- అత్యవసర పరిస్థితి ప్రకటన
లాస్ ఏంజిల్స్ : ప్రఖ్యాత నగరం లాస్ ఏంజిల్స్‌లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న వేర్‌హౌస్ అగ్నిప్రమాదం తీవ్ర రూపం దాల్చింది. ఆకాశమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకోవడంతో శనివారం నగరంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గత బుధవారం మధ్యాహ్నం సుమారు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఒక ఆహార నిల్వ కేంద్రంలో మంటలు చెలరేగాయి. వేర్‌హౌస్‌లోని ఫోమ్ ఇన్సులేషన్ మండుతుండటం, అమ్మోనియా లీకేజీ, కరుగుతున్న సోలార్ ప్యానెల్స్ కారణంగా మంటలను అదుపు చేయడం అగ్నిమాపక సిబ్బందికి సవాలుగా మారింది. "ఇది చాలా పెద్ద, క్లిష్టమైన ఘటన," అని మేయర్ కరెన్ బాస్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరానికి అవసరమైన వనరులను సకాలంలో అందించేందుకే ఈ అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు ఆమె పేర్కొన్నారు. పొగ వాసన నగరం అంతటా వ్యాపించిందని, ప్రజలు వీలైనంత వరకు బయటకు రావద్దని లాస్ ఏంజిల్స్ ఫైర్ డిపార్ట్‌మెంట్ సోషల్ మీడియా ద్వారా సూచించింది. మంటలు ప్రస్తుతం వేర్‌హౌస్‌కే పరిమితమైనప్పటికీ, ప్లాస్టిక్ కాలుతున్న వాసనతో కూడిన పొగ ఇంకా వెలువడుతూనే ఉంది. దీంతో తూర్పు లాస్ ఏంజిల్స్‌లోని బోయిల్ హైట్స్ ప్రాంత నివాసితులు కిటికీలు మూసివేసి, ఇళ్లలోనే ఉండాలని ప్రారంభంలో ఆదేశాలు జారీ చేశారు. పొగ నుండి తప్పించుకోలేని వారి కోసం అధికారులు 24 గంటల సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పొగ ప్రాణాంతకమైనది కాదని పేర్కొంటూ ఆంక్షలను కొంతవరకు సడలించారు. అయినప్పటికీ, గాలి నాణ్యత క్షీణించినందున బయటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.








కామెంట్‌లు (0)