శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబాల్యానికి మూడుముళ్ల బంధనం!

3 గంటల క్రితం

బాల్యానికి మూడుముళ్ల బంధనం! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 05:55 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

మరో నాలుగేళ్లలో అంటే 2030 నాటికి ప్రపంచంలో బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించాలన్నది ఐక్యరాజ్యసమితి లక్ష్యం. 2016లో యుఎన్‌ఎఫ్‌పిఎతో కలిసి 15 ఏళ్ల కార్యక్రమంగా దీన్ని ప్రారంభించారు. మొదటి దశలో భారత్‌తో సహా 12 దేశాలను చేర్చారు. 2024-2030 మూడో దశలో భాగంగా కార్యక్రమాన్ని పునరుద్ధరించారు. అయినా ప్రపంచవ్యాప్తంగా సుమారు 65 కోట్ల మంది మహిళలు, బాలికలు బాల్యంలోనే వివాహ బంధంలోకి వెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి ఏడాది 1.2 కోట్ల మంది బాలికలు 18 ఏళ్లు నిండకుండానే పెళ్లి పీటలెక్కుతున్నారు. మన దేశంలో బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టినా సమస్య పూర్తిగా తొలగిపోలేదు. ప్రపంచ బాలవధువుల్లో మూడోవంతు భారత్‌లోనే ఉన్నారు.

దేశంలోని మొత్తం బాల్యవివాహాల్లో సగానికి పైగా ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో నమోదవుతున్నాయని యునిసెఫ్‌ అధ్యయనం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 2026 సెప్టెంబర్‌ 4న కీలక తీర్మానం చేసింది. ప్రతి సంవత్సరం నవంబర్‌ 27ను ‘బాల్య, ముందస్తు, బలవంతపు వివాహాల నిర్మూలన’ అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది. ఈ ఏడాది తొలిసారిగా నిర్వహించనున్న ఈ దినోత్సవం సందర్భంగా మన దేశంలోనూ 'బాల్యవివాహ రహిత భారత్‌' ప్రచారంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.

మహారాష్ట్ర బీడ్‌ జిల్లా ధారూర్‌ తాలూకాలో 13 ఏళ్ల బాలికకు పది రోజుల క్రితం బాల్యవివాహం జరిగిందని ఆమె తల్లి చైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో వరుడు, అతని తల్లిదండ్రులు సహా నలుగురిపై కేసు నమోదైంది. ఉత్తరాఖండ్‌లోని బుక్సౌరా గ్రామంలో నవంబరు 18న 16 ఏళ్ల బాలికకు 25 ఏళ్ల సమీర్‌ బిస్వాస్‌తో వివాహం జరుగుతుండగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అడ్డుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ జౌన్‌పూర్‌ జిల్లా మాథియా గ్రామంలో 12 ఏళ్ల బాలికకు 17 ఏళ్ల బాలుడితో వివాహం చేయడానికి అక్టోబరు 28న కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. బాలికకు చదువుకోవాలని ఉన్నా కుటుంబం పట్టించుకోకుండా ఇటుక బట్టీలో పనికి పంపించిందని ఫిర్యాదు నమోదైంది. పెళ్లి ఊరేగింపునకు వరుడి కుటుంబం వచ్చే సమయానికి అధికారులు వివాహాన్ని నిలిపివేశారు. అస్సాంలో బాల్యవివాహాలపై ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యల్లో 565 మందిని అరెస్టు చేసి, 481 కేసులు నమోదు చేసింది. గత కొన్నేళ్లలో రాష్ట్రంలో 12 వేలకుపైగా కేసులు, 11 వేలకుపైగా అరెస్టులు జరిగాయి. పశ్చిమబెంగాల్‌లో 2026 జనవరి నుంచి జూన్‌ మధ్య 18 ఏళ్లలోపు బాలికలకు దాదాపు 60 వేల ప్రసవాలు ఆసుపత్రుల్లో నమోదైనట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐదు బాల్యవివాహాలను అధికారులు అడ్డుకున్నారు. దేవనకొండ మండలం కోటకొండలో ముగ్గురు బాలికలను రక్షించగా, ధోన్‌, నాగలాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధుల్లో మరో రెండు వివాహాలను నిలిపివేశారు.

