- స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి
- అభివృద్ధి ప్రణాళిక అమల్లో ప్రజలకే నిర్ణయాధికారం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర అభివృద్ధిలో స్థానిక సంస్థలు కీలకపాత్ర పోషించాలని, వాటిని బలోపేతం చేయాలని కోరుతూ 2026 అక్టోబర్ 28న మున్సిపల్, కార్పొరేషన్ల స్థానిక ఎన్నికల ప్రణాళికను సిపిఎం బుధవారం విడుదల చేసింది. 12 ఏళ్ల మోడీ పాలనలో ఇవి పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని పేర్కొంది. రాష్ట్రంలో టిడిపి, వైసిపి రెండూ మోడీ భజన చేస్తూ స్థానిక సంస్థలను నిర్లక్ష్యం చేశాయని, దేశంలో వామపక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే స్థానిక సంస్థలు బలంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థలు నిధులులేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని, ఉన్న కొద్దిపాటి ఆర్థిక వనరులను, అధికారాలనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హరించివేస్తున్నాయని తెలిపారు. బలవంతంగా ప్రపంచ బ్యాంకు ఆదేశిత సంస్కరణల అమలుకు పూనుకుంటుయని తెలిపారు. జివో 673, 74 తీసుకొచ్చి ప్రజలపై అదనపు భారాలు మోపుతున్నార మున్సిపల్ సేవలను ప్రయివేటుపరం చేస్తున్నారని, దీనివల్ల స్థానిక సంస్థలను తీవ్రంగా దెబ్బతీస్తూ, ప్రజలపై తీవ్రమైన భారాలు వేస్తున్నారని పేర్కొన్నారు.
ప్రణాళికలో పేర్కొన్న కీలకమైన 14 అంశాలు
(1) ప్రజా వ్యతిరేక 673, 74 జివోలను రద్దు చేయాలి. ఏజెన్సీలో పెసా, గ్రామ సభల అనుమతి లేకుండా ఎలాంటి భూకేటాయింపులు చేయరాదు. జివో 3ని పునరుద్దరించాలి. పోలవరం నిర్వాసితులను గుర్తించి పరిహారం ఇవ్వడంలో పంచాయతీలను భాగస్వామిని చేయాలి. 1/70ని పకడ్బందీగా అమలు జరపాలి. పోడు భూములకు పట్టాలివ్వాలి.
(2) రాష్ట్ర సొంత ఆదాయంలో 40 శాతం స్థానిక సంస్థలకు కేటాయించాలి. రాష్ట్ర కన్సాలిడేటేడ్ నిధుల నుండి గ్రాంట్స్ రూపంలో నిధులు ఇవ్వాలి. తలసరి గ్రాంట్లు అభివృద్ధి నిధులు ప్రతి ఏడాది తప్పని సరిగా ఇవ్వాలి.
(3) ఆర్థిక సంఘం సిఫార్సులు ఆమోదించి వచ్చే బడ్జెట్లో స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలి. వార్డు, గ్రామ సచివాలయాలను స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకురావాలి.
(4) ఎన్నికైన మేయర్లు, చైర్మన్లు, కౌన్సిళ్లు,, సర్పంచ్‌లు, మండల అధ్యక్షులు, జెడ్‌పి ఛైర్మన్లకు స్థానిక సంస్థల కార్యానిర్వహక పరిపాలనా అధికారాలు కల్పించాలి. నిధులు ఖర్చు చేసుకునేందుకు కౌన్సిళ్ళకు పూర్తి అధికారం ఇవ్వాలి.
(5) షరతులతో ముడిపెట్టి నిధులు ఇచ్చే విధానాన్ని విరమించాలి. స్థానిక సంస్థలపై పౌర సేవలు, మౌలిక సదుపాయాలు ప్రైవేటీకరణ, ఆస్తిపన్ను, ఇతర యూజర్ ఛార్జీలు విధించాలనే ఏకపక్ష చర్యలు ఉపసంహరించాలి.
(6) స్థానిక సంస్థల పరిధిలో ఉన్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేసి రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలు ఇవ్వాలి.
(7) స్థానిక సంస్థలకు బదిలీ చేయబడిన వివిధ రకాల పన్నులు, పన్నేతర ఆదాయాలపై తప్పని సరిగా స్థానిక సంస్థలకే అధికారం ఉండేలా చర్యలు చేపట్టాలి.
(8) గిరిజన ప్రాంతంలో 5వ షెడ్యుల్ ఏరియాల్లో ఉన్న గిరిజన పంచాయితీలకు ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వాలి. పీసా చట్టాన్ని అమలు చేయాలి. ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్ నిధులు ప్రతి సంవత్సరం ఇవ్వాలి.
(9) వినోదపు పన్ను, ప్రకటనల పన్ను, వృత్తిపన్ను, భూముల బదాలయింపుపై విధించే సర్‌ఛార్జి మోటర్ వెహికిల్ పన్ను వంటివి స్థానిక సంస్థలకే పూర్తిగా ఇవ్వాలి.
(10) ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలు, ఇతర సంస్థలు, తప్పని సరిగా 100 శాతం ఆస్తిపన్ను స్థానిక సంస్థలకు చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇస్తే ఆ నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇవ్వాలి.
(11) సిఎఫ్ఎంఎస్ నుండి స్థానిక సంస్థలను మినహాయించాలి. స్థానిక సంస్థలు చేపట్టే అభివృద్ధి పనులపై జిఎస్టి రద్దు చేయాలి.
(12) విద్యుత్ ఛార్జీలను డొమెస్టిక్ కేటగిరికి మార్చాలి. చిన్న పంచాయితీల విద్యుత్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.
(13) స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు పేర స్థానిక సంస్థల అధికారాలను కుదించే చర్యలు ఉపసంహరించాలి. స్థానిక సంస్థలకు సమాంతర వ్యవస్థల ఏర్పాటు విరమించాలి.
(14) మురికివాడలకు 40 శాతం నిధులు కేటాయించాలి. గ్రంథాలయ సెస్ స్థానిక సంస్థలకు ఇవ్వాలి.







కామెంట్‌లు (0)