- విస్తరిస్తున్న రైతు నిరసనలు
గాంధీనగర్: గుజరాత్ రైతులు రోడ్డెక్కి తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారు. పలు అంశాల వారీగా చేస్తున్న నిరసనలతో బిజెపి ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరవుతోంది. వ్యవసాయ భూముల్లో విద్యుత్ స్తంభాలు, హై-టెన్షన్ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పథకం నుంచి గుజరాత్ రైతులను సంవత్సరాలుగా మినహాయించారు. ఈ రెండు అంశాలపై ఈ నిరసనలకు ప్రధాన మీడియాలో పెద్దగా ప్రాధాన్యత లభించనప్పటికీ.. గుజరాత్ ప్రభుత్వం ఈ ఆందోళనను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కనిపిస్తోంది.
వ్యవసాయ భూముల్లో స్తంభాల ఏర్పాటుపై..
గుజరాత్‌లోని అనేక జిల్లాల్లో విద్యుత్ కంపెనీలు పొలాల మీదుగా విద్యుత్ స్తంభాలు, హై-టెన్షన్ ట్రాన్స్‌మిషన్ లైన్లను ఏర్పాటు చేస్తున్నాయి. ముఖ్యంగా కచ్, సౌరాష్ట్ర , ఉత్తర గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలలో గుజరాత్‌లో విస్తరిస్తున్న సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను తరలించడానికి ఈ "ట్రాన్స్‌మిషన్ కారిడార్లను" నిర్మిస్తున్నారు. ఒకసారి విద్యుత్ స్తంభం వెలిస్తే, ఆ భూమి శాశ్వతంగా చేజారిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తలపైన ఉండే విద్యుత్ తీగల వల్ల ట్రాక్టర్లు, హార్వెస్టర్లను నడపడం కష్టంగా మారి, వ్యవసాయం జరగకుండా అడ్డుకుంటున్నాయి. అవి వారి భూమి ఉత్పాదకతను, విలువను కూడా తగ్గిస్తున్నాయి.
భూమి మాది.. ఆదాయం కంపెనీలకా?
రైతులకు నష్టపరిహారం చెల్లిస్తున్నప్పటికీ.. ఆ ఒక్కసారి చెల్లింపులు చాలా తక్కువగా ఉన్నాయని, ఏటా తాము కోల్పోతున్న దానికి అవి ఏమాత్రమూ సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా విద్యుత్ కంపెనీలు అవే తీగల నుంచే ఆదాయాన్ని పొందుతున్నాయనీ, తాము క్రమం తప్పకుండా భూమి శిస్తు చెల్లిస్తున్నామని, అలాంటప్పుడు కేవలం ఒక్కసారి చెల్లింపు చేసి, సంవత్సరాల తరబడి తమ భూమిపై నిర్మించిన మౌలిక సదుపాయాల నుంచి విద్యుత్ కంపెనీలు ఎందుకు ఆదాయాన్ని పొందాలని రైతు నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇది అన్యాయమని, నష్టపరిహార నిబంధనలను తిరిగి రాయాలని తాము కోరుతున్నామని రైతు సంఘాలు తెలిపాయి. రైతు నాయకులు భరత్‌సింగ్ ఝాలా, విజయభాయ్ ఉగ్రేజా, నరేష్ పటేల్ తదితరుల నేతృత్వంలో జెట్‌పూర్, మోతీ మరద్‌లలో జరిగిన నిరసనల ద్వారా ఈ ఆగ్రహ జ్వాలకు మొదటగా బీజం పడింది. జిల్లా కలెక్టర్ సమావేశానికి పిలవగా.. 22 గ్రామాల సర్పంచులు బహిష్కరించారు. స్థానిక బిజెపి నాయకులు గ్రామస్థుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు.
5.5 లక్షల కుటుంబాలపై ప్రభావం!
