శనివారం, 29 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionచెట్టుకొకరు పుట్టకొకరుగా వెలిగొండ నిర్వాసితులు

5 గంటల క్రితం

veligonda.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 29, 2026, 05:10 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్న సందర్భాల్లో వీటి కోసం తమ నివాసాలనే కాకుండా భూమి భుట్రా చెట్టూగట్టు యావదాస్తిని వదలిపెట్టి కొత్త ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్లే వారు నిర్వాసితులు కారు. వాస్తవంలో వీరు ప్రథమ లబ్ధిదారులుగా వుండాలి. తరతరాలుగా గ్రామాల్లో సామూహిక జీవితం గడిపిన వీరు చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదరైపోతున్నారు. లక్షలాది మంది అభివృద్ధి కోసం వేలాది మంది బలిపశువులౌతున్నారు. ప్రభుత్వాధినేతలు కాంట్రాక్టర్ల పట్ల చూపించే శ్రద్ధలో పదో వంతు కూడా నిర్వాసితుల పట్ల చూపడం లేదు. ఎప్పటికప్పుడు నిర్మాణ పనులు సాగించే కాంట్రాక్టర్లకు తాజా షెడ్యూల్ రేట్ల ప్రకారం లేదా ప్రభుత్వాధి నేతల అభీష్టం మేరకు ఇంకా చెప్పాలంటే క్లిష్టతరమైన పనులని పెచ్చు రేట్లు ఇస్తున్నారు. కాని కొంపా గోడు మొత్తం వదలి పెట్టి వెళ్లే నిర్వాసితులకు తాజా షెడ్యూల్ రేట్లు ఇవ్వడం లేదు. ​ ఈ నేతలు గ్రామీణ జీవితంలోని వైరుధ్యం, వైవిధ్యాన్ని గుర్తించడంలేదు. కులాలు, మతాలు వేరైనా ఒకరికొకరు బావా.. మామా.. అక్క.. అమ్మ.. అని పిలుచుకొంటూ వుంటారు. అప్పుసప్పు ఇచ్చుకోవడం కద్దు. కొన్ని కుటుంబాలు పూర్తిగా పాడిపశువుల ఆధారంగా కుటుంబాన్ని నెట్టుకొస్తుంటారు. కొన్ని కుటుంబాల్లో మగవాళ్లు కుటుంబాన్ని నెట్టుకురాగా మహిళలు పాడితో తమ బిడ్డలను ఉన్నత చదువులు సాగించే సందర్భాలు అనేకం వున్నాయి.

ఇంత కథనం ఎందుకంటే వెలిగొండ ప్రాజెక్టులోని నల్లమల సాగర్ లోని 11 గ్రామాలకు చెందిన గ్రామీణుల జీవితాలు చెల్లాచెదురౌతున్నాయి. వీరికి భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం లభించడం లేదు. 2013 భూసేకరణ చట్టం ఏం చెబుతుంది? నిర్వాసితులకు ఎన్ని రోజుల ముందు ప్యాకేజీ నిధులు ఇవ్వాలి? గ్రామాలు ఖాళీ చేయమని ఎన్ని రోజుల ముందు నోటీసులు ఇచ్చి తట్టా బుట్టా సర్దుకొనేందుకు ఎంత వ్వవధి ఇవ్వాలని భూసేకరణ చట్టం చెబుతున్న వాటిని ప్రభుత్వాలే అమలు చేయకపోతే ఎలా?

ప్రస్తుతం వెలిగొండ నిర్మాణం పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు ఇప్పుడు నిర్వాసితులకు ఇస్తున్న 2008 సంవత్సరం నాటి షెడ్యూల్ రేట్లే ఇస్తున్నారా? ధర వరలు పెరిగాయని కాంట్రాక్టర్లకు అనువైన రేట్లు ఇస్తున్నప్పుడు ఉన్న ఊరు వదలి కన్నీటితో కొత్త ప్రాంతాలు వెతుక్కుంటూ వెళ్లే వారు మాత్రం ఏం పాపం చేశారు? పది మంది కోసం త్యాగం చేస్తున్న వీరిని సంతృప్తితో సాగనంపాలి కదా?

