ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో సిపిఎం అభ్యర్థులు ముమ్మరంగా పాల్గొంటున్నారు. జివిఎంసి సహా పలు కార్పొరేషన్లు, పట్టణాల్లో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. సిపిఎం అభ్యర్థులను గెలిపిస్తే తాగునీరు, పారిశుధ్యం వంటి స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, ప్రజా సమస్యలపై మరింత గళమెత్తుతామని ఓటర్లను పార్టీ నాయకులు, అభ్యర్థులు కోరారు.
కర్నూలు జిల్లా సిపిఎం మేయర్ అభ్యర్థి బి శ్యామల.. 28వ వార్డు శ్రీరామ్‌నగర్‌లో కార్పొరేటర్ అభ్యర్థి ఆర్ నళినితో కలిసి ప్రచారం నిర్వహించారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం మరో సమ్మర్ స్టోరీ ట్యాంక్ నిర్మాణం కోసం కృషి చేస్తామని శ్యామల పేర్కొన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో 3, 35 వార్డుల్లో అభ్యర్థులు పట్నాల సుశీల, గుణుపూరు కృష్ణను గెలిపించాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె సుబ్బరావమ్మ ప్రచారం చేశారు. సాలూరులో 8వ వార్డు అభ్యర్థి జె రాణి ప్రచారం చేశారు. విజయనగరం కామాక్షి నగర్‌లో 56వ డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాలూరి రమణమ్మను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యాన్నారాయణ, సిపిఎం సీనియర్ నాయకులు ఎం కృష్ణమూర్తి ఓటర్లను కోరారు.
గ్రేటర్ విశాఖ 66వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్న బొట్టా ఈశ్వరమ్మను గెలిపించాలంటూ రామ్మూర్తి పంతులుపేట, పైడిమాంబ కాలనీ_ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ ఈశ్వరమ్మను గెలిపిస్తే కార్పొరేషన్‌లో ఆమె ప్రజా గొంతుక వినిపించనుందని అన్నారు. 98వ వార్డు అభ్యర్థి ఎం.రాంబాబును గెలిపించాలంటూ పలుచోట్ల ప్రచారం చేపట్టారు. సుందరయ్య కాలనీలోనూ ప్రచారం సాగింది. జివిఎంసి 13, 16 వార్డుల సిపిఎం కార్పొరేటర్ అభ్యర్థులు సంగిరెడ్డి గౌరి, ఎస్ రంగమ్మ వారి ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు.
జివిఎంసి రెండోవ వార్డు అభ్యర్థి ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి... సంగివలస, అల్లూరి సీతారామరాజు కాలనీల్లోనూ, 105వ వార్డు అభ్యర్థి కృష్ణయ్య స్టీల్‌ప్లాంట్ సెక్టార్ 6లోనూ ప్రచారం చేపట్టారు.
అనంతపురం కార్పొరేషన్‌తో పాటు గుత్తి, గుంతకల్లులో ప్రచారం నిర్వహించారు. సత్యసాయి జిల్లాలో కదిరి పట్టణంలోనూ ప్రచారాలు కొనసాగాయి. కదిరి పట్టణం 39వ వార్డు సిపిఎం అభ్యర్థి ముస్తాక్‌ను గెలిపించాలని కోరుతూ సిపిఎం రాష్ర్ట నాయకులు జి ఓబులు కోరారు. అనంతపురం కార్పొరేషన్ పరిధిలో 60, 62, 25వ డివిజన్లలో ఆయా వార్డుల సిపిఎం అభ్యర్థులు, నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నెల్లూరు జిల్లా 18వ డివిజన్ సిపిఎం అభ్యర్థి పిట్ల దివ్య ఎన్‌టిఆర్ నగర్ నాలాగో బిట్, సరస్వతి నగర్ ప్రాంతాల్లో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.







కామెంట్‌లు (0)