mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అందరూ ఆ మీడియా వైపేనా?

2 గంటల క్రితం

social media
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 06:00 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం

- పీపీ


'వార్త యందు జగము వర్థిల్లుచున్నది' అని మహాభారతం నాటి పద్యం చెప్పుకుని జర్నలిజం క్లాసులు మొదలెట్టేవారు. 'పేపర్లో పెద్దక్షరాలతో వేశారంటే అంతే మరి' అన్నారు మరో స్టేజిలో. 'ఇందాక స్క్రోలింగ్‌ వచ్చింది చూళ్లేదా?' అని వత్తి పలుకుతూ వచ్చారు తర్వాతి ఘట్టంలో. ఇప్పుడవన్నీ పాత కథలే మరి. పత్రికలూ టీవీలు అని కాదు. అసలు జనానికి వార్తలు అంటే న్యూస్‌ల మీదనే నమ్మకం తగ్గిపోతున్నదట. వున్నంతలో కూడా సోషల్‌ మీడియా అనేదానిపైనే కాస్త ఆసక్తి వుంటోందట. ఇవన్నీ ఉజ్జాయింపుగా చెబుతున్న కబుర్లు కావు. అక్షరాలా లోతైన విస్తార అధ్యయనం చేసి మరీ తేల్చిన ముచ్చట్లు. అది కూడా ప్రసిద్ధమైన రాయిటర్స్‌ సంస్థ, ప్రతిష్టాత్మకమైన ఏషియన్‌ జర్నలిజం స్కూలు కలిసి చెబుతున్న మాట. ప్రపంచవ్యాపితంగా 48 మార్కెట్లకు చెందిన లక్ష మందిని ఇందుకోసం సర్వే చేశారట. 2015 తర్వాత ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో ఇప్పుడు వార్తల విశ్వసనీయత తగ్గిపోయింది. సోషల్‌ మీడియాలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, టిక్‌ టాక్‌, యూ ట్యూబ్‌ వంటి వాటిపైనే యువత ఎక్కువగా ఆధారపడుతున్నారు. యువత అలవాట్లకు, వారి తల్లిదండ్రుల తరం అలవాట్లకు పోలికే లేదు. 35 ఏళ్ల లోపు వారు 10 శాతం మంది వరకూ కేవలం ఎ.ఐ సమాచారంపై ఆధారపడుతున్నారు. ఇక 77 శాతం మంది చిన్న పెద్ద తేడా లేకుండా వీడియోలనే ఆశ్రయిస్తున్నారు. కంటెంట్‌ క్రియేటర్స్‌, స్టోరీ టెల్లర్స్‌ వంటి వారు చెప్పేది సులభంగా వుంటుందని 27 శాతం భావిస్తున్నారు. అలా అని పూర్తిగా నమ్మేస్తున్నారా అంటే లేదు. కాకుంటే వీరు చెప్పే తీరు సులభంగా అర్థమైపోతుందని మాత్రం అనుకుంటున్నారు.


మీరు మాట తప్పారు, పిచాయ్ , నేను పోతున్నా...

మనందరం వాడే ఆండ్రాయిడ్‌ ఫోన్లకు సంబంధించిన ఆండ్రాయిడ్‌ ప్లాట్‌ఫాం డైరెక్టర్‌ రెనే మేయర్‌ హోఫర్‌ గూగుల్‌ నుంచి వైదొలగారు. సరే వ్యక్తిగతంగా ప్రవేశ నిష్క్రమణలు నిరంతరం జరిగిపోతూనే వుంటాయి కదా, అంత విశేషమేముంది అంటారా? కానీ వుంది. 2017లో ఆయన ఆ పదవిలో నియమితులవడం పెద్ద సంచలనమే అయ్యింది. అది కూడా భద్రతా విభాగం డైరెక్టర్‌ ఆయన. ఇప్పుడు ఎ.ఐ ప్రవేశం తర్వాత ప్రకంపనలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. సంస్థలే అనేక మందిని బయిటకు పంపిస్తున్నాయి. కనక ఇదేం పెద్ద విషయమయ్యేది కాదు. కాకుంటే హోఫర్‌ వెళ్లిపోయే ముందు రాసిన రాజీనామా లేఖనే ఈ దుమారానికి కారణమైంది. దాన్ని ఆయన బహిరంగంగానే పోస్టు చేశాడు గానీ మూడు నాలుగు రోజుల తర్వాతనే అసలు పాయింటు పైకొచ్చింది. ఏమంటే గూగుల్‌ సిఇవో సుందర్‌ పిచాయ్ తానిచ్చిన మాట తానే తప్పినందువల్ల తాను తప్పుకుంటున్నానని లేఖలో హోఫర్‌ రాశారు. ఏమా మాట? ఎ.ఐ ని ఎట్టి పరిస్థితుల్లో శాంతి కోసం తప్ప యుద్ధ ప్రయోజనాలకు వాడబోనని మొదట్లో చెప్పారట. కానీ ఈ మధ్య అమెరికా రక్షణ శాఖ (ప్రస్తుతం ట్రంప్‌ దానికి యుద్ధశాఖ అని పేరు మార్చారులెండి)తో ఒప్పందం చేసుకున్నారు. శాంతికే వినియోగిస్తామని చెప్పి ఇదెలా చేశారని హోఫర్‌ నిలదీశారు. వాస్తవానికి ఈ మధ్య మరో చోట కూడా పిచాయ్ ఇలాగే దెబ్బతిన్నారు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ విద్యార్థులు ఆయన ప్రసంగాన్నే బహిష్కరించారు. ఎందుకంటే పాలస్తీనా గాజాపై మారణహోమం సాగిస్తున్న ఇజ్రాయిల్‌తో గూగుల్‌ ఒప్పందం చేసుకున్నందుకు. అయినా ఈ కార్పొరేట్‌ బేహారులకు లాభాలు ముఖ్యంగానీ శాంతికి కట్టుబడే రకాలేనా? కానైతే విద్యార్థుల నుంచి సంస్థ సారథుల వరకూ నిరసించడం అభినందనీయం కదా.