గుజరాత్ లోని సుమారు 20 జిల్లాలలో దాదాపు 500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 100 హై-వోల్టేజ్ విద్యుత్ కారిడార్లను ఏర్పాటు చేస్తోంది. 135 గిగావాట్ల విద్యుత్‌ను తరలించే ప్రణాళికలో భాగంగా ఇది జరుగుతోంది. దీనివల్ల సుమారు 5.5 లక్షల రైతు కుటుంబాలు ప్రభావితం కావచ్చని, దాదాపు 3,800 హెక్టార్ల వ్యవసాయ భూమి నష్టపోవచ్చని రైతు సంఘాలు అంచనా వేస్తున్నాయి. 14 జిల్లాల్లోని రైతులకు వారి భూముల్లో స్తంభాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే నోటీసులు అందగా, ఆరు జిల్లాల్లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
ట్రాక్టర్ ర్యాలీ
జూన్ 15న కిసాన్ కాంగ్రెస్, కిసాన్ సంఘర్ష్ సమితి సంయుక్త ఆధ్వర్యంలో రైతులు శాంతిపుర సర్కిల్ నుంచి గాంధీనగర్ వరకు ఒక భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. సూరత్, మోర్బి, రాజ్‌కోట్, సురేంద్రనగర్, భావ్‌నగర్, కచ్ , ఉత్తర గుజరాత్ నుంచి 1,000కి పైగా ట్రాక్టర్లు ఇందులో పాల్గొన్నాయి. ఈ ర్యాలీలో రైతు నాయకులు మాట్లాడుతూ అదానీతో సహా పలు కంపెనీలు బలవంతంగా స్తంభాలు ఏర్పాటు చేస్తున్నాయని విమర్శించారు. నిరసన తెలిపే రైతులపై పోలీసులు దాడి చేస్తుండటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కిసాన్ కాంగ్రెస్ నాయకులు కచ్‌లోని వ్రజవాని గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభించి, ద్వారకలో జరిగే ఒక భారీ సభ వద్ద ముగించనున్నట్టు ప్రకటించారు. ఈ సమస్య నష్టపరిహారానికి సంబంధించినది కాదని, ప్రయివేటు వ్యవసాయ భూముల మీదుగా వెళ్లే ట్రాన్స్‌మిషన్ కారిడార్లను నియంత్రించే విధానాన్ని తిరిగి రాయడమని రైతు సంఘాలు తెలిపాయి.
భూసేకరణ చట్టం ప్రకారం..
భూసేకరణ చట్టం, 2013 ప్రకారం భూమికి మార్కెట్ ధర కంటే నాలుగు రెట్లు ఎక్కువ, తమ భూమిలోని ప్రతి పోల్‌కు నెలకు రూ. 50,000 అద్దె, ప్రతి పోల్‌కు ఒకేసారి రూ. 2 కోట్లు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా సొంతంగా రైతు సదస్సు నిర్వహించి, ప్రత్యేక నిరసనలు చేపడతామని హెచ్చరించింది.
గుజరాత్ క్యాబినెట్‌కు తాకిన సమస్య
ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అధ్యక్షతన జరిగిన గుజరాత్ క్యాబినెట్ కు రైతు ఆగ్రహం తాకింది. కొత్త విధానాన్ని రూపొందించేందుకు రైతు సంఘాలు, ప్రతినిధులతో చర్చలు జరపాలని క్యాబినెట్ నిర్ణయించింది. 2022లో గుజరాత్ రాష్ట్రం ట్రాన్స్‌మిషన్ కారిడార్ల పరిధిలోకి వచ్చే భూములకు ఇచ్చే పరిహార రేటును భూమి విలువలో 7.5 శాతం నుంచి 15 శాతానికి రెట్టింపు చేసింది. అయినప్పటికీ, తమ భూమి ఎంతగానో విలువను, వినియోగాన్ని కోల్పోతున్నందున, ఆ మొత్తం కూడా సరిపోదని రైతులు అంటున్నారు.
ప్రధానమంత్రికి రైతుల లేఖ
తక్షణ పురోగతి లేకపోవడంతో రైతు నాయకులు తమ డిమాండ్లను నేరుగా ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. జూన్ 22న, ఝాలా ప్రధానమంత్రికి ఒక సవివరమైన వినతిపత్రాన్ని పంపారు. ‘‘ విద్యుత్ ప్రసార లైన్ల నోటీసులలో గ్రామ పేర్లు మాత్రమే కాకుండా, ప్రభావిత రైతుల పేర్లు, భూమి సర్వే నంబర్లను కూడా పేర్కొనేలా కేంద్రం నిబంధనలను మార్చాలి’’ అని వారు కోరారు. రైతుల సమ్మతి లేకుండా, కొన్నిసార్లు పోలీసుల అండతో స్తంభాలను ఏర్పాటు చేయడంతో అన్నదాతలో ఆగ్రహం మరింతగా రగులుతోంది.







కామెంట్‌లు (0)