- ఇప్పటి వరకు 2,595 శవాలు గుర్తింపు
- పెరుగుతున్న మృతుల సంఖ్య
కార్కస్ : వెనిజులాలో సంభవించిన ఘోరమైన జంట భూకంపాల తర్వాత ఒక వారం గడిచినా ఆ దేశం షాక్ నుంచి ఇప్పటికీ తేరుకోలేదు. అధికారిక మృతుల సంఖ్య, అనధికార రిపోర్టుల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోందని చర్చ నడుస్తోంది. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ గురువారం మాట్లాడుతూ ఈ భూకంపాలలో కనీసం 2,595 మంది మరణించారని, ఇది ముందు రోజు నివేదిక కంటే 300 శాతం ఎక్కువ అని తెలిపారు. ఒక ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన మృతుల సంఖ్య చాలా తక్కువని, అది వాస్తవంగా ఉన్నదానిలో మూడో వంతు కూడా కాదని తాను నమ్ముతున్నట్టు తెలిపారు. భూకంపాల వల్ల తీవ్రంగా దెబ్బతిన్న లా గువైరా ఓడరేవు నగరంలో తాను పనిచేస్తున్న తాత్కాలిక శవగారంలో రోజుకు సుమారు 400 మృతదేహాలను ప్రాసెస్ చేస్తున్నారని, వాటిలో చాలా వరకు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయాయని, బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయని పాథాలజిస్ట్ చెప్పారు. శీతలీకరించిన ట్రక్కులలో ఇక స్థలం లేకపోవడంతో, వారు మృతదేహాల సంచులను బయట ఎండలో ఉంచవలసి వస్తోంది. అక్కడ అవి త్వరగా కుళ్లిపోతున్నాయి. కూలిపోయిన ఎత్తైన భవనాల శిథిలాల కింద ఇంకా చాలా మంది కనబడకుండా ఉన్నారు. మృతుల పూర్తి వివరాలు వెలువడటానికి కొంత సమయం పట్టవచ్చని అధికారులు చెప్తున్నారు. వెనిజులా ప్రభుత్వం తమ గణనను ఎలా నిర్వహిస్తుందో, భూకంపాల అనంతర పరిణామాలలో ఎంతమంది గల్లంతైన వారిగా పరిగణించబడుతున్నారో అస్పష్ట సమాధానమే వినిపిస్తోంది.
మృతదేహాలను వెలికి తీస్తున్న కుటుంబసభ్యులు
కుటుంబసభ్యులు తామే స్వయంగా శిథిలాల నుంచి తమవారి మృతదేహాలను తీసుకొస్తున్న పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ‘‘పౌర రక్షణ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, చివరికి అత్యవసర సేవల సిబ్బంది కూడా ఆ మృతదేహాలను వెలికితీయలేకపోతున్నారు. అందుకే వారే స్వయంగా తమ మృతులను తీసుకువస్తున్నారు’’ అని సదరు ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ అన్నారు. మృతుల సంఖ్య 10వేలకుపైనే ఉండవచ్చునని చెప్పారు.







కామెంట్‌లు (0)