- ఐరాస స్వతంత్ర కమిషన్ నివేదికల్లో వెల్లడి
ఇజ్రాయిల్ గత మూడు సంవత్సరాలుగా పాలస్తీనాపై కొనసాగిస్తున్న జాతి నిర్మూలన దాడివెనుక కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున లాభపడ్డాయని ఐక్యరాజ్య సమితి నియమించిన అంతర్జాతీయ స్వతంత్ర కమిషన్ స్పష్టం చేసింది. 6 జూన్, 11 జూలై 2025న రెండు విడతలుగా విడుదల చేసిన నివేదికలో కార్పొరేట్ శక్తుల కుట్రలు బహిర్గతమయ్యాయి. ఈ కమిషన్ దర్యాప్తులో భాగంగా 200కు పైగా సంఘటనల్లో వెయ్యికి పైగా కార్పొరేట్ సంస్థల ప్రమేయాన్ని ఆ కంపెనీల డేటాబేస్ ఆధారంగా నిర్ధారణ చేయడం ద్వారా తిరుగులేని నిజాలను బట్టబయలు చేసింది. కార్పొరేట్ దోపిడి గురించి తమ దృష్టికి వచ్చిన ఆరోపణలను నిర్ధారించుకోవడానికి కమిషన్ 45కు పైగా కార్పొరేట్ కంపెనీలను వివరణ కోరింది. అందులో 15 మాత్రమే స్పందించి అరకొర సమాచారాన్ని ఇచ్చాయి. ఒకవైపు పాలస్తీనా, ముఖ్యంగా గాజా భూభాగమంతా రక్తంతో తడిసిపోతుంటే, మరొపక్క అంతులేని సిరిసంపదలను కార్పొరేట్ కంపెనీలు పోగేసుకున్నాయనే నిజాన్ని చూసిన తర్వాత కారల్ మార్క్స్ నూట ఏబై సంవత్సరాల క్రితం చెప్పిన 'పెట్టుబడిదారీ వ్యవస్థ అమానవీయ, దారుణమైన లజ్జాకర దోపిడి రూపం' అనే వ్యాఖ్య గుర్తుకురాక తప్పదు.
జాతి నిర్మూలన నుండి ఆర్థిక వ్యవస్థ నిర్మూలన వరకు
వలసవాదం అనేది భూమి యజమానులను భూముల నుండి బహిష్కరించి, ఆ భూమిని స్వాధీనం చేసుకుని, అందులోని వనరులను దోచుకోవడం, స్థానిక ప్రజలను, భూమిని వలసరాజ్యంగా మార్చుకోవడం చరిత్రలో మనం చూశాం. నేడు పాలస్తీనాలో ఇజ్రాయిల్ చేస్తున్న వలసవిధానం తనతో పాటు ప్రపంచంలోని అనేక కార్పొరేట్ కంపెనీలు దోచుకునే విధంగా చేయడం ద్వారా జాతి నిర్మూలన కోసం జరుపుతున్న దారుణాలను బయటి ప్రపంచానికి తెలియకుండా వారి మద్దతును సంపాదించింది. ఇళ్ళు, పాఠశాలలు, ఆసుపత్రులు, వినోద, ప్రార్థనా స్థలాలు, జీవనోపాధులు, ఆలివ్ తోటలు, పండ్ల తోటలు వంటి ఉత్పాదక ఆస్తులను నాశనం చేయడానికి, స్థానిక ప్రజల నుండి వాటిని వేరుచేసి వారిని నియంత్రించడానికి, అక్కడి సహజ వనరులను లూటీ చేయడానికి అవసరమైన ఆయుధాలు, యంత్రాలను ఇజ్రాయెల్‌కు అందించడం ద్వారా కార్పొరేట్ రంగం గణనీయంగా దోహదపడింది.
