వాషింగ్టన్ : సుడాన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలతో అమెరికా ఒక భారతీయ కంపెనీతో పాటు పలు సంస్థలు, ఎనిమిది మంది వ్యక్తులపై ఆంక్షలు విధించింది. ఈ విషయాన్ని అమెరికా ఆర్థిక శాఖకు చెందిన ఫారిన్ అసెట్స్ కంట్రోల్ ఆఫీస్ (OFAC) ప్రకటించింది.
అమెరికా ఆరోపణల ప్రకారం, సుడాన్ సాయుధ దళాలు (SAF), రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య కొనసాగుతున్న ఘర్షణ మరింత తీవ్రమయ్యేందుకు ఈ సంస్థలు సహకరిస్తున్నాయి. ఈ రెండు దళాల మధ్య కొన్నేళ్లుగా కొనసాగుతున్న పోరాటం కారణంగా సుడాన్‌లో తీవ్రమైన అంతర్యుద్ధ పరిస్థితులు నెలకొని, ప్రపంచంలోనే అతిపెద్ద మానవతా సంక్షోభాల్లో ఒకటిగా మారింది.
ఆంక్షలకు గురైన వారిలో ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన అలోక్ చౌధరీ కూడా ఉన్నారు. ఆయన ఎస్‌బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థకు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ అమిన్ ఎక్స్‌ప్లోజివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అమెరికా తెలిపింది.
అమెరికా ఆరోపణల ప్రకారం, అమిన్ ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ సుడాన్ సాయుధ దళాలకు చెందిన ఆయుధ తయారీ సంస్థకు సుమారు 200 షిప్‌మెంట్లలో పేలుడు పదార్థాలను సరఫరా చేసింది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఎల్ ఎనర్జీ లిమిటెడ్‌తో పాటు సుడాన్, ఈజిప్ట్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరికొన్ని సంస్థలపై కూడా అమెరికా ఆంక్షలు అమలు చేసింది.
ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ మాట్లాడుతూ .... ఆయుధాలు, పేలుడు పదార్థాలు, విదేశీ యోధుల సరఫరా వల్ల సుడాన్‌లో ఘర్షణలు మరింత సుదీర్ఘమవుతున్నాయని, దీనివల్ల మానవతా సంక్షోభం మరింత తీవ్రమై ఉగ్రవాద సంస్థలు విస్తరించేందుకు కూడా అవకాశం ఏర్పడుతోందని పేర్కొన్నారు.









కామెంట్‌లు (0)