మొహంజదారో..ఇదేం సెన్సారో..!

'నువ్వు ఎక్కవలసిన రైలు ఒక జీవిత కాలం లేటు' అన్నాడు కదా ఆరుద్ర మహాశయుడు. ఆయన 'త్వమేవాహం' కావ్యం అసలు కొరుకుడు పడదుగానీ ఈ వాక్యం మాత్రం కాస్త సాహిత్య పరిచయం వున్న వారందరికీ తెలుసు. కానైతే మనం చెప్పుకునే విషయంలో ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి ఆరుద్ర కవిత్వాన్ని వేల రెట్లు మించిపోయింది. ఇక్కడ వారు యుగాల ఆలస్యమైనా పర్వాలేదు మేమొప్పుకోమంటున్నారు. హరప్పా, మొహంజదారో నాగరికత కాలం నాటి నృత్యకారిణి శిల్పం సుప్రసిద్ధం. వందల సార్లు పాఠ్యపుస్తకాలపై ముఖచిత్రంగా వచ్చింది. వందల ఏళ్లుగా తరతరాల విద్యార్థులు, పరిశోధకులూ కళాభిమానులు దాన్ని చూస్తూనే వున్నారు. కానైతే ఈ మధ్య సనాతనం బాగా వంటపట్టిన మన కేంద్ర విద్యాధికారులకు ఈ బొమ్మ నచ్చలేదు. ఏమంటే ఆ బొమ్మ నగ్నంగా వుందట. పిల్లలు దీన్ని చూసి పాడైపోతారట. అందుకే ఆ చిత్రానికి ఏదో కప్పినట్టుగా తయారు చేశారు. వేల ఏళ్ల నాటి నాగరికత అవశేషమైన కళారూపాన్ని మార్చకూడదన్న కనీస చారిత్రిక స్పృహ కూడా లేకపోవడం నిజంగా విషాదమే కదా? ఇప్పటికి శతాబ్దాలుగా అలరిస్తున్న ఈ అతి ప్రాచీన కళాఖండంలో బూతు చూసిన వారినేమనాలి? ఇక్కడింకో మాట చెప్పాలి. కొన్ని ఇతర మతాలలో వలె ప్రాచీన వైదిక మతంలో శృంగారం పాపం కాదు. సనాతనంలో శృంగారానికి రతీమన్మథులనే దేవతలనే సృష్టించారు. ముక్కోపంలో ఈశ్వరుడు తనను భస్మం చేస్తే మళ్లీ ప్రాణం పోయించారు. నృత్య కళను చూడకుండా అలనాటి బొమ్మలో అసభ్యత చూశామంటే అది చూసిన వారి సభ్యతా లోపమే తప్ప మరేమిటి? యుగాల జాప్యం తర్వాత ఈ సెన్సారింగ్‌లో అర్థమేమైనా వుందా? ఖజురహోతో సహా ఆలయ శిల్పాలన్నిటికి గుడ్డలు కప్పే కార్యక్రమం చేపడతారా వీరు?


వికటించిన సేనాని పైత్యం

చేగువేరా బొమ్మతో విప్లవ భాషణం చేసిన పవన్‌ కల్యాణ్‌ ఒక్కసారిగా సనాతన వాదిగా, ఆరెస్సెస్‌ అనుయాయిగా మారారు ఓకే. అది ఆయన ఇచ్చ. వారిని మెప్పించడం కోసం లౌకిక వాదులు హిందువులనే విమర్శిస్తారని అవాకులు విసిరారు. అదీ ఓకే. ఇప్పుడు పైత్యం మరీ ముదిరిపోయినట్టుంది. స్కూలులో దేశభక్తి (పేట్రియాటిజం) పాఠాలు చెప్పి ఇంట్లోకి రాగానే పిల్లలకు కమ్యూనిజం గురించి మాట్లాడితే ఎలా అని సమాజంపై కోప్పడిపోయారు. నిజానికి తమ తండ్రి కూడా సిపిఎం అభిమాని అని ఒక దశలో ఆయన చెప్పడం అందరూ విన్నారు. మరైతే తన ఇష్టం కాని దేశభక్తికీ కమ్యూనిజానికి పోటీ పెట్టడమేమిటి? ఈ రోజే వార్త వచ్చినట్టుగా 10 సార్లు క్షమాపణలు రాసి బయిటపడ్డ వీర సావర్కర్‌ దేశభక్తుడు...లెనిన్‌ పుస్తకాలు, చదువులూ ఉరికంబమెక్కిన భగత్‌సింగ్‌ కాదా? కమ్యూనిస్టు పార్టీలో చేరిన శివవర్మ, అజయ్ కుమార్‌ ఘోష్‌ వంటి భగత్‌ సింగ్‌ సహచరులంతా, సుందరయ్య వంటి వారంతా ఏమిటి? దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించి పోరాడింది కమ్యూనిస్టులే కదా? సనాతనానికి తాజాగా సమైక్యతను జోడించి మోడీకే అంకితమైన జనసేనాని కమ్యూనిస్టులకు దేశభక్తి లేదన్నట్టు చిత్రించడం కన్నా విపరీతం ఏముంటుంది? అసలు గురజాడ 'దేశభక్తి' తదితర రచనలు వెలికి తీసి ప్రచురించిన వారే కమ్యూనిస్టులు, ప్రజాశక్తి సంస్థ అని తెలుసుకోండి డి.సి.ఎం సాబ్‌!

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్