శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అమలు చేసిన పార్టిషన్‌ డీడ్‌ రద్దుకు వీల్లేదు

1 గంట క్రితం

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 11:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మెయింటెనెన్స్‌ ట్రిబ్యునల్‌ తీర్పును రద్దు చేసిన హైకోర్టు

ప్రజాశక్తి-అమరావతి : ఉమ్మడి కుటుంబ ఆస్తులకు సంబంధించి రిజిస్టర్డ్‌ పార్టిషన్‌ డీడ్‌ను తల్లిదండ్రులు, సీనియర్‌ సిటిజన్ల పోషణ సంక్షేమ చట్టం కింద రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలోని మెయింటెనెన్స్‌ ట్రిబ్యునల్‌కు లేదని హైకోర్టు తీర్పు చెప్పింది. పార్టిషన్‌ డీడ్‌ ద్వారా ఆస్తిపై కుటుంబ సభ్యులకు దఖలు పడిన హక్కులను పునఃపంపిణీ చేసే విధంగా ట్రిబ్యునల్‌ నిర్ణయం ఉండకూడదని చెప్పింది. సీనియర్‌ సిటిజన్‌ చట్టంలోని సెక్షన్‌ 23(1) ప్రకారం ఆస్తి లావాదేవీలను రద్దు చేయాలంటే సీనియర్‌ సిటిజన్‌ తన ఆస్తిని మరొకరికి గిఫ్ట్‌ డీడ్‌ చేసుండాలంది. సీనియర్‌ సిటిజన్ల బాగోగులు, అవసరాలను తీర్చాలనే నిబంధన సంబంధిత గిఫ్ట్‌ డీడ్‌లో ఉండాలంది. ఆ నిబంధన అమలు జరగనప్పుడు మాత్రమే సీనియర్‌ సిటిజన్‌ యాక్ట్‌ కింద ఆస్తి బదలాయింపును రద్దుకు వీలుంటుందని పేర్కొంది. తన ముందున్న కేసులో తల్లి రామలక్ష్మి ఆస్తిని కుమారుడికి బదిలీ చేసినట్లు ఎక్కడా లేదని తేల్చింది. వాళ్ల మధ్య ఉమ్మడి ఆస్తుల విభజన మాత్రమే జరిగిందని గుర్తు చేసింది. పార్టిషన్‌ డీడ్‌‌ను రద్దు చేస్తూ 2023 ఆగస్టు 19న జిల్లా కలెక్టరు నేతృత్వంలోని అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేస్తూ జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తీర్పు వెలువరించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన ఉదయగిరి శ్రీరామ్మూర్తి, ఆయన తల్లి రామలక్ష్మి ఉమ్మడి కుటుంబ ఆస్తుల హక్కులపై 2018లో నరసాపురం సబ్‌ రిజిస్ట్రార్‌ వద్ద పార్టిషన్‌ డీడ్‌ చేసుకున్నారు. అప్పటికే శ్రీరామ్మూర్తి సోదరులు ఈ ఆస్తులపై హక్కులు వదులుకుంటూ డీడ్‌ రాసి ఇచ్చారు. తల్లిదండ్రులు సీనియర్‌ సిటిజన్ల పోషణ చట్టాన్ని అనుసరించి పార్టిషన్‌ డీడ్‌ను రద్దు చేయాలని ట్రిబ్యునల్‌‌లో రామలక్ష్మి కేసు వేశారు. దీనిపై ఆమె కొడుకు, కోడలు శ్రీరామ్మూర్తి, సాయి తులసి సవాల్‌ చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పు చెప్పింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్