సినిమాల్లో విలన్‌గా భయపెట్టిన గిరిబాబు నిజజీవితంలో ఎంతో సున్నితమైన మనిషి. తెరపై తనదైన ముద్రవేసిన ఆయన వెనుక ఆకలి, అవమానాలు, నిరాశలు, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి. ప్రకాశం జిల్లా రావినూతల గ్రామం నుంచి మద్రాసు చేరుకుని, అవకాశాల కోసం పోరాడి, ఒకానొక దశలో సినిమాలే వద్దనుకుని వెనుదిరిగిన వ్యక్తి.. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు 600 సినిమాల్లో నటించి విలక్షణ కళాకారుడిగా ఎదిగారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారు. ఆకలితో గడిపిన రోజులను మర్చిపోకుండా, తన ఊరి అభివృద్ధిలో భాగస్వామి కావడం ఆయన వ్యక్తిత్వంలోని మరో కోణం.
‘అవకాశం రావడం పెద్ద విషయం కాదు. వచ్చిన అవ-కాశాన్ని సమర్థతో సద్వినియోగం చేసుకోవడమే వివేకవంతుల లక్షణం’ అని అంటారు గిరిబాబు. కుటుంబాన్ని, సినిమాని ఎలా అనుసంధానం చేసుకున్నారో చెబుతూ.. 'ఎన్ని కష్టాలు పడినా, అవమానాలు ఎదురైనా.. ఎప్పటికైనా అనుకున్నది సాధించగలను` అని నమ్మేవాడ్ని అని ఒకసారి చెప్పారు. 1943 జూన్ 8న రావినూతల గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు యర్రా శేషగిరిరావు. గిరిబాబుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. బాల్యం నుంచే నాటకాలపై ఆసక్తి ఉన్న ఆయనకు స్వయంగా నాటకాలు రాయడం, ప్రదర్శించడం అలవాటు. నటనపై ఉన్న ఆ మక్కువ ఆయనను సినిమా రంగంవైపు నడిపించింది. అయితే సినిమా అవకాశాలు అంత సులభంగా రాలేదు. మద్రాసులో అడుగుపెట్టిన కొత్తలో ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితం దక్కలేదు. కొన్ని సినిమాలు ప్రారంభమై మధ్యలోనే ఆగిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి.
రెండుసార్లు హీరోగా సెలక్ట్ చేసిన సినిమా అవకాశాలు వచ్చి ఆగిపోయాయి. మూడోసారి చిత్రీకరణ మొదలుపెట్టిన చిత్రం కూడా పూర్తికాలేదు. ఈ పరిస్థితులు ఆయన్ను తీవ్రంగా కుంగదీసింది. 'ఇక అవకాశాలు రావు. ప్రయత్నించడం మానేయాలి` అనుకున్న సందర్భంలో ఎన్నో అవమానాలు వెంటాడాయి. ముగ్గురు పిల్లలు పుట్టాక సినిమా రంగంలోకి వచ్చిన ఆయన భార్యాపిల్లలను పోషించుకునేందుకు కష్టాలు పడిన సందర్భాలు ఉన్నాయి.
రావినూతల నుండి మద్రాసు కు చేసిన గిరిబాబు ప్రయాణం వెనుక స్నేహితులు ప్రోద్బలం ఎంతో ఉందని ఆయన పలు ఇంటర్వ్యూల్లో గుర్తుచేసుకున్నారు. ఒంగోలులో ఫొటో స్టూడియో నడిపే బాబా నాగేశ్వర రావు అనే మిత్రుడు తనను విపరీతంగా నమ్మాడని కూడా చెప్పేవారు. మూడుసార్లు అవకాశాలు వచ్చినట్లు వచ్చి పోయేసరికి సినిమాలపై విరక్తి వచ్చిన ఆయన ఊళ్లో టూరింగ్ టెంట్ హౌస్ లో వేసే సినిమాలకు కూడా వెళ్లేవారు కాదు. అంతలా సినిమాలపై అయిష్టత పెంచుకున్నారు. అలాంటి సమయంలో మరో అవకాశం అట్లూరి రామచంద్రరావు రూపంలో తలుపుతట్టింది. ఆ సమయంలో కూడా తనకు ఎంతమాత్రం ఇష్టంలేకపోయినా ఒంగోలు మిత్రుడు ప్రోద్బలంతో దనియాల లారీ ఎక్కి మద్రాసు వెళ్లినట్లు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలా మొదటి చిత్రం 'జగమే మాయ` సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే 7 సినిమాలకు సైన్ చేశారు. విలన్ పాత్రతో కెరియర్ ప్రారంభించిన ఆయన దాదాపు 300కు పైగా చిత్రాల్లో ప్రతి నాయకుడుగా కనిపించారు. హీరోగా 100 చిత్రాలు, కామెడీ, క్యారక్టర్ పాత్రల్లో దాదాపు 200 సినిమాలు చేశారు. దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణించిన గిరిబాబు 8 సినిమాలకు స్వయంగా కథ రాసుకున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన మూడేళ్లలోనే నిర్మాణసంస్థను పెట్టి, సక్సెస్ఫుల్ కెరియర్ ను చూశారు.
తొలి రోజుల్లో తనకు ఎదురైన పరిస్థితులను ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంటూ, ‘మంచినీళ్లు తాగి, అరటిపండు తిని కడుపు నింపుకున్న రోజులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అరటిపండ్లు కూడా తినేందుకు ఉండేవి కావు. పస్తులు ఉండాల్సి వచ్చేది. భార్యపిల్లలు గుర్తుకువచ్చి వెక్కివెక్కి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పారు. ఆ మాటల్లో సినిమా అవకాశాల కోసం ఆయన చేసిన పోరాటం ఎంత తీవ్రమైనదో అర్థమవుతుంది.
