సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅక్షర దిక్సూచి ఆరుద్ర

1 గంట క్రితం

ARUDRA
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 05:55 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

కవిత్వం, పరిశోధన, సినిమా, లలిత కళలు... ఇలా ఏ రంగాన్ని స్పృశించినా తనదైన ముద్రవేసి, తెలుగు సాహిత్య క్షేత్రంలో చెరగని చరిత్రను లిఖించిన అక్షర మూర్తి ఆరుద్ర (భాగవతుల శివశంకరశాస్త్రి). "తరానికో వంద కవులు తయారవుతారెప్పుడూ... వందలోనూ మందలోనూ మిగలగలిగేదొక్కడు" అని ఘంటాపథంగా ప్రకటించిన ఆరుద్ర, తరతరాలకూ సరిపడా అక్షర సంపదను మనకందించారు. అంత్యప్రాసలు, వైచిత్రీప్రియత్వం, అభివ్యక్తిలో చతురత, ఆలోచనలో అభ్యుదయం, ఆచరణలో నవ్యత అనే ఐదు లక్షణాలకు చిరునామాగా నిలిచిన ఆరుద్రను మహాకవి శ్రీశ్రీ "ఆరో రుద్రుడు" అని అభివర్ణించారు. ఆరుద్ర జయంతి సందర్భంగా ఆయన రచనలు, భావాలు మానవాళికి, సంక్షోభంలో ఉన్న సమాజానికి ఏ విధంగా అనుసరణీయమో లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

​ఆరుద్ర కవిత్వమంతటా నిండిన ప్రధాన సూత్రం మానవతావాదం, అభ్యుదయం, సామాజిక బాధ్యత. ఆడంబరమైన పాండిత్యం కన్నా సామాన్యుడికి అర్థమయ్యే సరళత్వమే మిన్న అని నమ్మిన కవి ఆయన. "పెను సమాసము లున్న / పెద్ద వృత్తముకన్న / చిన్న పదమే మిన్న - ఓ కూనలమ్మ" అంటూ ప్రాచీన జానపద ధోరణిలో ఆయన సృష్టించిన ‘కూనలమ్మ పదాలు’ కేవలం కవితలు కావు, లోకరీతిపై సంధించిన పదునైన చురకలు. ఆధునిక ప్రపంచంలో స్వార్థం, వేర్పాటువాదం పెరుగుతున్న తరుణంలో ఈ పదాలు సమాజానికి గొప్ప హితవు పలుకుతాయి. "కసిని పెంచే మతము / కనులు కప్పే మతము / కాదు మనకభిమతము" అంటూ మతోన్మాదాన్ని, మానవ సంబంధాలను దెబ్బతీసే సంకుచిత భావాలను ఆనాడే ఆయన తీవ్రంగా నిరసించారు. "విశ్వవీణారవపు విజయ గానమ్ముతో / విజయ శంఖానాద విశ్వగీతమ్ముతో / కొత్త మార్గాలపై కొత్త మార్గాలకై – కదలవే కదలవే" అని ఆయన చేసిన ‘పురోగమన’ పిలుపు, యువతకు దిశా నిర్దేశం చేస్తుంది. కేవలం గతాన్ని తలచుకుంటూ కూర్చోవడం కాకుండా, నూతన సమాజ నిర్మాణానికి కొత్త బాటలు వేయాలనే ఆయన తాపత్రయం నిత్యనూతనం.

​విషయ వైవిధ్యం పరంగా చూస్తే, వ్యవస్థలోని ద్వంద్వ ప్రమాణాలను, అవినీతిని ఆరుద్ర ఎంతో చమత్కారంతో ఎండగట్టారు. సమాజంలో వేళ్లూనుకున్న లంచగొండితనాన్ని హెచ్చరిస్తూ — "లంచ మనియెడి ఉప్పు / క్లర్కు తింటే తప్పు / ఘనుడు తింటే మెప్పు - ఓ కూనలమ్మ" అని వేసిన విమర్శ నేటికీ మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. అలాగే, నాయకులు లేదా మేధావులు సిద్ధాంతాల పేరిట ప్రజలను మభ్యపెట్టే విధానాన్ని ఎండగడుతూ "ఇజము నెరిగిన వాడు / నిజము చెప్పనినాడు / ప్రజకు జరుగును కీడు - ఓ కూనలమ్మ" అంటూ సత్యాన్ని దాచే సిద్ధాంతాలు సమాజానికి శ్రేయస్కరం కావని స్పష్టం చేశారు. సమాజ శ్రేయస్సు కోరే ప్రతీ ఒక్కరికీ ఈ మాట ఒక మార్గదర్శక సూత్రం. మానవ నైజాలను, వ్యక్తిగత వ్యసనాలను కూడా ఆరుద్ర వదల్లేదు. జీవనశైలిలో మనుషులను పట్టిపీడిస్తున్న అహంకారాన్ని, ఆశను నిరసిస్తూ — "ఆశ పెరిగిన వాడు / అహము పెరిగిన వాడు / తనకు తానే కీడు - ఓ కూనలమ్మ" అని సూత్రీకరించారు. మనిషి తన అహాన్ని తగ్గిస్తే తప్ప సమాజంలో శాంతి సాధ్యం కాదని గుర్తుచేశారు. మద్యపానం వంటి దురలవాట్ల వల్ల సమాజంలో జరిగే మేధో నష్టాన్ని "తాగుచుండే బుడ్డి / తరుగుచుండే కొద్ది / మెదడు మేయును గడ్డి" అంటూ ఎంతో హాస్యంగానే కాదు, లోతైన హెచ్చరికగా అందించారు. ఇక కోర్టుల చుట్టూ తిరిగే సామాన్యుడి అవస్థలను "కోర్టు కెక్కిన వాడు / కొండ నెక్కిన వాడు / వడివడిగ దిగిరాడు" అని వర్ణించడం ఆయన సామాజిక నిశిత పరిశీలనకు నిదర్శనం.

