న్యూఢిల్లీ : ఢిల్లీలో జులై 20న జరిగిన విద్యార్థుల ఆందోళనలను నియంత్రించే సమయంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఎఎఫ్) సిబ్బందికి జారీ చేసిన పెల్లెట్ గన్స్ వినియోగంపై వివాదం నెలకొంది. ఈ ఘటనపై ఆర్‌ఎఎఫ్ నిర్వహిస్తున్న అంతర్గత విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. విచారణలో భాగంగా, జులై 20 ఉదయం కనీసం 12 మంది ఆర్ఎఎఫ్ సిబ్బందికి పెల్లెట్ గన్స్ జారీ చేసినట్లు గుర్తించారు. అయితే ఆ ఆయుధాలను జులై 23 నుంచి దశలవారీగా వెనక్కి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించారనే ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనలో షేక్ ఇర్షాద్ మన్‌సూరీ (25), నూతన్ టొప్పో (32), జర్నలిస్టు ప్రశాంత్ సింగ్ (28), బీహార్‌కు చెందిన వ్యక్తి (25), పోలీస్ శాఖలో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థి సహిల్ లోచాబ్ (19) పెల్లెట్లు తగిలాయని ఆరోపించారు. సహిల్ విషయంలో ఈ ఆరోపణలను అతని కుటుంబ సభ్యులు చేశారు.
ఆర్‌ఎఎఫ్ అనేది కేంద్ర రిజర్వు పోలీసు దళం (సిఆర్‌పిఎఫ్) కు చెందిన ప్రత్యేక విభాగం. దేశవ్యాప్తంగా అల్లర్లు, సామూహిక ఆందోళనలు వంటి పరిస్థితులను నియంత్రించేందుకు దీనిని వినియోగిస్తారు.
జులై 20న కనాట్ ప్లేస్‌లోని పాలికా బజార్ సమీపంలో విధుల్లో ఉన్న ఆర్‌ఎఎఫ్ బృందానికి నాయకత్వం వహించిన సిఆర్‌పిఎఫ్ ఇన్‌స్పెక్టర్ తన బృందానికి పెల్లెట్ గన్స్‌తో కాల్పులు జరపాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని విచారణలో తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఒకటి కంటే ఎక్కువ మంది అధికారులు పెల్లెట్ గన్స్‌ను ఉపయోగించి ఉండే అవకాశం ఉందని, ఆయుధాలు ఎవరికెవరికీ జారీ చేశారో, ఎన్ని పెల్లెట్ కార్ట్రిడ్జ్‌లు ఇచ్చారో తుది నివేదికలో స్పష్టంగా పేర్కొంటారని ఒక అధికారి తెలిపారు. నిబంధనల ప్రకారం నడుము కింది భాగాన మాత్రమే కాల్పులు జరపాల్సి ఉండగా, ఆ విధానం పాటించని ఘటనలు కూడా గుర్తించినట్లు చెప్పారు.
జులై 20న ఏం జరిగింది?
జులై 20 మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు కనాట్ ప్లేస్‌లోని గ్రాండ్ చర్కా విగ్రహం సమీపంలో ఆర్‌ఎఎఫ్ బృందం మోహరించింది. ఆ సమయంలో కొందరు నిరసనకారులు ఢిల్లీ పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు ఆర్ఎఎఫ్ సిబ్బందిపైనా దాడి చేశారని, పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో నిరసనకారులు పార్లమెంట్ వైపు కదిలే అవకాశం ఉండటంతో పరిస్థితిని అదుపులోకి తేవడానికి స్పందనను తీవ్రతరం చేయాల్సి వచ్చిందని ఆర్ఎఎఫ్ సిబ్బంది తమ పై అధికారులకు వివరించినట్లు సమాచారం.
ఎస్‌ఒపి ఉల్లంఘనలు గుర్తింపు
ఆర్ఎఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సీమా ధుండియా నేతృత్వంలో జరిగిన సమీక్షలో పలువురు సిబ్బంది ప్రామాణిక విధానాలను (ఎస్‌ఒపి) ఉల్లంఘించినట్లు గుర్తించారు. దీంతో శుక్రవారం నుంచి అన్ని సిఆర్‌పిఎఫ్, ఆర్ఎఎఫ్ సిబ్బంది యూనిఫారంపై తప్పనిసరిగా పేరు పలకలు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే విధుల్లో ఉండగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయడం కూడా సేవా నియమాలకు విరుద్ధమని సమీక్షలో స్పష్టం చేశారు.
పెల్లెట్ గన్స్ వినియోగంపై తీవ్ర విమర్శలు
పెల్లెట్ గన్స్‌ను ఆర్ఎఎఫ్ మాన్యువల్‌లో టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లు, స్మోక్ గ్రెనేడ్లతో పాటు ప్రాణాంతకం కాని గుంపు నియంత్రణ సాధనంగా పేర్కొన్నప్పటికీ, విద్యార్థులపై వాటి వినియోగం తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు, పోలీసు నిపుణులు ఈ చర్యను అనుచితమని విమర్శించారు. ఢిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా పెల్లెట్ గన్స్‌ను ఉపయోగించడం ఇదే తొలిసారి. గతంలో జమ్మూ కాశ్మీర్‌లో రాళ్ల దాడులను ఎదుర్కొనే సందర్భాల్లో వీటిని ఉపయోగించగా, 2021 రైతు ఉద్యమంలో ప్లాస్టిక్ బుల్లెట్లను వినియోగించారు.
సమగ్ర సమీక్ష అనంతరం నివేదిక
విద్యార్థుల ఆందోళనలు శనివారం ముగిసిన తర్వాత ప్రతి ప్రధాన ఆపరేషన్ అనంతరం నిర్వహించే విధంగానే ఈ ఘటనపైనా వృత్తిపరమైన సమీక్ష చేపడుతున్నామని సిఆర్‌పిఎఫ్ డైరెక్టర్ జనరల్ జీపీ సింగ్ తెలిపారు. తుది నివేదిక అందిన తర్వాత కేంద్ర కార్యాలయం తన అధికారిక అభిప్రాయాన్ని వెల్లడిస్తుందని చెప్పారు.






కామెంట్‌లు (0)