జగన్నాథపురంలో 385 ఎకరాల్లో నిర్మాణానికి ప్రణాళిక
తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు
2019కి ముందు ఎపి గ్రేహాండ్స్‌కు కేటాయింపు
నేటికీ కొందరికి అందని పరిహారం
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో
విశాఖ జిల్లాలో డేటా సెంటర్లు క్రమేపీ పెరుగుతున్నాయి. జనావాసాల్లో వీటిని ఏర్పాటు చేస్తుండటంతో అందరిలోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా రాష్ట్ర కేబినెట్ ఆనందపురం మండలం చందక పంచాయతీ జగన్నాథపురం గ్రామంలో హోల్డింగ్స్ ఇండియా డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 385 ఎకరాల్లో రూ.58,743 కోట్ల భారీ పెట్టుబడితో 486 మెగావాట్ల సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు కానున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జగన్నాథపురం గ్రామాన్ని ‘ప్రజాశక్తి’ . రైతులు ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్‌తో విశాఖ రూపురేఖలు మారిపోతాయంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇదొక్కటే డేటా సెంటర్ అని విశాఖ ప్రజలు భావిస్తున్న తరుణంలోనే మరికొన్నింటికి జిల్లాలో అనుమతులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.
డేటా సెంటర్‌కు భూములివ్వం : రైతులు
జగన్నాథపురం గ్రామ సర్వే నెంబర్ 1/1లో సుమారు 385 ఎకరాల్లో 65 మంది రైతులు వివిధ రకాల పంటలు, సరుగుడు తోటలు వేసుకుని ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. అక్కడి ప్రజలకు ఈ భూములే ఆధారం. 2019కి ముందే చంద్రబాబు ప్రభుత్వంలో గ్రేహాండ్స్ ఏర్పాటు కోసం ఈ భూములను సేకరించారు. డి-పట్టాకు రూ.40 లక్షలు, ఫోర్ సి భూములకు ఎకరాకు రూ.16 లక్షలు, నాన్ ఫోర్‌సి భూమికి ఎకరాకు రూ.8 లక్షల పరిహారాన్ని కొంతమందికి ఇచ్చారు. ఇంకా 20 మంది రైతులకుపైగా పరిహారం అందలేదు. ఈ భూములకు కుడి వైపున ఏనుగుకొండ, ఎడమ వైపున పెద్దకొండ ఉన్నాయి. గ్రేహాండ్స్‌ను విజయన గరం జిల్లాకు తరలించారు. ఈ భూములను హోల్డింగ్స్ ఇండియా డేటా సెంటర్ కు కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డేటా సెంటర్‌తో పెద్దగా ఉద్యో గాలేవీ రావని, పర్యావరణం, ప్రకృతి వనరులు దెబ్బతింటాయని, డేటా సెంటర్‌ను తమ ప్రాంతం లోకి రానివ్వబోమని స్థానిక రైతులు చెబుతున్నారు.
అంతా ‘గోల్‌మాల్’!
విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పరిధిలో డేటా సెంటర్లకు భూములను కట్టబెట్టడం వెనుక ప్రభుత్వం అభివృద్ధి పేరుతో పెద్ద ‘గోల్‌మాల్’కే తెరతీసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనావాసాల్లో డేటా సెంటర్లతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయని, పర్యావరణ సమస్యలు వస్తాయని పౌరసమాజం, ప్రజా సంఘాలు, మేధావులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు.
కేటాయింపులు ఇలా....
విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం వద్ద అమనాం గ్రామంలో ఎఎం ఎఐ ప్రైవేట్ సంస్థకు 512 మెగావాట్ల సామర్థ్యంతో గ్రీన్ ఇంటెగ్రేటెడ్ ఎఐ డేటా సెంటర్, హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ కోసం 200 ఎకరాల స్థలాన్ని మార్కెట్ ధరపై 25 శాతం మినహాయించి ఇచ్చేందుకు రాష్ర్ట కేబినెట్ ఆమోదించింది. తర్లువాడలో ఒక గిగావాట్ సామర్థ్యంతో గూగుల్-అదాని కనెక్స్ జాయింట్ వెంచర్ సుమారు 266 ఎకరాల్లో రానున్న విషయం తెలిసిందే. దీనికి అనుబంధంగా తర్లువాడకు దగ్గర్లోనే శొంఠ్యాం దారిలో కనమాం వద్ద 27 ఎకరాలను గూగుల్ డేటా సెంటర్‌కు కావాల్సిన భారీ స్తంభాలు, భవన నిర్మాణ సామగ్రి కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎపిఐఐసి ద్వారా భూమిని మరలా ఇప్పించింది. మధురవాడ/కాపులుప్పాడ హిల్ నెంబర్ 4లో సుమారు 130 ఎకరాలకుపైగా భూమిని అదాని ఇంటెగ్రేటెడ్ డేటా ప్రాజెక్టుకు కట్టబెట్టింది.
200 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన బిజినెస్ పార్కును ఇక్కడ అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కాపులుప్పాడలో 60 ఎకరాలను అదాని ఫౌండేషన్‌కు ప్రభుత్వం కేటాయించింది. ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్, యూనివర్సిటీ, స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్, సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రి నిర్మాణం చేస్తారని చెబుతోంది. విశాఖ నగరం నడిబొడ్డున ముడసర్లోవ రిజర్వాయర్- సింహాచలం కొండపై 160 ఎకరాల సింహాద్రి అప్పన్న భూములను చంద్రబాబు సర్కారు అదానికి కట్టబెట్టడం తీవ్ర వివాదంగా మారిన విషయం తెలిసిందే. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోనూ 174 ఎకరాలను కట్టబెట్టింది. వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో రెన్యూ ఎపి గ్రీన్ డేటా సెంటర్ ఏర్పాటుకు మాకవరపాలెంలో 433.30 ఎకరాలను ఇప్పటికే కేటాయించింది. ఇలా పెద్ద మొత్తంలో భూములను డేటా సెంటర్లు, ఇతర అవసరాల కోసం కార్పొరేటర్లకు, బడా పెట్టుబడిదారులకు ప్రభుత్వం కట్టబెడుతోంది.







కామెంట్‌లు (0)