- ఏలూరులో ఉత్సాహభరితంగా 23వ రాష్ట్ర మహాసభ ప్రారంభం
ప్రజాశక్తి-ఏలూరు ప్రతినిధి, సిటీ : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభ శుక్రవారం ఏలూరులో ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. మహాసభ ప్రారంభాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రైతు మహాప్రదర్శనకు రాష్ట్రం, జిల్లా నలుమూలల నుంచి రైతులు, వ్యవసాయ కార్మికులు, గిరిజనులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఏలూరులోని జ్యూట్ మిల్లు సెంటర్ నుంచి మహాప్రదర్శన ప్రారంభమై ఓవర్ బ్రిడ్జి, ఫైర్ స్టేషన్ సెంటర్, జడ్‌పి కార్యాలయం సెంటర్ మీదుగా ఇండోర్ స్టేడియం వరకూ ఎర్ర జెండాలు, నినాదాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ర్యాలీలో రైతులు అరటి మొక్కలు, పొగాకు బేళ్లు, కోకో పంట నమూనాలను ప్రదర్శిస్తూ వ్యవసాయ రంగ ప్రాధాన్యత చాటి చెప్పారు. భాష్యం స్కూలు విద్యార్థుల కోలాటాలు, జానపద నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
డప్పు కళాకారుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘హలో హలో రైతన్న... చలో ఏలూరు’, ‘జయప్రదం చేయండి రాష్ట్ర రైతు మహాసభను’ వంటి నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా ముందుకు సాగింది. రైతులు తమ సమస్యలను ప్రతిబింబించేలా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, మద్దతు ధరలకు గ్యారంటీ చట్టం తీసుకురావాలని, రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, వ్యవసాయ రంగానికి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లలో తగిన నిధులు కేటాయించాలని, కార్పొరేట్ సంస్థలకు రాయితీలు కాకుండా రైతులకు ప్రోత్సాహకాలు అందించాలని, వ్యవసాయ విద్యుత్‌కు స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, ఎరువులు, పురుగుమందులు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని, సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని, బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని తదితర నినాదాలతో హోరెత్తించారు.
ఈ మహాప్రదర్శనలో ఎపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, ఎపి కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి. బలరాం, నిర్వాసితుల సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఏలూరు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ తదితర నాయకులు హాజరయ్యారు. రైతాంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన వ్యవసాయ విధానాలు అవలంబించాలని, రైతుల ఆత్మహత్యలు నివారణకు వ్యవసాయ రంగానికి రక్షణ కల్పించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో రైతులు పాల్గొనడంతో ఏలూరు నగరంలో ఎక్కడ చూసినా ఎర్ర జెండాలు రెపరెపలాడుతూ నినాదాలతో మహాప్రదర్శన హోరెత్తించింది.







కామెంట్‌లు (0)