మద్రాసులో మోహన్‌బాబుతో ఆయనకు మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరూ ఒకే గదిలో ఉంటూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిన రోజులను గిరిబాబు అనేక ఇంటర్వ్యూల్లో గుర్తుచేసుకున్నారు. నెలకు రూ.40 అద్దె ఉన్న గదిలో ఇద్దరూ చెరో రూ.20 చెల్లించి ఉండేవారు. ఆ రోజుల్లో మోహన్‌బాబు పాఠశాలలో డ్రిల్ మాస్టర్‌గా పనిచేస్తూనే నటుడిగా ఎదగాలని ప్రయత్నించేవారు. ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం తర్వాతి కాలంలోనూ కొనసాగింది.
విలన్‌గా ప్రత్యేక గుర్తింపు
గిరిబాబు నటనలో ప్రత్యేకత ఆయన గొంతు, సంభాషణలు పలికించే తీరు, హావభావాలు. ప్రతినాయకుడిగా కనిపించినప్పుడు పాత్రలోని క్రూరత్వాన్ని, గంభీరతను సహజంగా ప్రదర్శించేవారు. విలన్ పాత్రల్లో అంతలా మెప్పించిన ఆయన కథానాయకుడిగా, హాస్యనటుడిగా, సహాయ నటుడిగా కూడా అభిమానులను సంపాదించుకున్నారు. ‘కురుక్షేత్రం’, ‘కరుణామయుడు’, ‘గూఢచారి 117’, ‘సింహాసనం’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’ వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. కె.విశ్వనాథ్, బాపు, జంధ్యాల, దాసరి నారాయణరావు వంటి దర్శకుల చిత్రాల్లో నటించిన గిరిబాబు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి వంటి మూడు తరాల కథానాయకులతో తెరను పంచుకున్నారు. నటుడిగా తన ప్రయాణాన్ని ఎప్పుడూ సంతృప్తితోనే గుర్తుచేసుకునేవారు. ఒక ఇంటర్వ్యూలో 41 ఏళ్ల తన సినీ ప్రయాణం గురించి ప్రస్తావిస్తూ, ‘నా సినిమాలన్నీ నాకు ఇష్టమే. ఎంతో అంకితభావంతో పనిచేశాను. సాధించిన దానితో సంతోషంగా ఉన్నాను’ అన్నారు.
నిర్మాతగా సాహసం
నటనతోపాటు సినిమా నిర్మాణం, దర్శకత్వం పట్ల కూడా గిరిబాబుకు ఆసక్తి ఉండేది. సొంతంగా చిత్రాలు నిర్మించాలనే ఆలోచనతో ఆ దిశగా అడుగులు వేశారు. 'సింహగర్జన', 'మెరుపుదాడి' వంటి చిత్రాలను నిర్మించారు. 'రణరంగం', 'ఇంద్రజిత్', 'నీ సుఖమే నే కోరుకున్నా' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. కథ, నటన, నిర్మాణం, దర్శకత్వం.. ఇలా సినిమా నిర్మాణంలోని వివిధ కోణాల్లో పనిచేశారు.
ఊరితో అనుబంధం
సినిమా రంగంలో ఎంత ఎదిగినా గిరిబాబు తన స్వగ్రామమైన రావినూతలను మర్చిపోలేదు. అక్కడి ప్రజలతో అనుబంధాన్ని కొనసాగించారు. గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. 2012లో గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంలో గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపం కోసం 1.25 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. 2008లో గ్రామంలో క్రీడా మైదానాన్ని నిర్మించారు. అయితే గ్రామంలో జూనియర్ కాలేజీ కట్టాలన్న ఆయన కల ‘కల’గానే మిగిలిపోయింది. తెలుగుదేశం నాయకుడిగా కాలేజీ అనుమతికి ఒప్పందం కుదుర్చుకున్నాక కూడా కొంతమంది అవకాశవాదుల వల్ల అది వెనక్కివెళ్లిపోయిందని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. వివిధ రాజకీయపార్టీలతో కలసి పనిచేయడం పై కూడా ఆయన మాట్లాడుతూ.. ‘అదంతా నా ఊరి బాగు కోసం ఏదైనా చేయాలన్న తపన. రాష్ట్రం అభివృద్ధి చెందితే చూడాలన్న ఆశతోనే జరిగింది’ అన్న ఆయన మాటల్లో సొంత గ్రామం, రాష్ట్రంపై ఎనలేని ప్రేమ కనిపిస్తాయి. స్వగ్రామంలో డివైఎఫ్ఐ వంటి యువజన సంఘాలు చేపట్టే కార్యక్రమాలకు కూడా గిరిబాబు చేదోడువాదోడుగా ఉండేవారు. యువత సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని ఎప్పుడూ ప్రోత్సహించేవారు.
తెరపై విలక్షణ నటనతో మెప్పించిన గిరిబాబు నిజజీవితంలో స్నేహానికి, మానవ సంబంధాలకు విలువ ఇచ్చారు. ఆయన ప్రయాణం కేవలం ఒక నటుడి విజయగాథ మాత్రమే కాదు.. ఎదురుదెబ్బలు తగిలినా ఇష్టమైన రంగాన్ని వదలకుండా ప్రయత్నిస్తే గమ్యాన్ని చేరుకోవచ్చని చెప్పే జీవిత కథ.







కామెంట్లు (0)