తెలుగు రాష్ట్రాల రహదారులు రక్తసిక్తంగా మారుతున్నాయి. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో కోదాడ, చిలకలూరిపేట, అనంతపురం రోడ్డు ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందటం కలవరపరుస్తోంది. మన రహదారి వ్యవస్థ భద్రతా, బాధ్యత ఎంతగా కొరవడుతోందో ఈ ప్రమాదాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతి ప్రమాదం తర్వాత కొద్దిసేపు కలకలం, కొన్ని పరామర్శలు, పరిహారం ప్రకటనలు. ఆ తర్వాత మళ్లీ యథాతథం. ప్రమాదం అనుకోని ఘటనే కావచ్చు. కానీ ఒకే తరహా ప్రమాదాలు మళ్లీ మళ్లీ జరుగుతుంటే అది వ్యవస్థ వైఫల్యమే. తెల్లవారుజామున ప్రయాణాలు, డ్రైవర్ల నిరంతర డ్యూటీలు, నిద్రలేమి ఇవన్నీ ప్రైవేటు బస్సు ప్రమాదాల వెనుక పదేపదే కనిపిస్తున్న కారణాలే. రాత్రివేళల్లో దూర ప్రయాణాలు చేసే ప్రైవేటు ట్రావెల్స్ డ్రైవర్లపై కనీస నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోంది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, డ్రైవర్ల విశ్రాంతి నిబంధనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఆగి ఉన్న వాహనాలకు రిఫ్లెక్టర్లు, హెచ్చరిక సంకేతాలు లేకపోవడం వంటి చిన్న నిర్లక్ష్యాలు కూడా భారీ ప్రాణ నష్టానికి కారణమవుతున్నాయి.
జాతీయ రహదారులపై టోల్ రుసుము వసూలు చేయడంలో చూపుతున్న శ్రద్ధలో పదో వంతైనా రహదారుల నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై చూపడం లేదన్న విమర్శలు బలంగా ఉన్నాయి. జాతీయ రహదారిపై ఏకారణంచేతనైనా వాహనం నిలిచిపోతే దానిని వెంటనే తరలించే విధానం సరిగా అమలుకావడం లేదు. గతంలో కర్నూలు, ప్రస్తుతం కోదాడ వద్ద జరిగిన ప్రమాదాలకు ఇదే ప్రధాన కారణం. టోల్ వసూళ్లలో చూపుతున్న శ్రద్ధను రహదారి నిర్వహణ, డ్రైనేజీ నిర్మాణం, భద్రత విషయంలో చూపడం లేదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఫాస్టాగ్ స్కానింగ్ సమస్యలు, లేన్ మార్పులో ఇబ్బందులు, ఆక్రమణలు, సరైన పర్యవేక్షణ లేమి వంటివి టోల్ ప్లాజాల వద్ద నిత్యకృత్యంగా మారాయి. ప్రజల నుంచి రుసుము వసూలు చేసే సంస్థలు, ఆ మేరకు రహదారుల నాణ్యత, ప్రమాద నివారణ చర్యలు, అత్యవసర సహాయక వ్యవస్థలు కల్పించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోకూడదు. టోల్ అనేది కేవలం రాబడి మార్గంగా కాక, భద్రతకు హామీగా మారాలి. రోడ్ల నిర్మాణానికి వేల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం, ప్రయాణికుల భద్రతకు బాధ్యత తీసుకోవడం లేదు.
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా గత సంవత్సరం 5,13,563 రోడ్డు ప్రమాదాలు జరిగి, సగటున ప్రతి గంటకు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంఖ్య 5.3 శాతం పెరిగింది. వీటిలో దాదాపు 70 శాతం మరణాలు అతి వేగం వల్లే సంభవిస్తున్నాయని కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వీటిల్లో లక్షలాదిమంది తీవ్ర గాయాలపాలై, సాధారణ జీవితానికి దూరమవుతున్నారు. అలాగే, జాతీయ గణాంకాల ప్రకారం...యువతే ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారు (18-45 ఏళ్లు). కుటుంబాలను పోషించే వారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం. తెలుగు రాష్ట్రాల పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ తాజా గణాంకాల ప్రకారం 2025లో రాష్ట్రవ్యాప్తంగా 18,398 ప్రమాదాలు నమోదు కాగా, అంతకు ముందు ఏడాది 18,460తో పోలిస్తే ప్రమాదాల సంఖ్య స్వల్పంగా తగ్గినా, మరణాలు 8,158 నుంచి 8,428కి పెరిగాయి. అంటే ప్రమాదాలు తగ్గినా వాటి తీవ్రత పెరుగుతోందన్నమాట. ప్రమాదాలు, మరణాల్లో తిరుపతి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. అలాగే, తెలంగాణలో 2023లో 22,903 రోడ్డు ప్రమాదాలు నమోదైతే, 2024 నాటికి ఆ సంఖ్య 25,986కి చేరింది. కేవలం ఏడాదిలోనే 13.5 శాతం పెరిగింది. అయితే, ఈ గణాంకాల వెనుక ఒక కుటుంబం, ఒక ఆదాయం, ఒక భవిష్యత్తు, ఎన్నో కన్నీళ్లు ఉన్నాయి. ప్రమాదాలను ముందుగానే అంచనా వేసే వ్యవస్థను పాలకులు రూపొందించాలి. ప్రమాద డేటాను కేంద్రీకరించి, సమయం, వాతావరణం, వాహనం, రహదారి రూపకల్పన, గాయాల తీవ్రత వంటి అంశాల ఆధారంగా విశ్లేషించాలి. ఈ సమాచారాన్ని జిల్లాల వారీగా ప్రజలకు విడుదల చేస్తేనే విధాన నిర్ణయాలు ఊహలపైగాక, ఆధారాలపై సాగుతాయి. కేంద్రం సూచించిన ఇ-డిఎఆర్ వంటి డేటా వ్యవస్థలు కేవలం రికార్డు నిల్వ కోసంగాక, ప్రమాద నిరోధక చర్యలకు మార్గదర్శకంగానూ ఉపయోగపడాలి.
రోడ్డు టెర్రర్‌ను కేవలం ట్రాఫిక్ విభాగ సమస్యగా మార్చేయడం తగదు. ఇది ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక, రవాణా నిర్వహణ, కార్మిక హక్కులు, అత్యవసర వైద్యం, అన్నింటినీ తాకే భద్రతా సంక్షోభం. రహదారుల నిర్వహణ లోపాలను ప్రభుత్వాలు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఎఐ) సత్వరం సరిదిద్దాలి. ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలపై కఠిన నియంత్రణ, డ్రైవర్ల ఫిట్‌నెస్, విశ్రాంతి నిబంధనల కచ్చిత అమలు, రాత్రివేళల్లో వేగ నియంత్రణపై నిఘా తప్పనిసరి. టోల్ వసూలు చేసే సంస్థలు రహదారి భద్రతకు జవాబుదారీగా ఉండాలి.







కామెంట్‌లు (0)