యర్రగొండపాలెం (ప్రకాశం) : రూ.300 కోట్ల ఆర్ అండ్ ఆర్ నిధుల చెక్కును వెలిగొండ ప్రాంత రైతులు, నిర్వాసితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు. శనివారం వెలిగొండ ప్రాంత రైతులు, నిర్వాసితులతో సిఎం చంద్రబాబు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం వచ్చాక.. పెద్ద ఎత్తున పనులు చేపట్టామన్నారు. గడచిన ప్రభుత్వాలు ఇలాగే పనులు చేపట్టి ఉంటే నీళ్లు ఎప్పుడో వచ్చేవి అని అన్నారు. గత పాలకులు వెలిగొండ ప్రాజెక్టు విషయంలో డ్రామాలాడారు.. మోసం చేశారు అని విమర్శించారు. మోసం చేయడంలో గొడ్డలి పార్టీ దిట్ట.. కళ్లార్పకుండా అబద్దాలు చెబుతారు... తేరుకునేలోపే మోసం చేసేస్తారు అని ధ్వజమెత్తారు. మోసాలు ఎలా చేస్తారో.. ప్రజలను ఏ విధంగా ఏమారుస్తారోననే విషయంపై అవగాహన కల్పించేందుకు గొడ్డలి పార్టీ చర్యలను వివరిస్తూ మ్యూజియం పెట్టాలి అని ఎద్దేవా చేశారు. గొడ్డలి పార్టీకి బుద్ది చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు గత ప్రభుత్వం కేవలం రూ.980 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని అన్నారు. కూటమి ప్రభుత్వం నిర్వాసితులకే రూ. 900 కోట్లు ఖర్చు పెడుతోందని, నిర్మాణానికి రూ. 3 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందని తెలిపారు. నిర్వాసితులకు గత ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు.. సొరంగాల్లో తవ్విన మట్టిని కూడా తీయలేదు.. ఫీడర్ కెనాల్ పనులను చేయలేదు అని చెప్పారు. ఇరుక్కుపోయిన టన్నెల్ బోరింగ్ యంత్రాన్ని తీయకుండానే జాతికి అంకితం అని మోసం చేశారు అని ఆరోపించారు. 2014-19 మధ్య కాలంలోనే సొరంగాల పనులు చాలా వరకు పూర్తి చేశామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో 7,225 మంది నిర్వాసితులు ఉన్నారు... ప్రతి ఒక్కరి వెనుకా ఓ విషాద గాధ ఉంటుంది అని అన్నారు. పుట్టిన ఊరు నుంచి వెళ్లిపోవాలంటే చాలా బాధేస్తుందని చెప్పారు. ఇంత మంది నిర్వాసితులుంటే... గత ప్రభుత్వం కేవలం 96 మందికి మాత్రమే పునరావాసం ఇచ్చిందని ఆరోపించారు. నిర్వాసితుల గోడు వెళ్లబోసుకోవాలని వస్తే కేసులు పెట్టించారు అని మండిపడ్డారు. కానీ తమది ప్రజా ప్రభుత్వం.. ఏ ఒక్కరూ నష్టపోకుండా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం.. ఇది నా గ్యారెంటీ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు లబ్దిదారులతోపాటు.. నిర్వాసితులు కూడా ఆనందంగా ఉండేలా చూడడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని అన్నారు. హైదరాబాద్ నగరంలో తెచ్చిన ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులు కోట్లాది రూపాయలు గడించారు అని చెప్పారు. అభివృద్ధి చేస్తేనే ఆదాయం వస్తుంది.. వెలిగొండ ప్రాజెక్టు వల్ల నాలుగు జిల్లాల పరిధిలో భూముల ధరలు పెరుగుతాయి అని చెప్పారు. గత ప్రభుత్వం పెట్టిన రూ.140 కోట్ల పెండింగ్ బిల్లులను కూడా చెల్లించామన్నారు. కరవు జిల్లా పరిస్థితులను అర్థం చేసుకునే కలెక్టరును మార్కాపురానికి నియమించామని తెలిపారు. మార్కాపురం జిల్లాలో హార్టీకల్చర్ పంటలు వేయాలన్నారు.
