మారికవలస గురుకుల పాఠశాల కొనసాగింపునకు హామీ
ప్రజాశక్తి- పాడేరు/పాడేరు టౌన్ (అల్లూరి జిల్లా) : విశాఖ నగరంలోని మారికవలస ఎపిటిడబ్ల్యుఆర్ పాఠశాల కొనసాగింపుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పాఠశాల ఎత్తివేతను వ్యతిరేకిస్తూ ఆదివాసీ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిరవధికంగా పాడేరు ఐటిడిఎ గేటు ఎదుట సాగిన పోరాటానికి అధికారులు దిగొచ్చారు. పాఠశాల కొనసాగింపునకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. శుక్రవారం రాత్రి ఐటిడిఎ పిఒ ఆదిత్య వర్మ, జిల్లా ఎస్‌పి అమిత్ బర్దర్ ఆందోళనకారులతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. అప్పటికే శిబిరంలో ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులను బస్సులో మారికవలస ఎపిటిడబ్ల్యుఆర్ పాఠశాలకు తరలించారు. బస్సుతోపాటు ఐటిడిఎ పిఒ తన వాహనంలో ఇద్దరు తల్లిదండ్రులను ఎక్కించుకుని స్వయంగా మారికవలసకు తీసుకెళ్లి దింపి తిరిగి వచ్చారు. శనివారం ఉదయం మరికొంతమంది విద్యార్థులను ఐటిడిఎ ఎపిఒ, టిడబ్ల్యు డిడి బస్సులో మారికవలసకు తరలించారు. దీంతో, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనకు తెరపడింది.

కేక్ కట్ చేసి... థింసాతో సంబరాలు
పాఠశాల కొనసాగింపుపై ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఐటిడిఎ గేటు ఎదుట కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు. అనంతరం థింసా నృత్యాలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పాఠశాలను కాపాడుకునే పోరాటంలో అన్ని విధాలుగా అండగా నిలిచి, వెన్నుదన్నుగా ఉంటూ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, హెచ్ఆర్ఎఫ్ రాష్ట్ర ఛైర్మన్ శోభ (చిన్ని), ఆదివాసీ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.హైమావతి, మహిళా సమాఖ్య జిల్లా నాయకులు విమల, ఆదివాసీ నిరుద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కర్జ కుమార్, స్పెషల్ డిఎస్‌సి సాధన కమిటీ జిల్లా నాయకులు భాను, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు పాంగి చిన్నారావు, డిఎల్‌ఒ నాయకులు రంజిత్‌కుమార్, కొత్తయ్య, భీమరాజు తదితరులు తమ పోరాటానికి అండగా నిల్చారన్నారు. గురుకుల పాఠశాల కొనసాగింపు విషయంలో ప్రభుత్వం మాటతప్పితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.








కామెంట్‌లు (0)