mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కొత్తతరానికి మోటూరు స్ఫూర్తిదాయకం

7 గంటల క్రితం

vsr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 02:12 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, ప్రజాశక్తి పూర్వసంపాదకులు, మోటూరు హనుమంతరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ఆయన నేటితరానికి స్ఫూర్తిదాయక నేత అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కొనియాడారు. ఎంహెచ్‌ 25వ వర్థంతి సభ విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగింది. ప్రజాశక్తి సంపాదకులు బి తులసీదాస్‌ అధ్యక్షతన జరిగిన సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రజలను చైతన్యం చేయడం ద్వారా జర్నలిస్టులు కాపాడాలని కోరారు. ఎంహెచ్ సంపాదకులుగా, రాజకీయ నాయకుడిగా, విశ్లేషకునిగా, వక్తగా అసమాన ప్రతిభ చూపారని స్మరించుకున్నారు. కొత్త తరానికి ఆయన స్ఫూర్తిదాయకం అని పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ విసి కె వియన్నారావు మాట్లాడుతూ జీవితం మొత్తం ఒకే లక్ష్యంతో పనిచేయడం, జీవితాన్ని అంకితం చేయడం గొప్ప విషయమని, అలాంటి త్యాగశీలి ఎంహెచ్‌ అని పేర్కొన్నారు. విద్యార్థి దశలో వామపక్ష భావజాలం ఉండేవారే దేశాన్ని నిజాయితీ, నిబద్ధతతో నడిపిస్తారని తాను సివిల్‌ ‌సర్వీస్‌ ‌బోర్డులో పనిచేసే సమయంలో భావించానని చెప్పారు. ప్రశ్నిస్తున్న వారిని నిర్బంధిస్తున్నారని, వాక్‌ స్వాతంత్రం, రూల్ ఆఫ్‌ ‌లా అమలయ్యేలా ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యమం చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. నిజాన్ని నిర్భయంగా చెప్పే పరిస్థితి, మాట్లాడే ధైర్యం కలిగిన వ్యక్తులను గుర్తించి ప్రోత్సహించడం ఎంతైనా అవసరమని, అందుకు మోటూరు నుంచి స్ఫూర్తి పొందాలని చెప్పారు. సమాజాన్ని, సమాజంలో ఉన్న ఆలోచన విధానాన్ని, సమాజ నడవడికను ప్రభావితం చేయగలిగిన యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వ కార్యకలాపాలు ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ​సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మోటూరు వంటి మహానుభావులను గుర్తుంచుకోవాలని, అలాంటి వారి గురించి నేటి తరం విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. 1964కు ముందు వలే బలమైన రాజకీయ శక్తిగా కమ్యూనిస్టు పార్టీలు ప్రస్తుత పరిస్థితుల్లో రావాలని ఆకాంక్షించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దినపత్రిక నేరుగా ‌చదివేవారి సంఖ్య తగ్గిపోతోందన్నారు. ప్రస్తుతం యువత మొబైల్‌లోనే ఎక్కువగా ఉంటున్నారని తెలిపారు. ఆధునిక ధోరణులకు అనుగుణంగా వారిని చేరుకోవాలని, అందులో భాగంగానే ప్రజాశక్తి మార్పులు చెందుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిజం ఏది అని తెలుసుకోలేక గందరగోళంలో ప్రజలున్నారని చెప్పారు. ప్రజల కోసం పనిచేయాలనే ఏజెండాతో ప్రజాశక్తి నడుస్తోందని, ఆ లక్ష్యంతోనే ఆ పత్రిక ముందుకు వెళ్తుందని ఆశించారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్‌ ‌లక్ష్మణరావు మాట్లాడుతూ తాను లెక్చరర్‌‌గా పని చేసే సమయంలో లెక్చరర్ల ఉద్యమానికి మోటూరు గైడెన్స్‌ ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు. ప్రతి అక్షరం ప్రజల పక్షం నినాదంతో ప్రత్యామ్నాయ జర్నలిజంతో ప్రజాశక్తి ముందుకెళ్తోందన్నారు. రాష్ట్రవిభజన సందర్భంగా చేసిన విభజన చట్టంలో అనేక హామీలు ఇచ్చారని తెలిపారు. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై ప్రజాశక్తి తప్ప మిగిలిన పత్రికలు రాయలేదన్నారు. ప్రముఖ న్యాయవాది, ఎపి బార్‌ ‌కౌన్సిల్‌ ‌సభ్యులు సుంకర రాజేంద్రప్రసాద్‌ ‌మాట్లాడుతూ మోటూరు హనుమంతరావు చాలా సున్నితమైన మనస్సు కలిగిన వ్యక్తి అని చెప్పారు. అయితే రాజకీయంగా ఆయన నిర్ణయాలు మాత్రం కఠినంగా తీసుకునేవారని తెలిపారు. ‌దేశాన్ని తిరోగమనం వైపు నడిపే శక్తులు ముందుకొస్తున్నాయని, పురోగమనం వైపు నడిపే శక్తులు బలహీనపడుతున్నాయని చెప్పారు. ఇలాంటి సమయంలోనే మరింత బలంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఫెయిర్‌‌కోడ్‌ ఇన్ఫోటెక్‌ ‌సిఇవో ఎంజికె విష్ణు, దేశాభిమాని దినపత్రిక ఐటి మేనేజర్‌ ఎ సునీర్‌, ప్రజాశక్తి డిప్యూటీ ఎడిటర్‌ ‌వి రాంభూపాల్‌, సిజిఎం వై అచ్యుతరావు, జనరల్‌ ‌మేనేజర్‌ ‌హరికిషోర్‌‌, ప్రముఖ వైద్యులు ఎం సుధాకర్‌, రంగారావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్