mh ad
గురువారం, 25 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionయుపిలో వెట్టి చాకిరీ

4 గంటల క్రితం

up
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 12:47 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • తప్పించుకోవడానికి యత్నిస్తే కొరడా దెబ్బలు, కుక్కలతో కాట్లు

  • యజమాని వేధింపులతో కార్మికుడు మృతి

  • మైనర్లతో సహా 12 మందిని రక్షించిన అధికారులు

లక్నో : బిజెపి పాలనలోని ఉత్తరప్రదేశ్‌‌లో కార్మికులతో వెట్టి చాకిరీ, వేధింపులు, అక్రమ నిర్బంధం ఇంకా కొనసాగుతున్నాయి. ముజఫర్‌‌నగర్‌ ‌జిల్లాలోని మండిలో ఒక పేపర్‌ ‌ప్లేట్ల తయారీ కేంద్రంలో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కార్మికులను ఇక్కడ అక్రమంగా నిర్భంధించి వేతనాలను లేకుండా బలవంతంగా పనిచేయించడంతో పాటు వారి దారుణ వేధింపులకు పాల్పడుతున్నారు. సుమారు రెండేళ్లుగా జరుగుతున్న ఈ దారుణం ఇటీవల పోలీసులు, జిల్లా అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో వెలుగులోకి వచ్చింది. ఈ నెల 22న అధికారులు తమ దాడుల్లో మైనర్లతో సహా 12 మంది కార్మికులను రక్షించారు. అధికారులు విచారణలో తయారీ కేంద్రం యజమాని కార్మికులను అక్రమంగా నిర్బంధించి శ్రమ దోపిడికీ, వేధంపులకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వేధింపులతో ఒక కార్మికుడు మృతి చెందినట్లు విచారణలో వెల్లడయింది. అధికారుల సమాచారం ప్రకారం నెలకు రూ. 12 వేల జీతం ఇస్తామని ఆశ చూపి ఈ కార్మికులను వివిధ రాష్ట్రాల నుండి తీసుకువచ్చారు. కానీ, వారిని సుమారు రెండేళ్లకు పైగా కర్మాగారం ఆవరణలోనే నిర్బంధించి, వేతనాలు ఇవ్వకుండా, బయటకు వెళ్లనివ్వకుండా నిర్బంధించారు. వేధింపులకు గుర్తుగా కార్మికుల వంటిపై స్పష్టమైన గాయాల, హింస తాలూకు గుర్తులు కనిపించాయి. వీరి భారీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే భౌతికంగా దాడుల చేయడంతో పాటు కొరడాలు- పదునైన ఆయుధాలతో దాడి చేయడం, కుక్కలను ఉసికొల్పడం.. వంటి చర్యలతో హింసించేవారని కార్మికులు విచారణ సమయంలో అధికారులకు తెలిపారు. అంతేకాకుండా బలవంతంగా పశువుల మేత తినిపించడం చేశారని, అమానవీయ పరిస్థితుల్లో ఉంచారని కూడా వారు పేర్కొన్నారు. వేధింపులు, హింసతో అర్జున్ అనే కార్మికుడు గతేడాది నవంబర్‌‌లో మరణించాడని, ఆ తర్వాత అతని మృతదేహాన్ని ఒక సంచిలో కుక్కి పారేశారని తోటి కార్మికులు అధికారులకు తెలిపారు. కార్మికుల ఫిర్మాదుతో ఫ్యాక్టరీ యజమాని అంకిత్ బలియాన్, శివ త్యాగిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత, వెట్టిచాకిరీ వ్యవస్థ (రద్దు) చట్టం, బాల కార్మిక వ్యవస్థ (నిషేధ మరియు నియంత్రణ) చట్టంలోని వివిధ సెక్షన్ల కింది అభియోగాలు మోపారు. త్యాగిని అరెస్టు చేయగా, బలియాన్ పరారీలో ఉన్నాడు. మరో నిందితుడు ప్రదీప్ బలియాన్ కోసం కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఈ కేసును దర్యాప్తు చేయడానికి, సాక్ష్యాలను సేకరించడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. అలాగే, రక్షించిన కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మేజిస్ట్రేట్ సమక్షంలో వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. అలాగే, కార్మికులను కుటుంబాలతో తిరిగి కలపడం, ప్రభుత్వ పథకాల కింద సహాయం అందించడం, బ్యాంకు ఖాతాలు తెరవడం.. వంటి పునరావాస చర్యలపై అధికారులు ప్రస్తుతం దృష్టి పెట్టారు. కాగా, ఈ ఘటనపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. దీనిని మానవత్వంపై దాడిగా ఆయన పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్