నౌకా రవాణాపై ప్రభావం
సింగపూర్ : హార్మూజ్ జలసంధిలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులు, అమెరికా-ఇరాన్ శాంతి చర్చలపై నెలకొన్న సందిగ్ధత ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. జలసంధి గుండా నౌకా రవాణా మందగించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సోమవారం పెరిగాయి. ట్రేడింగ్ ప్రారంభంలో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 82.30 డాలర్ల గరిష్ట స్థాయిని తాకిన అనంతరం 54 సెంట్లు పెరిగి 81.11 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మరోవైపు, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ 2.02 డాలర్లు పెరిగి బ్యారెల్‌కు 78.62 డాలర్లకు చేరుకున్నాయి.
తాత్కాలిక శాంతి ఒప్పంద నిబంధనలను అమెరికా, ఇజ్రాయిల్ ఉల్లంఘించాయని ఆరోపిస్తూ ఇరాన్ హార్మూజ్ జలసంధిలో ఆంక్షలు విధించిన నేపథ్యంలో నౌకా రవాణా గణనీయంగా తగ్గినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ జలసంధిలో అంతరాయాలు కొనసాగితే సరఫరా వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, మధ్యప్రాచ్య ప్రాంతంలోని భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు ఇంకా పూర్తిగా తగ్గలేదు. ముఖ్యంగా లెబనాన్ పరిస్థితులు శాంతి ప్రయత్నాలపై ప్రభావం చూపే అవకాశముందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాగా, గత వారం అంతర్జాతీయ చమురు ధరలు 8 శాతానికి పైగా క్షీణించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్ దేశాలు చమురు సరఫరా పెంచుతామని ప్రకటించడం ధరల తగ్గుదలకు దోహదపడింది. అయినప్పటికీ, హార్మూజ్ జలసంధికి సంబంధించిన పరిణామాలతో మార్కెట్ అప్రమత్తంగా ఉంది.









కామెంట్‌లు (0)