న్యూఢిల్లీ : ఈనెల 21న నీట్ యుజి -2026 పరీక్షను మళ్లీ నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఆదేశాలకు సుప్రీంకోర్టు నిరాకరించింది. స్టే విధించలేమని స్పష్టం చేసింది. బదులుగా పిటిషన్ విచారణను ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలపై ఇప్పటికే విచారణ జరుపుతున్న విస్తృత ధర్మాసనానికి పరిశీలన కోసం పంపింది. వచ్చే నెల 17న ఈ పిటిషన్ విచారణ జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు రానున్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ సూర్యకాత్, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. హెల్త్ సర్వీసెస్ మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ మంగళ కోహ్లి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను పరిశీలించింది. ఇప్పటికే ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించిన పలు పిటిషన్లు జస్టిస్ నరసింహ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తోంది. ఆ బెంచ్ ముందుకు జులై 17న ఈ అంశం విచారణకు రానుంది. అందువల్ల ప్రస్తుతం రీటెస్ట్‌ను నిలిపివేసేలా ఎలాంటి ఆదేశాలూ ఇవ్వకుండా, ఈ పిటిషన్‌ను కూడా అదే బెంచ్ పరిశీలనకు సుప్రీంకోర్టు పంపింది.
15 కోట్ల మంది హక్కులను ఆపగలమా?
టెలిగ్రామ్‌పై నిషేధం కేసులో కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ప్రశ్న తీర్పు రిజర్వ్ కొంత మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారనే కారణంతో 15 కోట్ల మంది వినియోగదారుల హక్కులను మనం ఆపగలమా అని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు గురువారం ప్రశ్నించింది. టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధానికి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్ విచారణలో హైకోర్టు ఈ ప్రశ్నను సంధించింది. తమపై నిషేధానికి వ్యతిరేకంగా ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని ధర్మాసనం అత్యవసరంగా విచారించింది. ‘ఒకరిని రక్షించడానికి ఇంకొకరి హక్కును మీరు అడ్డుకుంటారా’ అని విచారణ సందర్భంగా జస్టిస్ కరియా ప్రశ్నించారు. కేంద్రం ఆరోపిస్తున్న పత్రాల లీక్‌ను నివారించడానికి రియల్-టైమ్ పర్యవేక్షణ వంటి తగిన చర్యలు తీసుకున్నారా.. అని టెలిగ్రామ్ సంస్థను జస్టిస్ కరియా ప్రశ్నించారు. టెలిగ్రామ్ తరఫున సీనియర్ న్యాయవాది ధ్రువ్ మెహతా వాదనలు వినిపించారు. అభ్యంతరకరమైన పోస్టులను తొలగించాలని కేంద్రం కోరగలదని, ప్లాట్‌ఫామ్‌పై వివక్ష పూరితంగా నిషేధం విధించకూడదని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ (ఎస్‌జి) తుషార్ మెహతా వాదనలు వినిపించారు. టెలిగ్రామ్ యాప్ డిజైన్ భిన్నంగా ఉండటం వల్ల దర్యాప్తు నిర్వహించడం కష్టంగా ఉందని కోర్టుకు తెలిపారు. డార్క్‌వెబ్‌కు టెలిగ్రామ్ మరో రూపంగా మారిందని ఆరోపిస్తూ హైకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. నేరస్తులు, తీవ్రవాద ముఠాలు, ఇతర ప్రమాదకర శక్తులు విచారణ సంస్థల కండ్లు గప్పేందుకు ఆ యాప్‌ను వినియోగించడం పెరిగిందని తెలియజేసింది. టెలిగ్రామ్, కేంద్ర ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకున్నట్టు కోర్టు తెలుపుతూ తీర్పును రిజర్వ్ చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) సిఫార్సుతో టెలిగ్రామ్‌పై ఈ నెల 17 నుంచి వారం రోజుల పాటు తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధాన్ని టెలిగ్రామ్ తో పాటు, ఈ రంగానికి నిపుణులు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. మెటాలో రిలయన్స్ గ్రూప్‌నకు పాక్షిక వాటా ఉన్న కారణంగానే వాట్సాప్‌పై కేంద్రం నిషేధం విధించలేదని టెలిగ్రామ్ సిఇఓ పావెల్ దురోవ్ ఆరోపించారు.
అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకున్న 16 లక్షల మంది
ఈనెల 21న జరగనున్న నీట్-యుజి 2026 పరీక్షకు 16 లక్షల మంది అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను విజయవంతంగా డౌన్‌లోడ్ చేసుకున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) తెలిపింది. బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ లేకుండానే అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌కు ప్రక్రియను ఎన్‌టిఎ సులభతరం చేసింది. ఈనెల 14న అడ్మిట్ కార్డులు విడుదలైన విషయం విదితమే.
పారదర్శకంగా నీట్ రీ ఎగ్జామినేషన్ : సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
అత్యంత పారదర్శకంగా నీట్ యుజి రీ ఎగ్జామినేషన్ నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 21న పరీక్ష జరగనున్న నేపథ్యంలో ఆయన గురువారం విద్యాశాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ), ఉన్నత విద్యా సంస్థల సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. నీట్ పరీక్ష కార్యకలాపాలను సమన్వయం చేయడానికి మంత్రిత్వ శాఖ నియమించిన అధికారులు అన్ని రాష్ట్రాలకు చేరుకుంటారని, ఎన్‌టిఎ డైరెక్టర్ జనరల్ (డిజి) నేతృత్వంలోని కమాండ్ సెంటర్‌కు నివేదికలు అందిస్తారని మంత్రి తెలిపారు. సంబంధిత అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని, స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాత వాతావరణంలో పరీక్ష నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. విద్యార్థులు ఒత్తిడి లేని వాతావరణంలో పునఃపరీక్షకు హాజరయ్యేలా అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాల నోడల్ అధికారులను మంత్రి కోరారు. హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించిన ఈ సమావేశానికి పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి సంజయ్ కుమార్, ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి వినీత్ జోషి, ఎన్‌టిఎ డైరెక్టర్ జనరల్ శ్రీ అభిషేక్ సింగ్ సహా 222 మంది హాజరయ్యారు.









కామెంట్‌లు (0)