బీహార్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం అభ్యర్థులు చేపట్టిన నిరసనలపై ఆగస్టు 25న పోలీసులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ నిరసనల్లో నాలుగో తరగతి చదువుతున్న ఆదిత్య కుమార్ మాట్లాడిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘ప్రశ్నించడం, పోరాడడం’ తన కర్తవ్యం అన్నట్లుగా చాలా ధైర్యంగా మాట్లాడాడు. ఆ తరువాత తనను అరెస్టు చేశారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ రోజు పోలీస్ స్టేషన్‌లో అంతకంటే భయంకరమైన అనుభవం ఆదిత్య తల్లిదండ్రులకు ఎదురైంది. ప్రశ్నిస్తే సహించలేని పాలకుల నిరంకుశ ధోరణి తీవ్ర హింసల రూపంలో వెల్లడైంది.
ఆదిత్య కుమార్ మాటలు మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దానిని తీవ్రంగా తీసుకున్నారు. ఎలాగైనా ఆ బాలుడి నోరు మూయించాలని అనుకున్నారు. అందుకోసం తల్లిదండ్రులు రంజిత్ కుమార్ (30), మున్నీ కుమారి (28)లను లక్ష్యంగా చేసుకున్నారు. నిరసన ప్రదేశం నుంచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా హింసించారు. లాఠీలతో కొట్టారు. మున్నీ పొట్టపై బూటు కాళ్లతో తన్నారు. భరించలేని నొప్పితో ఆమె స్పృహతప్పి పడిపోయింది. అయినా వాళ్లు వదల్లేదు.
నిరుపేద కుటుంబం!
ఆదిత్య తండ్రి రోజుకూలీ. తల్లి ఇంటి పని చేసే కార్మికురాలు. సింగిల్ బెడ్‌రూమ్ ఇంట్లో ఈ కుటుంబం నివసిస్తోంది. ఆగస్టు 25న డక్ బంగ్లా చౌక్ దగ్గర జరుగుతున్న నిరసనల్లో పాల్గొనేందుకు వెళతానని ఆదిత్య అమ్మానాన్నతో చెప్పాడు. ఆదిత్యకు లెక్కలు, ఇంగ్లీషు, హిందీ సబ్జెక్టులంటే చాలా ఇష్టం. వాటితో పాటు తనతో ఎప్పుడూ రాజ్యాంగ ప్రతి కూడా ఉంటుంది. చాలా చురుకైన పిల్లాడు. నిరసనల్లో పాల్గొనడం తనకు అలవాటు. ఆదిత్యను తీసుకుని రంజిత్, మున్నీ నిరసన జరిగే ప్రదేశానికి వెళ్లారు. నిరసన తారాస్థాయికి వెళ్లినప్పుడు పోలీసులు ఆదిత్యను అడ్డుకోబోయారు. మీడియా పక్కనే ఉందని తెలిసి విడిచిపెట్టారు. ఆ తరువాత ఎవరో ఆదిత్యకు జెండాను అందించారు. అది పట్టుకుని ఎంతో ఉత్సాహంగా ప్రదర్శన ముందు నడిచాడు. నిరసనకారులను తరలించేందుకు పోలీసులు బస్సును ఏర్పాటు చేశారు. అందులో ఆదిత్యను ఎక్కించాలనుకున్నారు. అదీ సాధ్యంకాలేదు. తన కొడుకును ఎలాగైనా బంధించాలని పోలీసులు వేస్తున్న ఎత్తుగడలు తండ్రి రంజిత్‌ను తీవ్రంగా భయపెట్టాయి. ఆదిత్యను తీసుకుని ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు.
కొడుకుతో కలిసి రంజిత్ వెనక్కి వెళ్లిపోతున్నప్పుడు ‘నీ భార్య అక్కడ ఉంది’ అంటూ ఒక పోలీసు వారిని తీసుకుని వెళ్లాడు. అక్కడ మున్నీ ఉంది. తరువాత ముగ్గురినీ ఒక అంబులెన్స్‌లో ఎక్కించారు. ఇంటిదగ్గర దింపేస్తామని చెప్పారు. కానీ నేరుగా కొత్వాలీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దానికన్నా ముందు నిరసన ప్రదేశంలో పోలీసులు చేసిన లాఠీచార్జీని ఆదిత్య తీవ్ర స్థాయిలో ప్రశ్నించాడు. ‘లాఠీచార్జి చేయమని మీకు ఎవరు అనుమతి ఇచ్చారు? వారి తలలు పగలకొట్టమని ఎవరు చెప్పారు?’ అని చాలా గట్టిగా మాట్లాడాడు. ఆ ప్రశ్నలను పోలీసులు తట్టుకోలేకపోయారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళుతూ.. ‘మేం ఏం చేస్తున్నామో నీ పిల్లాడికి ఎందుకు?’ అని రంజిత్‌ను చాలా కోపంగా గద్దించారు.

పదిమంది కలిసి కొట్టారు!
