్ల గోడలు బలహీనపడితే ఒక్కసారిగా నీరు బయటకు రావచ్చు. దీనినే గ్లేషియల్ లేక్ ఔట్ బర్స్డ్ ఫ్లడ్ (జిఐఒఎఫ్ ) అంటారు. ఇలాంటి వరదలకు భారీ నీటితోపాటు మట్టి, రాళ్లు, మంచు కూడా కలవడంతో దిగువ ప్రాంతాల్లో విధ్వంసం మరింత పెరుగుతుంది. అయితే భారత్ లో హిమానీనద సరస్సుల ముప్పు సిక్కింకే పరిమితం కాదు. గంగా నదీ పరివాహక ప్రాంతంలోనూ సుమారు 4700 సరస్సులు ఉన్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. ఆ నదీ పరివాహక ప్రాంతం 2.5 లక్షల చదరపు కిలోమీటర్లకుపైగా విస్తరించి ఉంది. వీటిలో ఏదైనా అత్యంత ప్రమాదకర సరస్సు ఒక్కసారిగా బద్దలైతే దిగువ ప్రాంతాల్లోని గ్రామాలు, పట్టణాలు, రహదారులు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర కీలక మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో లోయలు ఇరుకుగా ఉండటంతో వరద ప్రవాహం మరింత వేగంగా కిందకి దూసుకెళ్లే ప్రమాదం ఉంటుంది.
సిక్కిం విపత్తు మర్చిపోలేం
భారత్ ఇప్పటికే ప్రమాదాన్ని చవిచూసింది. 2023 అక్టోబర్ 3వ తేదీన సిక్కింలోని సౌత్ లొనాక్ సరస్సు వద్ద భారీ విపత్తు సంభవించింది. సరస్సులోకి భారీగా మంచు, రాళ్లు విరిగిపడటంతో ఒక్కసారిగా పెద్ద అల ఏర్పడింది. సుమారు 20 మీటర్ల ఎత్తున ఎగిసిన ఆ నీటి అల దిగువ ప్రాంతాల వైపు దూసుకెళ్లింది. ఆ వరద ప్రవాహానికి జల విద్యుత్ ప్రాజెక్టులు, వంతెనలు, రహదారులు, నివాస ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ ఘటన హిమానీనద సరస్సుల ప్రమాద తీవ్రతను దేశం ముందు స్పష్టంగా ఉంచింది. నేపాల్ లో జరిగిన తాజా విపత్తు మరో కోణాన్ని బయటపెట్టింది. మంచు లేదా రాళ్లు విరిగిపడటం, ఆ తర్వాత భారీగా మట్టి, రాళ్ల ప్రవాహం ఏర్పడటం, తాత్కాలికంగా సరస్సు ఏర్పడటం, చివరకు ఆకస్మిక వరదగా మారడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరిగే ప్రమాదాలను క్యాస్కేడింగ్ హజార్డ్స్ అంటారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సభ్యుడు కృష్ణ వత్స ప్రకారం, ఇలాంటి పరిణామాలు చాలా వేగంగా చోటుచేసుకోవచ్చు. దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయడానికి చాలా తక్కువ సమయం ఉండే అవకాశం ఉంది.
195 సరస్సులపై ప్రత్యేక దృష్టి
హిమానీనద సరస్సుల ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ జిఎల్ఒఎఫ్ రిస్క్ మిటిగేషన్ ప్రోగ్రామ్ ను చేపట్టింది. ఇందులో భాగంగా 195 ప్రమాదకర హిమానీనద సరస్సులను గుర్తించారు. ఈ కార్యక్రమంలో ఐదు అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సరస్సుల ప్రమాద స్థాయిని అంచనా వేయడం, నిరంతరం పర్యవేక్షించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయడం, ప్రమాదాన్ని తగ్గించే చర్యలు చేపట్టడం, స్థానిక ప్రజల్లో అవగాహన కల్పించడం సౌత్ లొనాక్ ఘటన తర్వాత కేంద్ర హిమానీనద సరస్సులపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. వివిధ కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య సమన్వయం కోసం ఉన్నతస్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారి పీకే మిశ్రా నేతృత్వంలో కమిటీ పనిచేస్తోంది. ప్రమాదకర సరస్సులను గుర్తించడం, వాటిపై సర్వేలు నిర్వహించడం, పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం వంటి అంశాలపై కమిటీ దృష్టి పెట్టింది. అంతే కాదు, ప్రమాదం ఎక్కువగా ఉన్న నాలుగు హిమాలయ రాష్ట్రాల్లో కార్యక్రమాల కోసం కేంద్రం రూ.150 కోట్లను కేటాయించింది. ‘‘నేపాల్‌లో ఇటీవల సంభవించిన విపత్తు వంటి సంఘటనలు వాస్తవానికి భారతీయ హిమాలయ ప్రాంతంలో చాలా కాలంగా జరుగుతూనే ఉన్నాయి. గత 20-25 ఏళ్లలో భారత్ పై ప్రభావం చూపిన ఇటువంటి విపత్తులు ఏడు లేదా ఎనిమిది వరకు ఉన్నాయి. నేపాల్‌ను ప్రభావితం చేసిన పెద్ద విపత్తులు సుమారు నాలుగు లేదా ఐదు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి భారత్ ఎంతవరకు సిద్ధంగా ఉంది?’’ అని ఎన్ డిఎంఎ మాజీ సలహాదారు సాఫీ అహ్సాన్ రిజ్వీ తెలిపారు.
సరస్సులను గుర్తిస్తే సరిపోతుందా?
ఇక హిమానీనద సరస్సులను గుర్తించడం తొలి అడుగు మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. గుర్తించిన సరస్సులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. నీటిమట్టం ఎంత పెరుగుతోంది? మంచు, రాళ్ల పరిస్థితి ఎలా ఉంది? సరస్సు గోడలు బలహీనపడుతున్నాయా? వంటి అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అందుకోసం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, కేంద్ర జల సంఘం, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సి-డాక్, ఐటిబిపి, సైన్యం తదితర సంస్థలు కలిసికట్టుగా పనిచేయాలి.
హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ మార్పులతో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. మంచు కరుగుదల, అస్థిరమైన మంచు కొండలు, మారుతున్న వర్షపాత పరిస్థితులు ఇవన్నీ హిమానీనద సరస్సులపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే నేపాల్ విపత్తును కేవలం ఆ దేశానికి సంబంధించిన ఘటనగా చూడలేం. భారత్ లో కూడా వేలాది హిమానీనద సరస్సులు ఉన్న నేపథ్యంలో అప్రమత్తత మరిత పెంచాల్సిన అవసరం ఉంది. ప్రమాదకర సరస్సులను గుర్తించడం నుంచి వాటి కదలికలను ముందుగానే పసిగట్టి, దిగువ ప్రాంతాల ప్రజలను సకాలంలో అప్రమత్తం చేసే స్థాయికి వ్యవస్థను తీసుకెళ్లడమే ఇప్పుడు అసలు సవాల్. సౌత్ లొనాక్ ఘటన ఇప్పటికే భారత్‌కు ఒక హెచ్చరిక ఇచ్చింది. నేపాల్ విపత్తు ఆ హెచ్చరికను మరింత బలంగా గుర్తుచేసింది.







కామెంట్‌లు (0)