సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు సిపిఎం మద్దతు

1 రోజు క్రితం

cpm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 09:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను ఉద్యోగ సంఘ నాయకులతో చర్చించి వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కమిటీ తరపున కార్యదర్శి వి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నోషనల్ ఇంక్రిమెంట్స్ వెంటనే, ఆటోమెటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అమలు చేయాలని, ప్రమోషనల్ చానల్ కల్పించాలని, నష్టదాయకమైన జిఓ నెంబరు 11ను రద్దు చేయాలని, ప్రొబేషన్ ఆలస్యమైన తొమ్మిది నెలలకు ఎరియర్స్ చెల్లించాలని తదితర సమస్యలపై ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి సిపిఎం రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయి ప్రజల సమస్యల పరిష్కారంలో, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న సచివాలయ ఉద్యోగుల ఆందోళన న్యాయ సమ్మతమైందని తెలిపారు. సుధీర్ఘకాలంగా వారెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని, వివిధ కేడర్లకు ప్రమోషన్ అవకాశాలు కల్పించలేదని పేర్కొన్నారు. ప్రొబేషన్ కాలానికి సంబంధించిన రెండు ఇంక్రిమెంట్లను ఇవ్వలేదని తెలిపారు. రకరకాల యాప్‌లు, వర్క్‌లతో సచివాలయ ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని, జిల్లా స్థాయిలో హెల్త్, గ్రామ సచివాలయ శాఖ అధికారుల మధ్య సమన్వయలోపం వల్ల హెల్త్ సెక్రటరీలపై తీవ్ర ఒత్తిడి పడుతోందని వివరించారు. పని ఒత్తిడితో ఇటీవల కాలంలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘ నాయకులతో చర్చించి పరిష్కరించాలని, తద్వారా ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్