న్యూఢిల్లీ : 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినా, క్షేత్రస్థాయిలో అతివలకు తగిన రాజకీయ ప్రాతినిథ్యం దక్కడం లేదని 'అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్' (ఎడిఆర్) నివేదిక స్పష్టం చేసింది. ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలు సైతం ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపుల్లో మహిళలకు మొండిచేయి చూపుతున్నాయి. 2023లో ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు కేవలం 10.2 శాతం మంది మహిళలను మాత్రమే పోటీలో నిలిపాయి. మొత్తం 31,429 మంది అభ్యర్థుల్లో కేవలం 3,273 మంది మహిళలే పోటీ చేయడం, రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది. ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మహిళా అభ్యర్థులు 14శాతానికి మించలేదని పేర్కొంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం.. 33శాతం సీట్లను మహిళలకు కేటాయించడం తప్పనిసరి.
2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన కొన్ని నెలల తర్వాత జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో, మొత్తం 8,360 మంది అభ్యర్థులలో కేవలం 800 మంది (9.6 శాతం) మాత్రమే మహిళలు ఉన్నారని నివేదిక తెలిపింది. అలాగే మొత్తం 543 నియోజకవర్గాలలో 152 (28శాతం) నియోజకవర్గాల్లో అసలు మహిళా అభ్యర్థులే లేరని పేర్కొంది. అత్యధిక సంఖ్యలో మహిళా అభ్యర్థులు ఉన్న రాష్ట్ర అసెంబ్లీల విషయానికొస్తే, ఒడిశా (2024) 13.9 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ (2025 - 13.7శాతం), పుదుచ్చేరి (2026 - 13.6 శాతం) ఉన్నాయి.అరుణాచల్ ప్రదేశ్ (2024), జమ్మూ కాశ్మీర్ (2024) రాష్ట్రాల్లో మహిళా అభ్యర్థుల భాగస్వామ్యం అత్యల్పంగా నమోదైంది. ఈ ప్రాంతాల్లో పోటీ చేసిన మొత్తం అభ్యర్థులలో మహిళల వాటా కేవలం 4.9శాతం మాత్రమేనని తెలిపింది.
లోక్ సభ ఎన్నికలను పరిశీలిస్తే.. 2024 సాధారణ ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీ కూడా మహిళా అభ్యర్థుల విషయంలో నిర్దేశిత 'మూడింట ఒక వంతు' (33శాతం) ప్రమాణాన్ని అందుకోలేదు. బిజెపి, కాంగ్రెస్ లు 13శాతం నుండి 16శాతం లోపు మహిళా అభ్యర్థులను ప్రకటించగా, పలు ప్రాంతీయ పార్టీలు మహిళలకు గణనీయంగా ప్రాతినిధ్యాన్ని కలిగించాయి. వీటిలో నామ్ తమిళర్ కట్చి (ఎన్ టికె -50శాతం), బిజు జనతాదళ్ (బిజెడి-33శాతం), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్ జెడి -29శాతం), ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఎఐటిఎంసి-25శాతం) లు మహిళలను ప్రకటించాయి.
బిల్లు ఆమోదం పొందినప్పటి నుండి జరిగిన 20 అసెంబ్లీ ఎన్నికల్లో, జాతీయ పార్టీల్లో కాంగ్రెస్ మాత్రమే సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో 33శాతం మహిళా అభ్యర్థులను ప్రకటించింది. ప్రాంతీయ పార్టీల్లో ఎన్ టి కె పుదుచ్చేరి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసింది. రెండు ఎన్నికల్లోనూ 50శాతం మహిళా అభ్యర్థులను బరిలోకి దింపింది. సిపిఐ(ఎం)(ఎల్) పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 56శాతం, అస్సాం ఎన్నికల్లో 33శాతం మహిళా అభ్యర్థులను బరిలోకి దింపింది. సమాజ్ వాది పార్టీ (ఎస్ పి) రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 40శాతం మహిళా అభ్యర్థులను బరిలోకి దింపింది. విదుతలై చిరుతైగళ్ కచ్చి (విసికె) పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో 50శాతం మహిళా అభ్యర్థులను పోటీలోకి దింపగా, రాష్ట్రీయ లోక్ జనశక్తి (ఆర్ ఎల్ జె పి) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 50శాతం టిక్కెట్లను మహిళా అభ్యర్థులకు కేటాయించింది.









కామెంట్‌లు (0)