పేదరికం ప్రధాన కారణం..

బాల్యవివాహాలకు ప్రధాన కారణాల్లో పేదరికం ఒకటి. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం, ఆడపిల్లల చదువుకు ఖర్చు చేయలేకపోవడం, పెళ్లి బాధ్యతను త్వరగా ముగించాలనే ఆలోచన తల్లిదండ్రులను ఈ దిశగా నడిపిస్తున్నాయి. ఆడపిల్లను ఆర్థిక భారంగా చూసే భావన, కట్నం, వివాహ ఖర్చులు, సామాజిక ఒత్తిళ్లు కూడా దీనికి తోడవుతున్నాయి. వీటితోపాటు కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు, నమ్మకాలు, ఆచారాలు, బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన లేకపోవడం కూడా సమస్యకు కారణమవుతున్నాయి. బాల్యవివాహాల వల్ల బాలికలు చదువుకు దూరం కావడమే కాకుండా చిన్న వయసులోనే గర్భధారణ, ప్రసవం వంటి ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. శారీరక ఎదుగుదల పూర్తికాకముందే తల్లులవుతున్న బాలికల్లో రక్తహీనత, పోషకాహార లోపం, గర్భధారణ, ప్రసవ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. మానసిక ఒత్తిడికీ గురవుతున్నారు. భారతదేశంలో బాల్యంలో వివాహమైన మహిళల్లో 34.9 శాతం మంది 18 ఏళ్లలోపే బిడ్డకు జన్మనిచ్చినట్లు చైల్డ్‌ మ్యారేజ్‌ డేటా పోర్టల్‌ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

వాతావరణ మార్పులూ..

ఇటీవలి కాలంలో వాతావరణ మార్పులు కూడా బాల్యవివాహాలకు కారణమవుతున్నాయి. వరదలు, తుపాన్లు, కరువులు, తీవ్రమైన వేడిగాలులు కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీస్తున్నాయి. పంటలు నష్టపోవడం, ఉపాధి కోల్పోవడం, వలసలు పెరగడంతో బాలికల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కొందరు తల్లిదండ్రులు బాలికల పెళ్లిని ఒక పరిష్కారంగా భావిస్తున్నారు. దక్షిణాసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులకు, బాల్యవివాహాల పెరుగుదలకు మధ్య సంబంధం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 50 దేశాల్లో మూడు దశాబ్దాల వాతావరణ, ఆరోగ్య సమాచారాన్ని విశ్లేషించి, ఐదు దేశాల్లో బాలికలతో మాట్లాడి రూపొందించిన అధ్యయనం ఎంతోమంది బాలికల పరిస్థితిని వెల్లడిస్తోంది. సర్వేలో పాల్గొన్న వారిలో 36 శాతం మంది ప్రకృతి వైపరీత్యాల తర్వాత తమ ప్రాంతంలో బాల్యవివాహాలు పెరిగాయని చెప్పారు. 90 శాతం మంది వాతావరణ మార్పులు తమ కుటుంబాల మనుగడ, ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూడు సెకన్లకు ఒక బాలికకు వివాహం జరుగుతోందని యునిసెఫ్‌ అంచనా వేస్తోంది.

ఐక్యరాజ్యసమితి లక్ష్యం చేరుకోవడానికి ఇంకా నాలుగేళ్లే ఉన్నాయి. పై గణాంకాలు చూస్తుంటే లక్ష్య సాధన పెద్ద సవాలుగా కనిపిస్తోంది. బాల్యవివాహాలు లేని సమాజం ఏర్పడాలంటే వివాహాల సంఖ్య తగ్గడం ఒక్కటే సరిపోదు. ప్రతి బాలికకు నచ్చిన చదువు చదువుకునే అవకాశం కల్పించాలి. ఉన్నత లక్ష్యాలవైపు ప్రయాణించే స్వేచ్ఛనివ్వాలి. ‘అమ్మాయి భవిష్యత్తు.. పెళ్లి పీటలపై కాదు.. పాఠశాల బాటలోనే’ అని ప్రోత్సహించే కుటుంబాలు, సమాజం రావాలి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్