​విశ్వవిద్యాలయాల అధికారిక పట్టాలు లేకపోయినా, స్వయంకృషితో నిరంతర శోధన చేస్తూ ఆయన సాధించిన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ (13 సంపుటాలు) ఒక విజ్ఞాన సర్వస్వం. డిజిటల్ యుగంలో సమాచారం విపరీతంగా దొరుకుతున్నా, నిజమైన 'జ్ఞాన శోధన', 'నిజాయితీ కూడిన పరిశోధన' కొరవడుతున్న వేళ ఆరుద్ర చూపిన పరిశోధనా మార్గం అందరికీ ఆదర్శనీయం. సమగ్ర ఆంధ్ర సాహిత్యంలో ఆయన అందించిన చారిత్రక, జానపద, యక్షగాన విశ్లేషణలు తెలుగు సంస్కృతీ మూలాలను కాపాడుకోవడానికి నేటికీ ప్రమాణాలుగా నిలుస్తున్నాయి. చలనచిత్ర రంగానికి ఆరుద్ర అందించిన సేవలు అపారం. ప్రాసల వేటలో అర్థాన్ని బలిచేయకుండా, జానపద శైలికి ఆధునిక భావాలకు వంతెనగా పాటను మలిచారు. తెలుగుదనానికి, సంప్రదాయ సౌందర్యానికి ప్రతీకగా "ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ..." (ముత్యాల ముగ్గు) అని రాసినా, శుభకార్యాల్లో ఆత్మీయబంధాలను ముడివేస్తూ "శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకున్నది..." (పెళ్ళి పుస్తకం) అని అలరించినా అది ఆరుద్రకే చెల్లింది. పిల్లల అమాయకత్వాన్ని కొనియాడుతూ "పిల్లలు దేవుడు చల్లని వారే..." (లేత మనసులు) అని రాసినా ఆయన కలంలో తరగని వైవిధ్యం కనిపించేది.

ఆరుద్ర కేవలం కవి, సినీ రచయిత మాత్రమే కాదు; ఆయన ఒక బహుముఖ మేధావి. హేతువాదం, తార్కికత, చదరంగం, ఇంద్రజాలం వంటి విభిన్న ప్రక్రియలలో ఆయనకున్న ప్రావీణ్యం ఆయన విశాల దృక్పథాన్ని తెలియజేస్తుంది. ఏ విషయాన్ని స్పృశించినా అందులో లోతైన అధ్యయనాన్ని కనబరచే ఆయన జిజ్ఞాస, సాంకేతిక ప్రపంచంలో అరకొర పరిజ్ఞానంతో కాలం వెళ్లదీస్తున్న ప్రతి ఒక్కరికీ ఒక నిశ్శబ్ద హెచ్చరిక. "రూప్యకాలు రాలవచ్చు, కావ్యాలు కలకాలం నిలవవచ్చు" అని నమ్మిన ఆరుద్ర భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన అక్షరాలు, ఆలోచనలు, సమతావాద దృక్పథం తెలుగు వారి గుండెల్లో నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. అభ్యుదయ భావాలు, సమాజ హితమే శ్వాసగా జీవించిన ఈ ఆరో రుద్రుని జయంతి సందర్భంగా, ఆయన అక్షర బాటలో పయనిస్తూ మానవతా విలువలను కాపాడుకోవడమే మనం ఆయనకర్పించే నిజమైన నివాళి!

(నేడు ఆరుద్ర జయంతి)

​- మర్రాపు వసుంధరా దేవి, 9441467660​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్