- గేటు వద్దే బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అడ్డగింత...తోపులాట
- కన్నీళ్లు పెట్టుకున్న మహిళా సభ్యులు
- స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల తొలిరోజు సోమవారం శాసనసభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ముద్రించిన నల్ల రంగు టీషర్టులతో రెండో నెంబర్ గేటు నుంచి అసెంబ్లీలోకి వస్తున్న బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో టీషర్టులు విప్పి హరీశ్‌రావు, పలువురు ఎమ్మెల్యేలు బనియన్లతో అక్కడే నిరసన తెలిపారు. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తదితరులు కన్నీళ్లు పెట్టుకున్నారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పృహతప్పి పడిపోయారు. పోలీసులు అడ్డుకోవడంతో సహనం కోల్పోయిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సభ వెలుపల జరిగిన పరిణామాలపై అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. స్పీకర్ తల్లిని అవమానించేలా తాతామధు మాట్లాడటాన్ని ముక్తకంఠంతో ఖండించాలని అన్నారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాతా మధుతో రాజీనామా చేయించాలని కోరారు. బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రి సీతక్క మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్ కంటతడి పెట్టారు. తాతామధు వ్యాఖ్యలను మంత్రులు, బిజెపి, ఎంఐఎం,సిపిఐ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ‘‘స్పీకర్‌ను నేనేమీ అనలేదు. ఆయన్ను అన్నట్లు భావిస్తే నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నా. నా మాటలపై విచారం వ్యక్తం చేస్తున్నా. నాపై దాడి చేసిన వారిని మాత్రమే ఆవేశంతో అన్నాను’’ అని తాతా మధు వివరణ ఇచ్చారు.కాగా, అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలపై బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం హైకోర్టులో లంచ్‌మోషన్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకోవద్దని పోలీసులను ఆదేశించింది.








కామెంట్‌లు (0)