స్టేషన్‌కు తీసుకెళ్లాక ఆదిత్యను బయట ఉంచి, రంజిత్, మున్నీని ఒక చిన్న గదిలో బంధించారు. ఆరుగురు మగ, నలుగురు ఆడ పోలీసులు
వారిపై హింసకు దిగారు. మున్నీని ఎలా కొట్టాలో ఆడ పోలీసులకు మగ పోలీసులు చెప్పారు. రంజిత్ చెప్పిన వివరాల ప్రకారం... ఒక ఆడ పోలీస్ మున్నీ కాళ్లపై ఎక్కి కూర్చొంది. ఒక మగ పోలీస్ మోకాలితో బలంగా అతడి వీపుపై కొట్టాడు. ఆ దెబ్బకు రంజిత్ కిందపడిపోయాడు. అప్పుడు అతడి రెండు చేతులు వెనక్కి లాగిపెట్టి నడుం కింద బలంగా పదే పదే కొట్టారు. మున్నీని కూడా అలాగే హింసించారు. దెబ్బలతో బయటకు వచ్చిన తల్లిదండ్రులను చూసిన ఆదిత్య ‘మా అమ్మానాన్నను ఎందుకు కొట్టారు?’ అని పోలీసులను చాలా గట్టిగా అడిగాడు.
తనపై జరిగిన పోలీసు దాష్టీకం గురించి మున్నీ ఇలా చెప్పారు. ‘సిజేరియన్ ద్వారా ఆదిత్య పుట్టాడు. పోలీసులు నా కడుపుపై కొట్టినప్పుడు తీవ్రంగా నొప్పి పుట్టింది. ఆ సమయంలో రంజిత్ నన్ను కొట్టొద్దని ఎంతో బతిమాలాడాడు. అయినా వాళ్లు వినిపించుకోలేదు. నొప్పికి తాళలేక కళ్లు తిరిగి పడిపోయాను. పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే డాక్టరుతో ‘పోలీసులు కొట్టారని చెప్పొద్దు’ అని హెచ్చరించారు. వైద్యులు నన్ను పరీక్షించేటప్పుడు కూడా పోలీసులు పక్కనే ఉన్నారు. డాక్టరు ఇంజక్షన్ చేసి, మందులు బయట కొనుక్కోమని చెప్పారు. కానీ పోలీసులు మందులు ఇప్పించలేదు. డాక్టర్ చీటీని కూడా వాళ్ల దగ్గరే పెట్టుకున్నారు’ అని మున్నీ ఆవేదన వ్యక్తం చేసింది. హాస్పిటల్ నుంచి మున్నీని తిరిగి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ‘ఇంకెప్పుడూ పిల్లాడిని నిరసనల్లో పాల్గొనకుండా చూస్తాం’ అని మున్నీ, రంజిత్‌తో పోలీసులు పూచీకత్తు పత్రం కూడా రాయించుకున్నారు. రాత్రి 8 గంటలకు వారిని విడిచిపెట్టారు. ‘ఆ రోజు రాత్రి భయంతో నాకు నిద్ర పట్టలేదు. మమ్మల్ని ఇంతలా ఎందుకు వేధించారు? మేము పేదవారిమా?’ అని మున్నీ ప్రశ్నిస్తోంది. రంజిత్ ఆ రోజు నుంచి పనిలోకి వెళ్లడం లేదు. ‘పోలీసులు వస్తారేమో.. అరెస్టు చేస్తారేమో’ అన్న భయంతో ఆ కుటుంబం వణికిపోతోంది.
అన్యాయాన్ని ప్రశ్నించిన ఒక చిన్నపిల్లాడిపై పోలీసులు ఎంతలా కక్ష సాధించారో ఈ సంఘటన రుజువు చేస్తోంది. పోలీసుల ప్రవర్తన, పాలకుల తీరు ఆ చిన్నారి మనసుపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అధికారం చేతిలో ఉందని ఇలా నిరంకుశంగా, దారుణంగా ప్రవర్తించే వ్యవస్థలను ఈ సమాజం చూస్తూ ఊరుకుంటుందా?
ఆదిత్య ఏం మాట్లాడాడు?
ఆ రోజు సీఎం నివాస ముట్టడిలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. అక్కడ ప్లకార్డు పట్టుకున్న ఆదిత్యను పోలీసులు పట్టుకుని తీసుకెళుతుండగా.. మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి ప్రశ్నించారు. ‘ఇక్కడికెందుకొచ్చావ్?’ అని ప్రశ్నించగా.. విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు. సీఎం విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇప్పటికే ఎన్నో హామీలిచ్చారని, కానీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించాడు. పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ధైర్యంగా ప్రశ్నించాడు. ‘‘ఇలా చేయమని మీకెవరు చెప్పారు? వాళ్ల (విద్యార్థులు) తలకు దెబ్బ తగిలింది. ఆయన (విద్యాశాఖ మంత్రి మిథిలేశ్) రాజీనామా చేయాలి. నేను ఎస్పీని, జిల్లా మెజిస్ట్రేట్ (డీఎం)ను అడుగుతున్నాను. నాకు సమాధానం కావాలి. వాళ్లని అడిగే హక్కు నాకుంది’’ అని మీడియా ముందు గట్టిగా చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చిన్న పిల్లాడు అంత గట్టిగా, స్పష్టంగా ప్రశ్నించడాన్ని, ఏ ప్రశ్నకైనా తడబాటు లేకుండా సమాధానం చెప్పడాన్ని పలువురు సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు.







కామెంట్‌లు (0)