mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పలు ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు కెవిపిఎస్ ఫిర్యాదు

1 గంట క్రితం

kvps
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 06:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - విజయవాడ : విజయవాడకు చెందిన మాదిగ యువకుడు పేరుపోగు క్రాంతికుమార్ మృతి, విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం పాందువ్వ గ్రామానికి చెందిన దళిత యువకుడు వీధి నవీన్ కుమార్ మరణ ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి న్యూఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీ లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు సమర్పించినట్లు ఆయన తెలిపారు. పేరుపోగు క్రాంతికుమార్ కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు, గాదె సాయికృష్ణ అదృశ్య ఘటన, వీధి నవీన్ కుమార్ మరణంపై వచ్చిన ఆరోపణలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన యువకులు పోలీసు వేధింపులు, అనుమానాస్పద మరణాలు, అదృశ్య ఘటనలకు గురవుతున్న నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ తక్షణమే జోక్యం చేసుకొని స్వతంత్ర విచారణ జరిపించాలని కోరారు. అదేవిధంగా ఈ అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ శ్రీ కె. సామ్యేల్ జవహర్ గారికి కూడా ఈ-మెయిల్ ద్వారా అర్జీ పంపినట్లు తెలిపారు. ఈ మూడు ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరిపి, తప్పు చేసిన వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) దళిత, ప్రజా సంఘాలను కలుపుకొని పోరాటం కొనసాగుతుందని అండ్ర మాల్యాద్రి స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్