- సాయికృష్ణను చిత్రహింసలు పెట్టి, చంపేసి కనబడకుండా చేశారు
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
- సాయికృష్ణ కుటుంబ సభ్యులకు పరామర్శ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఆటవిక, అనాగరిక పాలన నడుస్తోందని, యువకుడిని పోలీస్టేషన్లో చిత్రహింసలకు గురిచేసి చంపి చివరకు డెడ్‌బాడీని కూడా కనబడకుండా చేయడం దుర్మార్గమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. కృష్ణలంకలో హత్యకు గురైన సాయికృష్ణ కుటుంబ సభ్యులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా సాయికృష్ణ మేనమామ నాగేశ్వరరావును కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన మేనల్లుడిని తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి చంపేశారని తెలిపారు. నెలరోజులపాటు తిరిగినా పట్టించుకోకుండా వేధించారని అన్నారు. పోలీసులు తీసుకెళ్లిన సమయంలో పోలీసులంటే భయం ఉండాలనే ఉద్దేశంతో తాము కూడా మాట్లాడలేదని తెలిపారు. అయితే తీవ్రంగా కొట్టి చంపడమే కాకుండా మృతదేహాన్ని కూడా ఇవ్వలేదన్నారు. కనీసం బూడిద అన్నా ఇవ్వమన్నామని, చనిపోయిన తేదీ అయినా చెప్పాలని కోరామని తెలిపారు. దేనికీ స్పందన లేదని, ఇంతకంటే అన్యాయం మరొకటి లేదని అన్నారు. అనంతరం శ్రీనివాసరావు అక్కడే మీడియాతో మాట్లాడారు. సాయికృష్ణ ఉదంతంలో ఏమి జరిగిందో అధికారికంగా వాస్తవాలు వెల్లడించాలన్నారు. ఆయన కుటుంబానికి న్యాయం జరిగే వరకూ తాము అండగా ఉంటామని తెలిపారు. పోలీస్టేషన్లోనే యువకుడిని కొట్టి చంపడమే కాకుండా డెడ్‌బాడీని కూడా లేకుండా చేశారని తెలిపారు. నాగరిక సమాజంలో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అనేది అర్థం కావడం లేదని తెలిపారు. ఒకపక్క ఫ్రెండ్లీ పోలీసు అని చెబుతూనే సమాజానికి శుత్రువులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. చిన్న చిన్న కేసుల్లో ఉన్నవారిని, యువతను కొట్టి చంపుతున్న పోలీసులు.. పెద్దలను, ఎక్కువ కేసులు ఉన్న రాజకీయ నాయకులను పెద్ద మనుషులుగా చూస్తూ వదిలేస్తున్నారని, ఇదేమి న్యాయమని ప్రశ్నించారు. సరిదిద్దే అవకాశం ఉన్న యువకులను చంపడం ఏమిటని అన్నారు. ఎన్‌కౌంటర్ చేసిన సమయంలోనూ మృతదేహాలను కూడా ఇస్తున్నారని, కానీ విజయవాడ లాంటి నగరాల్లో మృతదేహాన్ని కూడా మాయం చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఇటువంటి వారిని రాజకీయ వ్యవస్థ కాపాడుతోందని తెలిపారు. ఒక యువకుడిని కొట్టి చంపిన పోలీసు అధికారిని కాపాడటంలో ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏమిటో చెప్పాలన్నారు. ఐపిఎస్ అధికారిని నియమించి విచారణ అంటే కంటితుడుపు చర్య తప్ప మరొకటి కాదని, న్యాయ విచారణ జరపాలని అన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పౌర హక్కులను కాపాడుతామని, ప్రజలకు రక్షణ కల్పిస్తామని అధికారంలోకి వచ్చారని తెలిపారు. సాయికృష్ణను పోలీస్టేషన్లోనే కొట్టి చంపారని తల్లి, బంధువులు అందరూ చెబుతున్నారని, ఇది లాకప్‌డెత్‌తో పాటు, శవాన్ని కూడా మాయం చేయడం దేశ, రాష్ట్ర చరిత్రలో దారుణ దుర్ఘటనని తెలిపారు. కృష్ణలంక పోలీసులు దుర్మార్గానికి క్రాంతికుమార్ అనే వ్యక్తి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు. దీనికి ఎవరు కారణమో చెప్పాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ.. సాయికృష్ణను తీసుకెళ్లి అన్యాయంగా కొట్టి చంపారని కుటుంబ సభ్యులు చెబుతున్నారని, వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కృష్ణ, బోయి సత్యబాబు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)