163 గ్రూప్-1 పోస్టులు
అక్టోబరు 6 నుంచి దరఖాస్తులు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిపిఎస్సి) 892 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందుకు సంబంధించి 20 నోటిఫికేషన్లను, సిలబస్ వివరాలను కమిషన్ కార్యదర్శి పి రవిసుభాష్ మంగళవారం విడుదల చేశారు. ఈ 892 ఖాళీల్లో 163 గ్రూప్-1 పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు కాలుష్య నియంత్రణ బోర్డులో 40 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, ఉద్యాన సర్వీస్‌లో 37 ఉద్యాన అధికారి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ సర్వీస్‌లో 8 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు అక్టోబరు 6 నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఎస్సి, ఎస్టి, బిసి సంక్షేమశాఖల్లో 73 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులతో పాటు ఎస్సి, ఎస్టి సంక్షేమశాఖలో 17 అసిస్టెంట్ సంక్షేమ అధికారి పోస్టులకు అక్టోబరు 9 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తులను కమిషన్ స్వీకరించనుంది. ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబార్డినరీ సర్వీసెస్‌లో 196 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, 17 అసిస్టెంట్ డైరెక్టర్, గిరిజన సంక్షేమశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్, ఎపి ఫ్యాక్టరీస్ సర్వీస్‌లో 12 ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్, కాలుష్య నియంత్రణ బోర్డులో 18 అనలిస్ట్ గ్రేడ్-2, ఎపి లెజిస్లెటీవ్ సర్వీసెస్‌లో 10 ఇంగ్లీష్ రిపోర్టర్, తెలుగు రిపోర్టర్ పోస్టుకు అక్టోబరు 13 నుంచి నవంబరు 2వ తేదీ వరకు కమిషన్ దరఖాస్తులు స్వీకరించనుంది. దేవాదాయశాఖలో 104 గ్రేడ్-3, జువైనల్ వెల్ఫేర్ కరెక్షనల్ సర్వీసెస్‌లో గ్రేడ్-2 జిల్లా ప్రొబేషన్ అధికారి, ఇండస్ర్టీస్ సబార్డినేట్ సర్వీసెస్‌లో 78 ఇండస్ర్టీయల్ ప్రమోషన్ ఆఫీసర్, స్త్రీ, శిశు సంక్షేమశాఖలో 29 గ్రేడ్-1 సూపర్వైజర్, అటవీ శాఖలో 26 ఫారెస్ట్, 26 సెక్షన్ ఆఫీసర్, 20 గ్రేడ్-2 డ్రాఫ్స్ట్మెన్, 23 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 4 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టులకు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని నోటిఫికేషన్లో వెల్లడించారు.
ఖాళీల వివరాలు వెల్లడించని కమిషన్
నోటిఫికేషన్లలో ఖాళీల వివరాలను, రోస్టర్ వివరాలను నోటిఫికేషన్లో కమిషన్ వెల్లడించలేదు. నోటిఫికేషన్ విడుదల సమయంలోనే మొత్తం ఖాళీలతో పాటు ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో కమిషన్ వెల్లడిస్తుంది. అయితే ఈసారి దరఖాస్తులు ప్రారంభమయ్యే రోజు ఖాళీల వివరాలు పొందుపరుస్తామని నోటిఫికేషన్ కమిషన్ కార్యదర్శి వెల్లడించడం గమనార్హం.










కామెంట్లు (0)