- నలుగురి మృతి
- సిఎం ఇంటి ముందు మృతదేహాలతో ఆందోళన
- ఇంఫాల్‌లో ఉద్రికత్త పరిస్థితులు
ఇంఫాల్: దాదాపు నాలుగేళ్లు గడుస్తున్నా.. మణిపూర్‌లో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. రాష్ర్టంలో సోమవారం మరోసారి తీవ్ర హింసాత్మక ఘటనలు తలెత్తాయి. తాజాగా జరిగిన రెండు వేర్వురు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురు అదృశ్యమయ్యారు. దీంతో స్థానికులు నిరసనకు దిగారు. రెండు మృతదేహాలను బిజెపి ముఖ్యమంత్రి నివాసం వద్దకు తీసుకొచ్చి ఆందోళన చేపట్టడంతో ఇంఫాల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను అడ్డుకుని, మృత దేహాలను పోలీసులు బలవంతంగా తొలగించారు.
ఎడతెగని కాల్పులు..
ఆదివారం రాత్రి జరిగిన మొదటి సంఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మైతేయిలు, ముస్లింలు నివసించే ఒక ప్రాంతంలో జరిగిన సంగీత కార్యక్రమం సందర్భంగా హింస చెలరేగింది. అక్కడ రాళ్ల దాడి, కాల్పులు జరగడంతో గుంపులోని పలువురు గాయపడ్డారు. ఆ తర్వాత 24 ఏళ్ల యువకుడు బుల్లెట్ గాయాలతో మరణించాడు. తరువాత ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖమెన్‌లోక్‌లో ఉదయం 7గంటల సమయంలో జరిగిన మరో ఘటనలో ముగ్గురు మృతి చెందారు. సమీపంలోని కొండలకు కట్టెలు సేకరించడానికి వెళ్లిన సుమారు 30 గ్రామస్తులపై సాయుధులు కాల్పులు జరిపారు. ముగ్గురు గ్రామస్థులను సాయుధులు కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. మరో ముగ్గురు అదృశ్యమయ్యారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలు స్థానికుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. దీంతో వారు రెండు మృతదేహాలను తీసుకుని ఇంఫాల్‌లో అత్యంత భద్రత గల బంగ్లా ముఖ్యమంతి నివాసం వద్ద చేరుకున్నారు. మృతదేహాలతో ఆందోళనకు దిగారు. దీంతో నిరసనకారుల్ని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు, లాఠీఛార్జికి పాల్పడ్డారు. అనంతరం మృతదేహాలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ నిరసన సమయంలో ముఖ్యమంత్రి ఖేమ్ చంద్ సింగ్ ఇంట్లో ఉన్నారా ? లేదా అనేది తెలియలేదు.
కట్టెలకు వెళ్లిన వారిపై దాడి..
స్థానిక ఎమ్మెల్యే థోక్‌చోమ్ లోకేశ్వర్ సింగ్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంఫాల్ ఈస్ట్, కాంగ్‌పోక్పి జిల్లాల సరిహద్దు సమీపంలోని అటవీ ప్రాంతంలో కట్టెలు సేకరించడానికి వెళ్లినప్పుడు వారిపై కాల్పులు జరిగాయి. మృతుల్ని 35 ఏళ్ల అరుబమ్ రోనిల్ (రోనిన్ అని కూడా పిలుస్తారు), 44 ఏళ్ల లైరెన్‌లక్‌పామ్ ఇనాబి, 32 ఏళ్ల క్షేత్రిమయుమ్ సుశీల్‌గా గుర్తించారు. ఈ కాల్పులపై అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని, ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న సినాయ్ క్యాంప్ గా గుర్తించబడిన సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ శిబిరాన్ని తొలగించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. 2023 మేలో మణిపూర్‌లో హింసాకాండ ప్రారంభమైన సంగతి తెలిసిందే. మైతేయిలు, కుకీలపై దాడులు జరుగుతున్నాయి. తాజా ఘటనలు ఈ రెండు గ్రూపుల మధ్య అపనమ్మకాన్ని మరింత పెంచే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇంఫాల్ ఈస్టు-కాంగ్‌పోక్పి జిల్లా మధ్య ఉన్న ఈ సున్నితమైన ప్రదేశంలో పరిస్థితి మరింత తీవ్రమైతే ఇప్పటికే కొనసాగుతున్న హింసాకాండ మరింతగా పెరుగుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.







కామెంట్‌లు (0)