వెలిగొండ నిర్వాసితులకు మొదటగా జూన్ ఆఖరులో రూ.300 కోట్లు విడుదల చేశారు. మిగిలినవన్నీ పక్కనబెడితే రాష్ట్ర ప్రభుత్వానికి నిర్వాసితుల పట్ల కనీస మానవతా దృక్పథం వుండి వుంటే ఆ రోజునే అందరికీ ప్యాకేజీ నిధులు ఇచ్చి వుండేది. కనీసం రెండు నెలల కాలంలో కొత్త నివాసాలు వెతుక్కునే వారు. దురదృష్టమేమంటే ఇంకా ఈనాటికీ 1115 నిర్వాసిత కుటుంబాలకు ప్యాకేజీ డబ్బులు అందవలసి వుందంటున్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వం వ్యవహరించిన విధానం గురించి అవకాశం లభించినపుడల్లా విమర్శలు గుప్పించే కూటమి ప్రభుత్వాధినేతలు ఇప్పుడు నిర్వాసితుల పట్ల చూపుతున్న క్రూరమైన విధానం గురించి ఏం చెబుతారు? 11 గ్రామాలకు చెందిన ఏడెనిమిది వేల కుటుంబాల్లో కనీసం అదే సంఖ్యలో ప్రాథమిక విద్య అభ్యసించే పిల్లల భవిష్యత్తు ఏంగాను?

గ్రామాల్లో ఎక్కువ కుటుంబాలు పాడి పశువుల ఆధారంగా జీవనం నెట్టుకు వస్తున్నారు. ఉన్న పళాన పొమ్మంటే చాల మంది పాడి పశువులనే కాకుండా పశుగణాన్ని తెగనమ్ముతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి కుటుంబాలు పొదుపు క్రమం తప్పి డ్వాక్రా సంఘాల ద్వారా తీసుకొన్న అప్పు చెల్లించలేరు. ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ వారికి భరోసా ఇవ్వకపోగా బికారులుగా మార్చే అవకాశం వుండవచ్చు.

2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు కనీసం మూడు నెలల సమయమిచ్చి వుండేవారు. నల్లమల సాగర్ లో నీళ్లు నింపే గడువు వారం రోజులు పెట్టుకొని ఇంకా నిర్వాసితులకు ప్యాకేజీ ఇవ్వలేదంటే దీన్ని ఏమని అభివర్ణించాలి. ఇవన్నీ నాణేనికి ఒక వైపే... మరో వైపు భయంకరంగా వుంది. పరిహారం పొందేందుకు అర్హత వుండి కూడా అధికారులు తయారు చేసిన జాబితాలో పేరు లేనివారు చాలామంది వున్నారని చెబుతున్నారు. ఇలాంటి వారి పరిస్థితి మరీ హృదయ విదారకమైనది. అధికారులు ఊరు నుండి ఖాళీ చేయమంటారు. ఉన్న ఊరు వదలి వెళ్లాలంటే చేతిలో చిల్లిగవ్వ వుండదు. అధికారులు లిస్ట్ తయారు చేసిన తరువాత 18 సంవత్సరాలు నిండినవారు, ఇటీవల పెళ్లిళ్లు చేసుకొని వేరు కాపురాలు పెట్టిన వారు వుంటారు. ఇట్టి వారిని వేరే కుటుంబాలుగా పరిగణించాలి. ఇళ్ల స్థలాలు వేరుగా చూపాలి. ప్రస్తుతం ఇలాంటి తరహా కుటుంబాలను గాలికి వదిలేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పళాన ఖాళీ చేయమంటే వీరి పరిస్థితి ఏంటి?

నిర్వాసితులకు ఇచ్చేందుకు ఇళ్ల స్థలాలను కొన్ని చోట్ల ఇప్పుడు చదును చేస్తున్నట్లు మీడియాలో ఫోటోలు వచ్చాయి. కొసమెరుపు ఏమంటే ఈ ప్లాట్ కేటాయింపులూ ఇంత వరకు జరగలేదంటున్నారు. మౌలిక సదుపాయాలు పూర్తిగా కావాలంటే రెండు మూడు నెలలు కావచ్చని చెబుతున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రథమ లబ్ధిదారులు నిర్వాసితులని ఉద్ఘాటించే నేతలు ఈ కార్యక్రమం కనీసం ఆరు నెలలు ముందు ప్రారంభించి వుండాలి కదా!

v sankaraiah latest.jpg

వ్యాసకర్త - విశ్రాంత పాత్రికేయుడు వి.శంకరయ్య

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్