పాలస్తీనాను బూచిగా చూపి ఇజ్రాయిల్ ఆయుధాల ఉత్పత్తిని భారీగా పెంచేసింది. 2020 - 2024 మధ్య, ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదవ అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా మారిందని ఈ కమిషన్ తెలిపింది. రెండు అత్యంత ప్రముఖ ఇజ్రాయెల్ ఆయుధ కంపెనీలు (ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో స్థాపించబడి, తరువాత ప్రైవేటీకరించబడినవి) ఎల్బిట్ సిస్టమ్స్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోని 50 అతిపెద్ద ఆయుధ తయారీదారులలో ఒకటిగా ఉన్నాయి. ఇటాలిలోని లియోనార్డో ఎస్‌పిఎ ప్రపంచవ్యాప్తంగా నిర్మించిన భాగాలు, విడిభాగాలు ఇజ్రాయెల్ కు సరాఫరా చేసి ఎఫ్ -35 విమాన తయారీకి దోహదపడింది. దీనిని ఇజ్రాయెల్ లాక్‌హీడ్ మార్టిన్, దేశీయ కంపెనీల భాగస్వామ్యంతో తయారు చేసుకుని 2018లో పాలస్తీనా పై ప్రయోగించి ఎఫ్ -35ను యుద్ధవిమానంగా మార్చిన మొదటి దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది. ఇప్పుడు మనదేశంతో సహా ప్రపంచంలో అనేక దేశాలకు వీటిని ఆ కంపెనీలు ఎగుమతి చేసుకుంటూ భారీగా లాభపడ్డాయి. 2025 నాటికి దానిని ''బీస్ట్ మోడ్''లో ఉపయోగించింది. ఇజ్రాయెల్ వైమానిక దళానికి కీలకమైన లాక్ హీడ్ మార్టిన్ ఎఫ్-35, ఎఫ్ -16 యుద్ధ విమానాలకు, 2000 పౌండ్ల నుండి 18,000 పౌండ్లకు పైగా బాంబులను ఒకేసారి మోయగల సామర్థ్యం అమర్చగలిగాయి. దీని సామర్ధ్యాన్ని పరీక్షించుకోవడం కోసం అక్టోబర్ 2023 తర్వాత పాలస్తీనా భూభాగంపై సుమారు 85,000 టన్నుల బాంబులను వేసి 1,79,411 మందికి పైగా పాలస్తీనియన్లను ఈ కంపెనీలు చంపాయి.ఎల్బిట్, ఐఎఐ వంటి ఇజ్రాయెల్ కంపెనీలకు, పాలస్తీనాలో కొనసాగుతున్న మారణహోమం ఒక లాభదాయకమైన వ్యాపారంగా మారింది. 2023 నుండి 2024 వరకు ఇజ్రాయెల్ సైనిక వ్యయం 65 శాతం పెరిగి 46.5 బిలియన్ డాలర్లకు చేరడంతో ఈ కంపెనీలకు పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చాయి. మైక్రోసాఫ్ట్ 1991 నుండి ఇజ్రాయెల్లో చురుకుగా పనిచేస్తూ అమెరికా వెలుపల తన అతిపెద్ద కేంద్రాన్ని అభివృద్ధి చేసుకుంది. 2003 నుండి మైక్రోసాఫ్ట్ ఇజ్రాయెల్ సైన్యానికి పూర్తిస్థాయిలో టెక్నాలజీ, సేవలు అందిస్తుంది, అదే సమయంలో ఇజ్రాయెల్ సెక్యూరిటీ, నిఘా స్టార్ట్ - అప్‌లను కొనుగోలు చేసింది. 2021లో ఇజ్రాయెల్ ఆల్ఫాబెట్ ఇంక్ (గూగుల్), అమెజాన్.కామ్ ఇంక్‌లకు 1.2 బిలియన్ డాలర్ల కాంట్రాక్టును ఇచ్చింది. మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్. అమెజాన్ సంస్థలు ఇజ్రాయెల్‌కు తమ క్లౌడ్, ఎఐ సాంకేతికతలను విచ్చలవిడిగా అందిస్తూ మారణహోమానికి ఆజ్యం పోశాయని కమిషన్ తేల్చింది.







కామెంట్‌లు (0)