బ్యాంకాక్:
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని ఒక చమురు శుద్ధి కర్మాగారంలో గురువారం మధ్యాహ్నం సంభవించిన భారీ పేలుడు, తదనంతరం చెలరేగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. బ్యాంగ్‌చాక్ కార్పొరేషన్ యాజమాన్యంలోని ఫ్రా ఖనోంగ్ (Phra Khanong) రిఫైనరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పేలుడు సంభవించిన వెంటనే కర్మాగారంలో మంటలు చెలరేగాయి. అయితే, అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి అరగంటలోనే మంటలను అదుపులోకి తెచ్చినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. పేలుడు కారణంగా దట్టమైన నల్లటి పొగ ఆకాశంలోకి ఎగసిపడింది. ఇది బ్యాంకాక్ నగరంలోని పలు ప్రాంతాల నుండి స్పష్టంగా కనిపించింది. ముందుజాగ్రత్త చర్యగా సమీప ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
థాయ్‌లాండ్ ఇంధన శాఖ మంత్రి అక్కనాట్ ప్రోంఫాన్ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రధానంగా చమురు నిల్వ చేసే ట్యాంకులకు సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న డిస్టిలేషన్ టవర్‌లో మంటలు చెలరేగాయని, అందువల్ల పెను ప్రమాదం తప్పి, పేలుడు తీవ్రత పరిమితంగానే ఉందని ఆయన వివరించారు.
జనవాసాల మధ్యలో ఈ రిఫైనరీ ఉండటం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్న మంత్రి, పూర్తిస్థాయి భద్రతను నిర్ధారించుకునే వరకు కర్మాగారంలో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు, ప్రమాద స్థలానికి సమీపంలో నిర్వహించిన వాయు నాణ్యత పరీక్షల్లో ఎలాంటి అసాధారణ మార్పులు నమోదు కాలేదని బ్యాంగ్‌చాక్ సంస్థ వెల్లడించింది.
ఈ సంస్థకు చోన్‌బురి ప్రావిన్స్‌లో రోజుకు 1.80 లక్షల బ్యారెళ్ల సామర్థ్యం గల మరో చమురు శుద్ధి కర్మాగారం కూడా ఉంది. కాగా, బ్యాంకాక్‌లోని ఇదే రిఫైనరీలో గతంలో 2012 జులైలో కూడా పేలుడు సంభవించి అగ్నిప్రమాదం జరిగింది. అయితే అప్పట్లో ఎవరికీ గాయాలు కాలేదు.







కామెంట్‌లు (0)