మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజాస్వామ్యానికి హాని

2 గంటల క్రితం

protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 05:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నగర, పుర పాలికల్లో మూడు రోజుల నామినేషన్ల ఘట్టం హింసాత్మకం కావడం ప్రజాస్వామ్యానికి కళంకం. పలు చోట్ల అధికార టిడిపి కూటమి దౌర్జన్యాలు కంచే చేను మేసిన చందం. శాంతియుతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ప్రభుత్వ బాధ్యత. కాగా అధికారంలో పాల్పంచుకున్న మంత్రులు, ఎంఎల్‌ఏలే కర్త, కర్మ, క్రియగా వ్యవహరించి తమ వారితో ఘర్షణలకు ఉసిగొల్పడం అభ్యంతరకరం. అర్బన్‌ ‌లోకల్‌ బాడీల్లో నామినేషన్ల ప్రక్రియ శుక్ర-శని- ఆదివారాల్లో నిర్వహించగా మూడు రోజులూ ఉద్రిక్తతల నడుమే కొనసాగింది. నామినేషన్లు వేయనీకుండా అడ్డుకోవడం, పత్రాలను బలవంతంగా లాక్కొని చించివేయడం, నామినేషన్‌ ‌కేంద్రాలకు రానీకుండా అటకాయింపులు, కిడ్నాప్‌‌లు, బెదిరింపులు, రాళ్లు రువ్వడం, కర్రలు, కత్తుల వంటి మారణాయుధాలతో దుండగుల స్వైర విహారం చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఆటవిక రాజ్యంలో ఉన్నామా అన్న సందేహం కలుగుతుంది. నామినేషన్ల దగ్గరే సుపారీ గ్యాంగ్‌‌లు తుపాకులతో పోలీసులకు పట్టుబడటం పరాకాష్ట. పుంగనూరులో ప్రతిపక్ష వైసిపి ఎంపి మిథున్‌‌రెడ్డిపై దాడి, రాయచోటిలో వైసిపి కార్యాలయం ధ్వంసం, కార్లకు నిప్పు, కడప, పులివెందులలో అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు గాలిలో కాల్పులు, లాఠీఛార్జీలు శాంతి భద్రతలను ప్రశ్నిస్తున్నాయి. తిరుపతి, ధర్మవరం, రాజంపేట, కమలాపురం, మైదుకూరు, బద్వేలు, దాచేపల్లి, గురజాల... చాలా చోట్ల అధికారపార్టీ దాష్టీకాలు నడిచాయి. తిరుపతి, కడప, బద్వేలులో వామపక్ష పార్టీ అభ్యర్థుల నామినేషన్లనూ అడ్డుకున్నారు.

నామినేషన్ల సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘర్షణలకు కారణం మీరంటే మీరంటూ అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొత్తవేమీ కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి జగన్‌ పార్టీని ‌దావుద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌‌గా, టిడిపిని జగన్‌ తాలిబాన్లతో పోల్చారు. ఎన్నికల్లో అధికార కూటమి అరాచకాలకు పాల్పడుతోందని, నిలువరించాలని రాష్ట్ర గవర్నర్‌‌ను, ఎన్నికల కమిషనర్‌‌ను ‌మాజీ సిఎం జగన్‌ కలిసి విజ్ఞప్తి చేశారు. రాజ్యం హింసకు పాల్పడుతున్నప్పుడు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని ప్రతిపక్షాలు కలిసి శాంతి నెలకొల్పాలని అభ్యర్థించవచ్చు. తమ హయాంలో స్థానిక ఎన్నికల్లో పెచ్చరిల్లిన అప్రజాస్వామిక చర్యలను వైసిపి దాటవేయడం సబబు కాదు. వైసిపి జమానాలో స్థానిక ఎన్నికల వేళ ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి గగ్గోలు పెట్టింది. ఎంపిటిసి, జెడ్‌‌పిటిసి ఎన్నికలను బాయికాట్‌ ‌చేసింది. రాష్ట్రపతి పాలన పెట్టాలని, పారామిలటరీని దించాలని కేంద్రాన్ని కోరింది. సేమ్‌ ‌సీన్‌ ఇప్పుడు రివర్స్‌ అయింది. ప్రతిపక్ష టిడిపి ప్రభుత్వ అరాచకాలపై నాడు ప్రతిపక్షంలో ఉండగా టిడిపి ఏ డిమాండ్లయితే చేసిందో ప్రస్తుతం విపక్షంలో ఉన్న వైసిపి వాటినే ఎత్తుకుంది. తాము అధికారంలోకి వస్తే ఎవ్వరినీ వదిలిపెట్టబోమని స్వయంగా జగన్‌ ‌హెచ్చరించడం ద్వారా తామూ అవే అరాచకాలు కొనసాగిస్తామనడం ఆక్షేపణీయం.

కళ్లముందు అరాచకాలు కనబడుతున్నా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సిన ఎస్‌ఇసి ఏం చేస్తున్నదనేది సగటు పౌరుడి ప్రశ్న. ఆటంకాలు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఎస్‌ఇసి హెచ్చరికలు మీడియాకే పరిమితమని నామినేషన్ల సందర్భంగా నెలకొన్న హింసతో తెలిసిపోతుంది. పోలీసుల ప్రేక్షకపాత్ర, వాళ్లే అధికార కూటమికి కొమ్ము కాయడం ఆందోళన కలిగిస్తుంది. ఆన్‌‌లైన్‌, సిసి కెమెరాల వంటి అధునాతన నిఘా ఉన్నప్పటికీ పోటీ లేకుండా ఎన్నికలు ఏకగ్రీవాలు కావడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. దర్శి, గుత్తిలో ప్రతిపక్ష వైసిపి పోటీలో లేదు. రాయచోటిలో వేరెవ్వరూ నామినేషన్లు వేయనందున ఏకగ్రీవం అయింది. మైదుకూరులో నామినేషన్‌ ‌పత్రాలు చినిగినందున అక్కడ ఎన్నిక వాయిదా పడింది. పుంగనూరులో తాము పోటీ చేయడంలేదని వైసిపి ప్రకటించింది. నామినేషన్ల పరిశీలన,ఉపసంహరణ నాటికి ఇంకెన్ని ఏకగ్రీవాలవుతాయో తెలీదు. ఇదీ పుర పోరు పరిస్థితి. వరుసనే ఎంపిటిసి, జెడ్‌‌పిటిసి, గ్రామ పంచాయతీ ఎన్నికలూ ఉన్నాయి. ఆ ఎన్నికలను స్వేచ్ఛాయుతంగా పూర్తి చేయాల్సిన ఎస్‌ఇసి స్వయం ప్రతిపత్తితో నడుచుకుంటే ప్రజాస్వామ్యానికి అర్థం పరమార్థం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్