మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పురపోరుకు సిపిఎం సమరశంఖం

9 గంటల క్రితం

పురపోరుకు సిపిఎం సమరశంఖం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 09:48 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

- ప్రచారంలో పార్టీ అభ్యర్థులు

ప్రజాశక్తి - యంత్రాంగం : ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగియడంతో పురపోరు కీలక దశకు చేరుకుంది. సిపిఎం అభ్యర్థులు సోమవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రజా సమస్యలను ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ నెల 28న జరిగే కార్పొరేషన్లు, మున్సిపల్‌ ఎన్నికల్లో సుత్తి–కొడవలి–నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నాయకులు కోరారు.

అనంతపురం జిల్లా 60, 62, 25వ డివిజన్ సిపిఎం అభ్యర్థులుగా పోటీ చేస్తున్న గీత, ఎ గుల్జార్, సాకే సరస్వతిలను గెలిపించాలని కోరుతూ అభ్యర్థులతో కలిసి ఆ పార్టీ రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యుడు వి రాంభూపాల్‌ ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ప్రజల కోసం పని చేసే సిపిఎంకు ఓటు వేసి ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ ప్రజలు, కార్మికులు, రైతులు, మహిళలు, విద్యార్థులు పక్షాన సిపిఎం నిరంతరం పోరాటాలు చేస్తోందన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని వివరంచారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలు గుర్తుకొచ్చి అనేక హామీలు గుప్పించే పార్టీలను నమ్మకుండా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా నిలిచే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో సిపిఎం నగర కార్యదర్శి వి రామిరెడ్డి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి, ఆయా కాలనీ నాయకులు పాల్గొన్నారు.

​ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపల్‌ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులు 3వ వార్డు నుంచి బండారు ధనలక్ష్మి, 6వ వార్డు నుంచి సుమాల బేబీ, 44వ వార్డు నుంచి కోనే కృష్ణ ‌పోటీ చేస్తున్నారు. వారి తరఫున సిపిఎం ప్రాంతీయ కమిటీ కార్యదర్శి పి. గోవిందు, కమిటీ సభ్యులు బి. రాముడు, ఎ. సురేష్‌కుమార్‌ ప్రచారం చేశారు. సిపిఎం అభ్యర్థులను ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్‌ కౌన్సిల్‌లో సిపిఎం తరఫున ప్రజాప్రతినిధులు ఉంటే ప్రజా సమస్యలను బలంగా వినిపించి, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తారని అన్నారు.

నెల్లూరు జిల్లా సుందరయ్య కాలనీ సి, డి బ్లాక్ ప్రాంతాల్లో 32వ డివిజన్ అభ్యర్థిని సాహిత్య ప్రపూర్ణ పర్యటించి ప్రచారం నిర్వహించారు. 72వ డివిజన్ కు కార్పొరేటర్‌‌గా పోటీ చేస్తున్న గజ్జె పరమేశ్వరి ముమ్మరంగా ఇంటింటి ప్రచారం చేశారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం, ప్రజలతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని, పేరు పేరునా పలకరిస్తూ ఆమె ముందుకు సాగారు.

విశాఖపట్నం జివిఎంసి ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరుతూ 96వ వార్డు సిపిఎం కార్పొరేటర్ అభ్యర్థి డి రమణ ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. రామచంద్రనగర్, స్వతంత్రనగర్‌లో ప్రచారం చేశారు. తనను గెలిపిస్తే రామచంద్రనగర్ డంపింగ్ యార్డు, అదాని గంగవరం పోర్టు కాలుష్య సమస్యలపై పోరాడతానని తెలిపారు. జివిఎంసి 106వ వార్డు సాలాపువానిపాలెంలో సిపిఎం కార్పొరేటర్‌ అభ్యర్థి బొద్దపు శ్రీనివాసరావును గెలిపించాలని కోరుతూ పార్టీ నాయకులు బొప్పే ఉమామహేశ్వరరావు, షేక్ నజీర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

​విజయనగరం జిల్లా కనపాక తారకరామ కాలనీలో 56వ డివిజన్ అభ్యర్థి పాలూరి రమణమ్మ ప్రచారం ప్రారంభించి ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిశారు. కనపాకలో ప్రజాసమస్యలు పరిష్కారం కోసం, ఇల్లు, ఇళ్ల స్థలాలు కోసం, పైడిమాంబ కాలనీలో అక్రమ వాటర్ ప్లాంట్ కివ్యతిరేకంగా పోరాడి విజయం సాధించామని వివరించారు. సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు మాట్లాడుతూ అధిక ధరలు, అదాని విద్యుత్ మీటర్లు, చెత్త పన్నుకు వ్యతిరేకంగా పోరాటాలు సిపిఎం నిర్వహించిందని, గత 20 ఏళ్లుగా ఈ పోరాటలాన్నిటిలోనూ రమణమ్మ ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు. స్థానికంగా ఉంటూ ప్రజల కోసం పని చేస్తున్న రమణమ్మను సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జగన్ మోహన్, నగర కమిటీ సభ్యులు బి రమణ, రామలక్ష్మి, డి రాము, రంభ శ్రీనివారావు, వి లక్ష్మి, జగదాంబ తదితరులు పాల్గొన్నారు.

​

​

​

​

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్