ప్రజాశక్తి - ఎంవిపి కాలనీ : ‘మండాడి’ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు అందించిన అపూర్వ ఆదరణతో చిత్ర బృందం సోమవారం విశాఖపట్నంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించింది. చిత్రం విడుదలైన తొలిరోజు నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందని, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకుపోతోందని కథానాయకులు సూరి, సుహాస్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం విశాఖపట్నం లోని కిన్నెర సినిమా హాల్లో ‘యునానిమస్ బ్లాక్‌బస్టర్ సెలెబ్రేషన్స్’ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో కథానాయకుడు సూరి మాట్లాడుతూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, ‘మండాడి’ని ఇంత పెద్ద విజయంగా నిలిపినందుకు వారికి శతకోటి వందనాలు తెలిపారు. సినిమా విడుదలకు రెండు రోజుల ముందే డిస్ట్రిబ్యూటర్లు నవీన్, రవి సినిమా చూసి తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందని చెప్పారని, వారి నమ్మకం ఇప్పుడు నిజమైందన్నారు. తనతో కలిసి ప్రయాణించిన సహనటుడు సుహాస్‌కు, సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నం అందమైన సముద్రతీర నగరమని, ఇక్కడ పెద్ద సంఖ్యలో మత్స్యకారులు జీవిస్తున్నారని సూరి పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన విధానానికి దగ్గరగా ఉండే అంశాలు సినిమాలో ఉన్నందున విశాఖలోని మత్స్యకారులు, సముద్రతీర ప్రాంత ప్రజలు ఈ చిత్రాన్ని తప్పక చూడాలని కోరారు. ఇప్పటికే పలువురు సినిమా చూసి సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారని తెలిపారు. కథానాయకుడు సుహాస్ మాట్లాడుతూ సూరి తో కలిసి నటించడం గొప్ప అనుభవమని, షూటింగ్ సమయంలో పడిన కష్టానికి ప్రేక్షకుల ఆదరణ రూపంలో తగిన ప్రతిఫలం లభించిందని అన్నారు. దర్శకుడు మదిమారన్, నిర్మాత ఎల్రెడ్ కుమార్ తనకు ఈ చిత్రంలో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాత ఎల్రెడ్ కుమార్ మాట్లాడుతూ మంచి సినిమాకు భాషా, ప్రాంతీయ సరిహద్దులు ఉండవని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారని అన్నారు. చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని, రానున్న రోజుల్లో ‘మండాడి’ మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్‌ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ పతాకంపై దర్శకుడు మదిమారన్ పుగళేంది తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పీ ద్వారా ఈ నెల 10న విడుదల చేశారు.
విశాఖలో ‘మండాడి’ చిత్ర బృందం విజయోత్సవ సంబరాలు
21 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 15, 2026, 10:58 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)