రూ.1.29 లక్షల కోట్లకు చేరిన వ్యయం
దిగుమతుల్లో మాత్రం 7 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు భగ్గుమంటుండటంతో భారత దిగుమతుల భారం భారీగా పెరుగుతోంది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, చమురు సరఫరాలో అంతరాయాల కారణంగా సెప్టెంబర్‌లో దేశ ముడిచమురు దిగుమతుల బిల్లు 47 శాతం పెరిగి 1,540 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1.29 లక్షల కోట్లు) చేరింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పిపిఎసి) గణాంకాల ప్రకారం.. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే దిగుమతుల పరిమాణం కేవలం 7 శాతం పెరిగినప్పటికీ.. వ్యయం మాత్రం భారీగా ఎగబాకింది. గతేడాది 2.03 కోట్ల టన్నులుగా ఉన్న దిగుమతులు ఈ ఏడాది సెప్టెంబర్‌లో 2.17 కోట్ల టన్నులకు చేరాయి. ఇదే సమయంలో భారత ముడిచమురు సగటు ధర బ్యారెల్‌కు 69.61 డాలర్ల నుంచి 116.09 డాలర్లకు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనూ చమురు దిగుమతుల భారం భారీగా పెరిగింది. ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య ముడిచమురు దిగుమతుల బిల్లు 46.4 శాతం పెరిగి 9,060 కోట్ల డాలర్లకు (సుమారు రూ.7.61 లక్షల కోట్లు) చేరింది. ఇదే కాలంలో నికర చమురు, గ్యాస్ దిగుమతుల వ్యయం 35 శాతం ఎగిసి 8,110 కోట్ల డాలర్లు (సుమారు రూ.6.81 లక్షల కోట్లు)గా చోటు చేసుకుంది. అంతర్జాతీయంగా చమురు ధరలు అధిక స్థాయిలో కొనసాగడం దేశ వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణంపై మరింత ఒత్తిడి పెంచనుంది.







కామెంట్‌లు (0)