సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి
సిపిఎం, సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు
ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు నగరంలో అవినీతి, అక్రమాలకు చరమగీతం పాడాలని, కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి కూటమి, వైసిపి పాలనకు ప్రత్యామ్నాయంగా వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె. ప్రభాకర్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. కర్నూలులోని సుందరయ్య భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వామపక్షాలు మూడో ప్రత్యామ్నాయంగా బలపడాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఎం, సిపిఐ సఖ్యతతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని, సిపిఎం 13 స్థానాలు, సిపిఐ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నాయని, మేయర్ పదవికి సిపిఎం అభ్యర్థిని నిలబెట్టినట్లు తెలిపారు.
వామపక్ష అభ్యర్థులను గెలిపిస్తే నీతివంతమైన, నిబద్ధతతో కూడిన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. స్వతంత్ర అభ్యర్థులను కలుపుకొని విజయవాడలో కమ్యూనిస్టు అభ్యర్థులు అందించిన తరహాలో ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎన్నికల సంఘం ప్రతిష్ఠను కాపాడాలని కోరారు.సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప మాట్లాడుతూ...స్వతంత్రంగా నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బైండోవర్ కేసులు పెడుతున్నారని అన్నారు. సిపిఎం మేయర్ అభ్యర్థి బి. శ్యామల మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తామని, నగరంలో కుక్కల బెడదను నివారించడంతో పాటు ఖాళీ స్థలాలు, పార్కుల్లో పెరిగిన ముళ్లకంపచెట్లను తొలగించి పరిశుభ్రతను మెరుగుపరుస్తామని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి. గౌస్ దేశాయ్, సిపిఐ నాయకులు జగన్నాథం, నగర సహాయ కార్యదర్శి డి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)