పూర్వోదయ ప్రాజెక్టులో మార్కాపురం జిల్లాను కూడా చేర్చామన్నారు. అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా రైతులకు ఆదాయం పెరుగుతుందన్నారు. యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. రామాయపట్నం పోర్టు మార్కాపురానికి సమీపంలో ఉందని, ఎగుమతులకు అనుకూలంగా ఉంటుందని, మార్కాపురానికి మంచి కనెక్టివిటీ పెంచేలా చూస్తున్నామని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా నిధులు జమ చేశామన్నారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా 90 శాతం సబ్సిడీపై పరికరాలు ఇస్తున్నామన్నారు. హంద్రీ-నీవా ద్వారా కుప్పం చివరి భూముల వరకు నీళ్లిచ్చామన్నారు. పోలవరం ప్రాజెక్టులో డయా ఫ్రం వాల్ పడగొట్టేలా చేసింది గత ప్రభుత్వమేనన్నారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే మాకేం అవుతుందనే భావనతో ఉండొద్దు.. ప్రజల జీవితాలను విధ్వంసం చేయవచ్చని గత పాలకులు నిరూపించారు అని విమర్శించారు. ప్రభుత్వాన్ని నమ్మి అమరావతికి రైతులు భూములిస్తే.. దాన్ని నిర్వీర్యం చేశారు... రాజధాని లేకుండా చేశారు... మూడు ముక్కలాట ఆడారు అని నిప్పులుచెరిగారు. అమరావతిని రాజధానిగా కేంద్రం చట్టం చేస్తే... మావిగన్ అంటున్నారు అని అన్నారు. రాజధానితో మాకేం పని ఇతర ప్రాంతాల వాళ్లు అనుకోవద్దు... రాజధాని లేని రాష్ట్రంగా ఉండడం మంచిదా అని ప్రజలు ఆలోచించాలని కోరారు. కులం, మతం, ప్రాంతం వంటి వాటి ప్రలోభాలకు గురి కావద్దు... మంచి, చెడు ఆలోచించి విశ్లేషించుకుని ఓట్లేయాలన్నారు. మార్కాపురం ప్రాంతానికి అన్నీ చేస్తున్నాం... పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పారు. తుంగభద్ర డ్యాంకు గేట్లు పెట్టేందుకు సహకరించాం... సీజన్ కాపాడాం అని అన్నారు. ముగ్గురు సీఎంలు, కేంద్ర మంత్రి కొత్త గేట్లను ప్రారంభించామన్నారు. జల వివాదాలకు స్వస్తి పలకాలని నిర్ణయించాం... గంగా-కావేరి నదుల అనుసంధానం జరగాలని కోరారు. పోలవరం ప్రాజెక్టులు పూర్తి అయితే.. గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార, పెన్నా, కావేరి నదులు అనుసంధానం అయ్యేందుకు అవకాశం ఉందన్నారు. నదుల అనుసంధానంతో పాటు భూగర్భ జలాలు పెంచాలి.. అందుకే జలధార కార్యక్రమం చేపట్టామన్నారు. భూగర్భ జలాలు పెరిగితే.. విద్యుత్ భారం తగ్గుతుందన్నారు. మార్కాపురాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది... సహకరించే బాధ్యత ప్రజలది అని చంద్రబాబు అన్నారు. నన్ను చూడండి.. పార్టీని చూడండి.. ఎన్డీఏను చూసి సహకరించండి అని కోరారు. ప్రజలు ఆమోదించే వ్యక్తులనే నేను ఆమోదిస్తాను. ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పని చేస్తాం.. మీ నుంచి సహకారాన్ని కోరుతున్నాం అని చంద్రబాబు ప్రసంగించారు.








కామెంట్‌లు (0)