న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ పూర్తి చేయకుండానే ముగ్గురు ఇటలీ ప్రయాణికులు విదేశీ విమానం ఎక్కి వెళ్లిపోయిన ఘటనపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ భద్రతా లోపానికి (ప్రొసీజరల్ లోపాలు) సంబంధించి ఎయిర్ ఇండియా సిఈఓ క్యాంప్‌బెల్ విల్సన్‌కు మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసింది.
కాగా, సెప్టెంబర్ 4న ముగ్గురు ఇటలీ ప్రయాణికులు అమృత్‌సర్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ చేరుకున్నారు. ఆ తర్వాత వారు ఢిల్లీ నుంచి మ్యూనిచ్ వెళ్లే లుఫ్తాన్సా (Lufthansa) విమానాన్ని ఎక్కాల్సి ఉంది. నిబంధనల ప్రకారం.. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత వారు అరైవల్ ఏరియా ద్వారా బయటకు వచ్చి, ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద తనిఖీలు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే, ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వారిని పొరపాటున 'ఇంటర్నేషనల్ ట్రాన్స్‌ఫర్ ఏరియా'కి తీసుకువెళ్లడంతో, వారు ఎలాంటి ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయకుండానే నేరుగా మ్యూనిచ్ విమానం ఎక్కి వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు.
'హబ్ అండ్ స్పోక్' మోడల్ మినహాయింపు లేదు:
ఎయిర్ ఇండియా అమృత్‌సర్ వంటి కొన్ని ఎంపిక చేసిన విమానాశ్రయాల్లో 'హబ్ అండ్ స్పోక్' (Hub-and-Spoke) విధానాన్ని అమలు చేస్తోంది. ఈ విధానంలో ప్రయాణికులు బయలుదేరే విమానాశ్రయం (అమృత్‌సర్)లోనే ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసుకుని, ఢిల్లీలో కేవలం సెక్యూరిటీ చెకింగ్ మాత్రమే పూర్తి చేసుకుని అంతర్జాతీయ విమానం ఎక్కవచ్చు. అయితే, ఈ ఇటలీ ప్రయాణికుల ప్రయాణానికి ఈ 'హబ్ అండ్ స్పోక్' నిబంధన వర్తించదని, అందువల్ల వారు ఢిల్లీలోనే తప్పనిసరిగా ఇమ్మిగ్రేషన్ పూర్తి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు.
కేంద్ర హోంశాఖ అత్యవసర సమావేశం:
ఈ తీవ్ర భద్రతా లోపంపై కేంద్ర హోంశాఖ కూడా దృష్టి సారించింది. హోం కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన మంగళవారం అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) డైరెక్టర్, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కమిషనర్, ఎయిర్ ఇండియా సీఈఓ తదితర కీలక అధికారులు పాల్గొననున్నారు.
ఈ ఘటనపై ఎయిర్ ఇండియా యాజమాన్యం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.







కామెంట్‌లు (0)