‘ఆస్టియో పోరోసిస్’ అనే వ్యాధిని “బోలు ఎముకల వ్యాధి”గా వ్యవహరిస్తారు. సాధారణంగా ముసలితనంలో ఎముకలు మెత్తబడడం, పెళుసుగా మారడాన్ని ఆస్టియో పోరోసిస్ వ్యాధిగా అర్థం చేసుకోవాలి. ప్రపంచ జనాభాలో 50 ఏళ్ళకు పైబడిన ప్రతి ముగ్గురు మహిళల్లో ఒక్కరు (33.33 శాతం), ప్రతి ఐదుగురు పురుషుల్లో ఒక్కరు (20 శాతం) ఈ ఎముకల బలహీనత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి బారిన పడిన వారికి చిన్న దెబ్బ తగిలినా ఎముకలు విరిగిపోయే దుస్థితి వస్తుంది. ఇలాంటి వారికి ఎముకలు విరిగితే ప్రాణ భయం, తీవ్ర నొప్పి, ఇతరులపై ఆధారపడే జీవితం, అంగవైకల్యాలతో పాటు దీర్ఘకాల వైద్యం అవసరం అవుతాయి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఎముకల పటిష్టతకు సంబంధించిన వ్యాయామాలు చేయడం మరిచిపోవద్దు. బరువులు ఎత్తడం, కండరాల పటిష్టతకు సంబంధించిన వ్యాయామాలు నిపుణుల సూచనల మేరకు చేయాలి. ఎముకల పటిష్టతకు ఉపకరించే కాల్షియం, విటమిన్- డి, ప్రోటీన్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రతి రోజు ఉదయం సూర్యరశ్మి ఉన్న ప్రదేశంలో ఉండడంతో విటమిన్-డి మెండుగా దొరుకుతుంది. శరీర బరువును అదుపు చేయడం, పొగ తాగడాన్ని నిరోధించడం, ఆల్కహాల్ సేవనాన్ని తగ్గించడంతో పాటు చెడు అలవాట్లకు దూరంగా వుండాలి. బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్న కుటుంబ సభ్యుల చరిత్ర, ఇతర వ్యాధులకు సంబంధించిన మందులు వాడడంతో కూడా కొన్ని సమయాల్లో ఆస్టియో పోరోసిస్ రావచ్చు. దీనిని అదుపు చేయాలంటే వైద్యం అందించడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, తరచుగా పరీక్షలు చేయించుకోవడం లాంటి చర్యలు సత్వరమే తీసుకోవాలి. తగు చికిత్సలతో పాటు ఆహార నియమాలు పాటించడం, స్థూలకాయం రాకుండా చూసుకోవడం, ఉత్తమ మార్గాలని గమనించాలి.
(20 అక్టోబర్ ‘వరల్డ్ ఆస్టియో పోరోసిస్ డే’)
- డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి,
సెల్: 9949700037







కామెంట్‌లు (0)