న్యూఢిల్లీ : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుక్రవారం పార్లమెంట్ స్ట్రీట్‌లోని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. పెల్లెట్ గన్ బాధితుడు సాహిల్ లోచబ్(19)తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆయనతో పాటు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు నినాదాలు చేస్తూ లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో, ఢిల్లీ పోలీసులు ఆ ప్రాంతంలో బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్ గేట్లను మూసివేశారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ కమ్యూనికేషన్ ప్రతినిధి జైరామ్ రమేష్‌లు కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. శాంతియుత నిరసనపై క్రూరత్వం ప్రదర్శించడం తీవ్రమైన నేరమని అన్నారు. పెల్లెట్ గన్ వినియోగంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన ప్రదర్శనలో పెల్లెట్ గన్‌ల వాడకంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గాని, ప్రధాని మోడీ గాని ఎటువంటి వివరణ ఇవ్వలేదని మండిపడ్డారు. సాహిల్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నా, పోలీసులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) చేపట్టిన శాంతియుత నిరసనపై ఢిల్లీ పోలీసులు పెల్లెట్ గన్‌లను వినియోగించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో గాయపడిన సాహిల్ లోచబ్(19)తో కలిసి మొదట మందిర్ మార్గ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరారు. వారు తిరస్కరించడంతో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్ ) సచిన్ శర్మను కలిశారు. శర్మతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో, లోచబ్‌తో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే డిసిపి కార్యాలయం కూడా ఉంది.







కామెంట్‌లు (0)